Portugal Health Minister Resigns: 


మృతికి బాధ్యత వహిస్తూ..


పోర్చుగల్‌లో భారత్‌కు చెందిన మహిళా టూరిస్ట్ మృతికి బాధ్యత వహిస్తూ ఆ దేశ ఆరోగ్య మంత్రి మార్టా టెమిడో రాజీనామా చేశారు. పోర్చుగల్‌ లోనే అతి పెద్ద ఆసుపత్రిగా పేరొందిన లిస్బన్ హాస్పిటల్‌లో ఓ గర్భిణి నొప్పులతో బాధ పడుతూ చేరారు. అయితే...అక్కడి మెటర్నటీ వార్డ్‌ నిండిపోవటం వల్ల అక్కడి నుంచి వేరే చోటకు తరలించారు. ఈ క్రమంలోనే ఆ గర్భిణి గుండెపోటుతోమరణించారు. దీనిపై అక్కడ పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. అంత పెద్ద ఆసుపత్రిలో అలా ఎలా నిర్లక్ష్యంగా వహిస్తారంటూ మండి పడ్డారంతా. దేశంలోని ప్రభుత్వ ఆసుపత్రుల తీరుపైనా చర్చకు తెర తీసింది. ఈ క్రమంలోనే...ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ మార్టా టెమిడో...తన పదవి నుంచి తప్పుకున్నారు. ఆ మహిళ మృతి చెందినప్పటికీ...పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. శిశువు ఆరోగ్యంగా ఉన్నట్టు అక్కడి వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని ప్రధాని ఆంటోనియో కోస్టా ఆదేశించారు. 






ఆరోగ్య రంగంలో కుదుపులు..


నిజానికి పోర్చుగల్‌లో ఆరోగ్య రంగం ఎన్నో సమస్యలు ఎదుర్కొంటోంది. 48 ఏళ్ల మార్టా టెమిడో దాదాపు 2018 నుంచి ఆరోగ్య మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సెంటర్ లెఫ్ట్ సోషలిస్ట్ ప్రభుత్వంలో అత్యంత కీలకమైన సభ్యురాలిగా ఉన్నారు. కొవిడ్ సంక్షోభ సమయంలోనూ బాగానే పని చేశారు. అయితే ఆమె కొన్ని రోజులుగా సొంత పార్టీ నుంచే వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోని ఎమర్జెన్సీ సర్వీస్‌లను ఉన్నట్టుండి మూసివేయటమే ఇందుకు కారణం. స్టాఫ్ తక్కువగా ఉంటోందన్న కారణంగా...మెటర్నటీ వార్డ్‌లను కూడా మూసేశారు. ఇది కాస్తా...ఆమెపై ఒత్తిడి పెంచింది. భారతీయ మహిళతో పాటు అంతకు ముందు ఇద్దరు మహిళలు కూడా ఇదే విధంగా అత్యవసర వైద్యం అందక మృతి చెందారు. స్టాఫ్ తక్కువగా ఉందన్న కారణంగా..ఓ హాస్పిటల్ నుంచి మరో హాస్పిటల్‌కు తరలించే క్రమంలోనే చనిపోతున్నారు. గైనకాలజీలో వైద్య సిబ్బంది కొరత ఎక్కువగా ఉంటోంది. విదేశాల నుంచి రప్పించి కొందరితో వైద్య సేవలు అందిస్తున్నప్పటికీ...అవి చాలటం లేదు. ఉన్న పడకలూ సరిపోక...ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ సమస్యలకు పరిష్కారం చూపించటంలో మార్టా టెమిడో విఫలమయ్యారన్న విమర్శలు మొదలయ్యాయి. 


Also Read: Bihar Special Status : ఏపీ, బీహార్‌లలో కేసీఆర్ స్ట్రాటజీ ప్రత్యేకహోదా - పట్నాలో చేసిన ప్రకటన లోగుట్టు ఇదేనా ?


Also Read: Dumka Killing: దుంకా కిల్లింగ్ కేసులో నిందితుడిపై పోక్సో కేసు, విచారణ వేగవంతం అవ్వాలని సీఎం ఆదేశాలు