ఏపీ రాష్ట్రంలోని ఇడుపులపాయ, ఒంగోలు, నూజివీడు, శ్రీకాకుళంలోని ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూలును ఆర్జీయూకేటీ అధికారులు ప్రకటించారు. దీనిప్రకారం జులై 20 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభంకానుంది. నూజివీడులో జులై 20, 21 తేదీల్లో, ఇడుపులపాయలో జులై 21,22 తేదీల్లో; ఒంగోలు, శ్రీకాకుళంలోని ఎచ్చెర్ల ట్రిపుల్ఐటీ క్యాంపస్‌కు జులై 24-25 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్ ఐటీల పరిధిలో మొత్తం 4,040 సీట్లలో ప్రవేశాలు కల్పించనున్నారు. కౌన్సెలింగ్‌కు సంబంధించిన కాల్ లెటర్లను విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులు తర ఆర్జీయూకేటీ అప్లికేషన్ నెంబరు, పదోతరగతి హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి కాల్ లెటర్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.


ఫలితాల కోసం క్లిక్ చేయండి..
కౌన్సెలింగ్ కాల్ లెటర్ల కోసం క్లిక్ చేయండి..


ఆర్జీయూకేటీ ఆధ్వర్యంలోని 4 ట్రిపుల్‌ ఐటీలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను గురువారం (జులై 13) విజయవాడలో మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేసిన సంగతి తెలిసిందే. నాలుగు ట్రిపుల్‌ఐటీల్లో ఈడబ్ల్యూఎస్‌ కోటా 10శాతంతో కలిపి 4,400 సీట్లు ఉండగా.. దివ్యాంగులు, ఎన్‌సీసీ, క్రీడలు, స్కౌట్, సైనికోద్యోగుల కోటాకు సంబంధించిన 360 మినహా మిగతా సీట్లకు జాబితాను ప్రకటించారు. అధికారిక వెబ్‌సైట్‌లో ఎంపికైన అభ్యర్థుల జాబితాలను పీడీఎఫ్ ఫార్మాట్‌లో అందుబాటులో ఉంచారు. ఇడుపులపాయ, ఒంగోలు, నూజివీడు, శ్రీకాకుళంలోని ఒక్కో ట్రిపుల్‌ ఐటీలో 1000 చొప్పున సీట్లు అందుబాటులో ఉన్నాయి. ట్రిపుల్‌ఐటీ ప్రవేశాల్లో మొదటి 20 స్థానాల్లో నిలిచిన అభ్యర్థుల్లో నలుగురు మినహా మిగతా 16మంది నూజివీడు ప్రాంగణాన్నే ఎంపిక చేసుకున్నారు. నలుగురు ఆర్‌కే వ్యాలీ క్యాంపస్‌కు ఐచ్ఛికం ఇచ్చారు. ఒంగోలు, శ్రీకాకుళం ప్రాంగణాల్లో మౌలికసదుపాయాలు లేకపోవడంతో ఈ రెండింటిలో చేరేందుకు టాపర్లు ఆసక్తి చూపడం లేదు.


Website


64 శాతం సీట్లు బాలికలకే..
రాజీవ్‌ గాంధీ విజ్ఞాన సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) ఆధ్వర్యంలోని ట్రిపుల్‌ఐటీల్లో ఈ ఏడాది సైతం బాలుర కంటే బాలికలకు ఎక్కువ సీట్లు లభించాయి. మొత్తం సీట్లలో బాలికలకు 64 శాతం దక్కాయి. ఇడుపులపాయ, ఒంగోలు, నూజివీడు, శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీల్లో 4,040 సీట్లకు జాబితాను ప్రకటించగా.. బాలికలు 2,585, బాలురు 1,455మంది సీట్లు పొందారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 23,628, ప్రైవేటు బడులకు చెందిన 14,727మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు. వీరిలో ప్రభుత్వ పాఠశాలల నుంచి 3,345(82.79%), ప్రైవేటు నుంచి 695(17.20%)మంది సీట్లు పొందారు. స్థానికేతర కోటాలో తెలంగాణకు చెందిన 88 మంది విద్యార్థులకు సీట్లు లభించాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు 4శాతం వెయిటేజీ ఇచ్చారు. ఒక్కో సబ్జెక్టుకు నాలుగు మార్కుల చొప్పున అదనంగా 24మార్కులు కలిపారు. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లా నుంచి 10.02%, వైయస్‌ఆర్‌ జిల్లా నుంచి 6.66%, విజయనగరం జిల్లా నుంచి 6.36% మంది ఎంపికయ్యారు. అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి 0.23%మంది సీట్లు పొందారు. ఆగస్టు మొదటి వారం నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి.


కౌన్సెలింగ్‌కు ఈ సర్లిఫికేట్లు సిద్ధం చేసుకోండి..


కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా అవసరమైన అన్ని డాక్యుమెంట్లు తీసుకెళ్లాల్సి ఉంటుంది. రెండు సెట్ల జిరాక్స్ కాపీలతోపాటు, ఒరిజినల్ సర్టిఫికేట్లతో కౌన్సెలింగ్‌కు హాజరుకావాల్సి ఉంటుంది.


1) పదోతరగతి పరీక్షల హాల్‌టికెట్


2) పదోతరగతి మార్కుల జాబితా (గ్రేడ్-షీట్)


3) 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ/బోనఫైడ్ సర్టిఫికేట్లు.


4) రెసిడెన్స్ సర్టిఫికేట్


5) క్యాస్ట్/కమ్యూనిటీ/ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్.


6) ఇన్‌కమ్ సర్టిఫికేట్ (01.04.2023 తర్వాత జారీచేసినది).


7) విద్యార్థి ఫోటోలు-6, రెండు తల్లిదండ్రుల ఫోటోలతోపాటు, ఇద్దరు గార్డియన్‌ల ఫోటోలు ఉండాలి. 


8) ఫ్యామిలీ రేషన్ కార్డు కాపీ. 


9) ఆధార్ కార్డు. 


10) చదువు కోసం బ్యాంకు రుణం కోరేవారు అందుకు సంబంధించిన డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన దరఖాస్తు క్యాంపస్‌లో బ్యాంకులో అందుబాటులో ఉంటుంది. దరఖాస్తుతోపాటు కింది డాక్యుమెంట్లు అవసరమవుతాయి.


➥ 4 సెట్ల సర్టిఫికేట్ కాపీలు 


➥ తల్లిదండ్రులు ఉద్యోగులైతే ఎంప్లాయి ఐడీ కార్డు కాపీ. 


➥ గడచిన 3 నెలల శాలరీ సర్టిఫికేట్లు (పే స్లిప్స్) 


➥ విద్యార్థి, తల్లిదండ్రుల పాన్‌కార్డు


➥ రేషన్ కార్డు/పాన్‌కార్డు/ఓటరు ఐడీకార్డు/ఆధార్ కార్డు (విద్యార్థి, తల్లిదండ్రుల)


➥ చివరి 6 నెలల బ్యాంకు స్టేట్‌మెంట్.


➥ విద్యార్థి ఫోటోలు-6, రెండు తల్లిదండ్రుల ఫోటోలు నాలుగు అవసరమవుతాయి.


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial