Palnadu News : పల్నాడు జిల్లా గురజాలలో విషాదం చోటుచేసుకుంది. పట్టణంలోని ఉర్దూ మదర్సా పాఠశాలలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. నకరికల్లు మండలం గుళ్ళపల్లి గ్రామానికి చెందిన ఒక బాలుడు మృతి చెందాడు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మెరుగైన చికిత్స కోసం విద్యార్థులను పిడుగురాళ్లలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మృతుడు సయ్యద్ వేమగిరి మున్నా (11) S/o అలియాజ్ అని పోలీసులు తెలిపారు. శనివారం ఉదయం అల్పాహారంలో గోంగూర చట్నీ తినటంతో విద్యార్థులకు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. మదర్సాలో సుమారు 30 మంది పిల్లలు చదువుతున్నారు.
గోంగూరు చట్నీ తిన్నాకే
'2006 నుంచి ఈ మదర్సా నడుస్తోంది. నిన్న రాత్రి ఒకతను ఫంక్షన్ చేసుకున్నారు. అతను గోంగూర ఇచ్చారు. ఉదయం పిల్లలకు వేడి అన్నం వండి పెట్టాం. గోంగూర తిన్నాక ఒక పిల్లాడు వాంతులు చేసుకున్నాడు. అతడ్ని ఆసుపత్రికి తీసుకెళ్లాం. డాక్టర్ ఇంజెక్షన్ ఇచ్చారు. తిరిగి వస్తుంటే అతడు మళ్లీ వాంతులు చేసుకున్నాడు. చూసే సరికి ప్రాణం పోయింది. మరికొంత మందికి వాంతులు అయ్యాయి.'- మదర్సా ప్రినిపల్
బాసర ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్
నిర్మల్ జిల్లా బాసరలోని ట్రిపుల్ ఐటీలో శుక్రవారం ఫుడ్ పాయిజన్ జరిగింది. మెస్ లో శుక్రవారం మధ్యాహ్నం ఎగ్ కర్రీ రైస్ తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. రెండు మెస్ లలో శుక్రవారం మధ్యాహ్నం విద్యార్థులకు ఆహారంగా ఎగ్ కర్రీ రైస్ ను అందించారు. అయితే ఎగ్ కర్రీ రైస్ తిన్న విద్యార్థులు గంటన్నర తర్వాత వాంతులు, విరేచనాలు చేసుకున్నారు. 350 మందికి పైగా విద్యార్థులు స్వల్ప వ్యవధిలోనే వాంతులు, విరేచనాలు చేసుకున్నారు. వారంతా హాస్టల్ గదుల నుంచి చికిత్సల కోసం ట్రిపుల్ ఐటీలోని ఆస్పత్రికి వచ్చారు.
పలువురికి తీవ్ర అస్వస్థత
ఫుడ్ పాయిజన్ తో అస్వస్థత చెందిన విద్యార్థులకు ట్రిపుల్ ఐటీ ఆసుపత్రి నిర్వాహకులు ప్రథమ చికిత్సలు నిర్వహించారు. తీవ్ర అస్వస్థతో ఉన్న పలువురు విద్యార్థులను రెండు అంబులెన్సులలో నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. ట్రిపుల్ ఐటీలోని ఆసుపత్రిలో వైద్య సిబ్బంది తక్కువగా ఉండడం, అస్వస్థత చెందిన విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో సత్వర వైద్య సేవలు అందించేందుకు అధికార యంత్రాంగం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే భైంసా, ముధోల్ ఆసుపత్రుల నుంచి వైద్యాధికారులను, ఆరోగ్య సిబ్బందిని బాసర ట్రిపుల్ఐటీకి తరలించారు.