PM Modi France Visit:
ఘన స్వాగతం..
ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం పలికారు అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్. ఫ్రాన్స్‌కి స్వాగతం అంటూ హిందీలో ట్వీట్ చేశారు. పారిస్‌కి వచ్చిన మోదీని ఆత్మీయంగా కౌగిలించుకున్నారు. ఫ్రెంచ్ నేషనల్ డే వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. భారత్, ఫ్రాన్స్ మధ్య ద్వైపాక్షిక బంధాలకు పాతికేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ పర్యటనను చాలా కీలకంగా భావిస్తున్నాయి రెండు దేశాలు. ఈ క్రమంలోనే మేక్రాన్ ఆసక్తికర ట్వీట్ చేశారు.
"భారత్ ఫ్రాన్స్ మధ్య ద్పైపాక్షిక బంధాలు బలపడి పాతికేళ్లు అవుతోంది. ఇప్పటికీ అదే విశ్వాసంతో పరస్పరం సహకరించుకుంటున్నాయి. భవిష్యత్‌లో ఈ బంధం మరింత బలోపేతం అవుతుంది. నరేంద్ర మోదీజీ వెల్‌కమ్ టు ప్యారిస్"
- ఇమ్మాన్యుయేల్ మేక్రాన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు
అరుదైన గౌరవం..
ప్రధాని నరేంద్ర మోదీకి ఫ్రాన్స్‌లో అడుగు పెట్టిన వెంటనే ఆయనకు మిలిటరీ స్థాయిలో స్వాగతం లభించింది. ఇలాంటి అరుదైన గౌరవం పొందిన తొలి భారత ప్రధానిగా మోదీ రికార్డు సృష్టించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్‌తో పాటు ఆయన సతీమణి మోదీని ఆహ్వానించారు. స్పెషల్ డిన్నర్ కూడా ఏర్పాటు చేశారు. డిన్నర్‌కి ముందు ప్రధాని మోదీ అక్కడి ఇండియన్ కమ్యూనిటీని ఉద్దేశిస్తూ మాట్లాడారు. ఆ తరవాత ఫ్రాన్స్‌తో UPI డీల్ ప్రకటించారు. అంటే...ఇకపై ఫ్రాన్స్‌లోనూ UPI చెల్లింపులు అందుబాటులోకి వస్తాయి. ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లే ఇండియన్ టూరిస్ట్‌లు ఇకపై UPI చెల్లింపులు చేసుకోవచ్చని స్పష్టం చేశారు మోదీ. ఆయన ప్రసంగిస్తుండగా అక్కడి ప్రజలు మోదీ మోదీ అంటూ నినాదాలు చేశారు.