PM Modi: దేశానికి దూరంగా ఉన్నప్పుడు ‘భారత్ మాతా కీ జై’ అనే మాట వింటే ఇండియాలో ఉన్నట్లే అనిపిస్తుందని ప్రధాని మోదీ గురువారం పారిస్‌లోని ప్రవాస భారతీయులను ఉద్దేశించి అన్నారు. అంతకు ముందు పారిస్‌లో అడుగు పెట్టిన ప్రధాని నరేంద్ర మోదీకి.. ఫ్రాన్స్‌ ప్రధాని బోర్న్‌ విమానాశ్రయంలో  ఘన స్వాగతం పలికారు. అక్కడి భారతీయులను ఉద్దేశించి ప్రసంగించేందుకు ఫ్రెంచ్ రాజధానిలోని లా సీన్ మ్యూజికేల్ చేరుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఓ సభలో మాట్లాడుతూ.. "భారత్, ఫ్రాన్స్ మధ్య విడదీయరాని స్నేహం" గురించి ప్రస్తావించారు. తాను చాలాసార్లు ఫ్రాన్స్‌కు వచ్చానని.. కానీ ఈసారి నా పర్యటన ప్రత్యేకమైనదని మోదీ వివరించారు. ఎందుకంటే జూన్ 14వ తేదీ (ఈరోజు) ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం. ఆయన నేరుగా ఫ్రాన్స్ వచ్చి ప్రజలకు శుభాకాంక్షలు చెప్పడం సంతోషంగా ఉందన్నారు. తనను ఆహ్వానించినందుకు ఫ్రాన్స్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే జాతీయ దినోత్సవం సందర్భంగానే ఫ్రెంట్ ప్రధాని తనను దేశానికి ఆహ్వానించారని.. ఈరోజు తన స్నేహితుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో కలిసి జాతీయ దినోత్సవ పరేడ్‌కు హాజరవుతానని వివరించారు. ఇది భారతదేశం, ఫ్రాన్స్‌ల మధ్య విడదీయరాని స్నేహానికి ప్రతిబింబం అని చెప్పుకొచ్చారు. 






'భారత వృద్ధి'


ప్రస్తుతం ప్రపంచంలో భారతదేశం పాత్ర వేగంగా మారుతోందని ప్రధాని మోదీ తెలిపారు. అలాగే భారతదేశం G20 అధ్యక్షత వహిస్తోందని.. మొత్తం G20 సమూహం భారతదేశ సామర్థ్యాన్ని చూస్తోందని చెప్పారు. వాతావరణ మార్పు, ఉగ్రవాదం, రాడికలిజం వ్యతిరేకత.. ఇలా ఏ అంశాన్ని తీసుకున్నా ప్రపంచం అంతా భారతదేశం వైపు చూస్తుందని ప్రధాని వివరించారు. 






భారత్ - ఫ్రాన్స్ సంబంధాలపై


ప్రజల మధ్య అనుసంధానం అనేది భారతదేశం - ఫ్రాన్స్ భాగస్వామ్యానికి బలమైన పునాది అని ప్రధాని మోది చెప్పారు. భారతదేశం మరియు ఫ్రాన్స్ 21వ శతాబ్దపు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయని.. అందువల్ల ఈ కీలక సమయంలో, మన దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రాముఖ్యత మరింత పెరిగింది అన్నారు.


'యూపీఐ ఇన్ ఫ్రాన్స్'


ఈ కార్యక్రమంలో ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ.. భారతీయులు ఇప్పుడు యూపీఐ చెల్లింపు పద్ధతిని ఉపయోగించి ఫ్రాన్స్‌లో భారతీయ రూపాయలలో చెల్లింపులు చేయవచ్చని అన్నారు. ఫ్రాన్స్‌లో యూపీఐ వినియోగానికి సంబంధించిన ఒప్పందానికి అనుగుణంగా.. యూరోపియన్ దేశంలో నగదు రహిత తక్షణ చెల్లింపు భారతీయ ఆవిష్కరణ కోసం కొత్త మార్కెట్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. ఫ్రాన్స్ ప్రభుత్వ సహకారంతో మార్సెయిల్‌లో కొత్త కాన్సులేట్‌ను ప్రారంభించాలని భారత ప్రభుత్వం నిర్ణయించినట్లు కూడా వెల్లడించారు. 






నా మనసంతా చంద్రయాన్ ప్రయోగంపైనే ఉంది


పేరుకే తాను ఫ్రాన్స్ లో ఉన్నాను అని.. కానీ మనసంతా చంద్రయాన్ ప్రయోగంపైనే ఉందని ప్రధాని మోదీ అన్నారు. ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా అక్కడి ప్రవాస భారతీయులతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. భారతీయులు ఎక్కడ ఉన్నా దేశం క్షేమం కోసమే ఆలోచిస్తారని ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా నాకు భారత్ లో చంద్రయాన్ కౌంట్ డౌన్ శబ్దమే వినపడుతోందని అన్నారు మోదీ.