వైట్ రైస్ తింటే షుగర్ లేవల్స్ పెరుగుతాయని భయపడతారు. అందుకే ఒక పూట మాత్రమే తింటూ రాత్రి వేళ టిఫిన్ లేదా తక్కువ కేలారీలు ఉండే ఆహారాన్ని తీసుకుంటారు. వాటికి బదులుగా చాలా మంది డయాబెటిక్ రోగులు బ్రౌన్ రైస్ తింటారు. రుచిగా లేకపోయినప్పటికీ ఆరోగ్యం కోసం దాన్ని తీసుకుంటారు. ఇది షుగర్ పేషెంట్స్ కి చాలా మంచి ఆహారం. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుంది. అందుకే పోషకాహార నిపుణులు ఎక్కువగా డయాబెటిక్ రోగులకు వైట్ రైస్ కి బదులుగా బ్రౌన్ రైస్ సిఫార్సు చేస్తారు. గ్లైసెమిక్ ఇండెక్స్ లో కూడా ఇది తక్కువ చక్కెర స్థాయిలను కలిగి ఉంటుందని నిరూపితమైంది. 


అసలేంటి ఈ గ్లైసెమిక్ ఇండెక్స్


గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) అనేది రక్తంలో చక్కెర స్థాయిలపై ఆహారం యొక్క ప్రభావం ఎంతగా ఉంటుందో కొలిచే పేరామీటర్ ఇది.  హార్వర్డ్ హెల్త్  పబ్లికేషన్స్ నివేదిక ప్రకారం ఉడికించిన బ్రౌన్  రైస్ GI స్కోర్ 68. ఇది GI మీడియం ఫుడ్ కేటగిరీ కిందకు వస్తుంది. ఇక ఉడికించిన వైట్ రైస్ GI స్కోర్ 73 గా ఉంది. వైతే రైస్ తినడం వల్ల అందులో ఉండే చక్కెర రక్తంలో కలిసి షుగర్ లేవల్స్ పెంచుతుంది. బ్రౌన్ రైస్ తక్కువ GI ఆహారం. అందువల్ల ఇది తీసుకుంటే షుగర్ అదుపులో ఉంటుందని బెంగళూరుకి చెందిన పోషకాహార నిపుణురాలు చెబుతున్నారు. ఇందులో ఉండే ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది. బ్రౌన్ రైస్ తినడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. అన్నం లావుగా కొద్దిగా గరుకుగా ఉండటం వల్ల తినేందుకు చాలా మంది ఆసక్తి చూపించారు. అందుకే బ్రౌన్ రైస్ తో రకరకాల వంటకాలు చేసుకుని తింటే రుచిగా ఉండటమే కాక తినాలనే ఇష్టం మీకు కలుగుతుంది.  


బ్రౌన్ రైస్ సలాడ్ 


రైస్ బాగా గడిగి నానబెట్టుకుని వండుకోవాలి. తర్వాత అందులోకి కొన్ని పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టొమాటో ముక్కలు వేసి కొంచెం రెడ్ పెప్పర్, గ్రీన్ పెప్పర్ వేసి బాగా కలుపుకోవాలి. అందులో కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకుని కొద్దిగా నిమ్మ కాయ రసం, కొట్టి మీరా వేసి ఆ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. అన్నీ పదార్థాలు సక్రమంగా అన్నానికి పట్టేలాగా చూడాలి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇలా చెయ్యడం వల్ల మీ నోటికి బ్రౌన్ రైస్ ఎంతో రుచిగా ఉంటుంది. ఇవే కాకుండా బ్రౌన్ రైస్ తో కూరగాయ ముక్కలు, కొద్దిగా మసాల పొడులు జోడించి పులావ్, కిచిడీ కూడా చేసుకోవచ్చు. ఈ రైస్ వండుకోవడానికి ముందు కొద్దిగా సేపు నానబెట్టుకోవాలి. ఎందుకంటే ఇది ఉడికేందుకు కొంచెం ఎక్కువ సమయం తీసుకుంటుంది. సరిగా ఉడకలేదంటే తినేందుకు ఇబ్బందిగా ఉంటుంది. 


Also read: ఆల్కలీన్ ఆహారాలు ఏమిటో తెలుసా? ఇవి తినడం చాలా ముఖ్యం


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు