బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ వే ప్రారంభం..
ప్రధాని నరేంద్ర మోదీ యూపీలోని జలౌన్ జిల్లాలో బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ వేను ప్రారంభించారు. ఈ 296 కిలోమీటర్ల ఫోర్ లేన్ రహదారి నిర్మాణానికి రూ.14,850 కోట్లు ఖర్చు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ ఎక్స్‌ప్రెస్ వేతో స్థానికంగా పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటవటమే కాకుండా కనెక్టివిటీ కూడా పెరగనుంది. చిత్రకూట్‌ను లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేతో అనుసంధానించే ఈ నాలుగు వరుసల రహదారికి 2020 ఫిబ్రవరి 29న ఫౌండేషన్ స్టోన్ వేశారు ప్రధాని మోదీ. ఉత్తర్‌ప్రదేశ్ ఎక్స్‌ప్రెస్ వేస్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అథారిటీ(UPEIDA) నేతత్వంలో ఈ రహదారి నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతానికి 4 లేన్ హైవే అయినప్పటికీ...భవిష్యత్‌లో దీన్ని ఆరు వరుసలకు విస్తరించాలని చూస్తున్నారు. రహదారి భద్రత విషయంలోనూ ఏ మాత్రం వెనకాడకుండా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF)ను అందుబాటులో ఉంచుతారు. వీరితో పాటు పోలీసులు కూడా అందుబాటులో ఉంటారు.
ఏడేళ్లలో జాతీయ రహదారుల సంఖ్య పెరిగింది: కేంద్రం
మోదీ ప్రభుత్వం మౌలిక వసతులు అందించటంపైనే ఎక్కువగా దృష్టి సారించిందని ఉన్నతాధికారులు వెల్లడించారు. ఇటీవలి బడ్జెట్‌లో మునుపెన్నడూ లేని విధంగా రోడ్ ట్రాన్స్‌పోర్ట్, హైవేస్ మంత్రిత్వ శాఖకు రూ.1.99 లక్షల కోట్లు కేటాయించింది. 2013-14తో పోల్చి చూస్తే ఇది 550% ఎక్కువ అని కేంద్రం వివరిస్తోంది. ఏడేళ్లలో దేశంలో జాతీయ రహదారుల సంఖ్య 50% మేర పెరిగిందని వెల్లడించింది కేంద్రం. 2014 ఏప్రిల్ నాటికి 91,287 కిలోమీటర్ల జాతీయ రహదారులుండగా, 2021 డిసెంబర్ నాటికి ఈ సంఖ్య 1,41,000 కిలోమీటర్లకు పెరిగిందని లెక్కలతో సహా వివరిస్తోంది.