Viral Video: మహారాష్ట్రలోని హరిహర్ కోట చాలా ఫేమస్ ట్రెక్కింగ్ ప్లేస్. నిటారుగా, ఇరుకైన రాతి మెట్లపై నుంచి శిఖరానికి వెళ్లడానికి చాలా మంది ఇష్టపడుతుంటారు. ఇప్పుడు కూడా అదే జరిగింది. ఈసారి పదుల సంఖ్యలో కాదు వందల సంఖ్యలో జనం ఈ ట్రెక్కింగ్‌కు వచ్చారు. వారంతా ప్రమాదకర రీతిలో ట్రెక్కింగ్ కోసం ఎగబడుతున్న జనం వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
మాహారాష్ట్రలోని హరిహర్ కోట భారతదేశంలోని అత్యంత ప్రమాదకరమైన ట్రెక్కింగ్ ప్రదేశాలలో ఒకటి. అలాంటి ప్రమాదకరమైన ప్రదేశానికి ఈస్థాయిలో జనం తరలి రావడం భద్రతాలోపాన్ని ఎత్తిచూపుతోంది. పొరపాటున తొక్కిసలాంటిది జరిగితే పరిస్థితి ఏంటనేది నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
వోక్ ఎమినెంట్ అనే X యూజర్ షేర్ చేసిన వీడియో చూస్తే చాలా మంది భయపడిపోతున్నారు. 3,676 అడుగుల ఎత్తులో క్యూకట్టిన జనసందోహాన్ని చూస్తున్న వారంతా హడలిపోతున్నారు. 60–70 డిగ్రీల నిటారుగా ఉన్న ప్రమాదకరమైన 200 అడుగుల రాతి మెట్లు ఎక్కుతున్న సందర్శకులు కనిపిస్తున్నారు. ఇరుకైన స్థలం వెళ్లేందుకు దారి లేకపోయినా, పడిపోయే ప్రమాదం ఉన్నప్పటికీ జనం మాత్రం అవేమీ పట్టించుకోవడం లేదు. శిఖరంపైకి వెళ్లేందుకు పోటీపడుతున్న వీడియో మాత్రం చూసే వాళ్లకు వెన్నులో వణుకుపుట్టిస్తోంది. కొండపై ఉన్న వారిలో చాలా మందికి నిలబడే స్థలం కూడా లేదు. చివరి అంచున నిలబడి పడిపోతామేమోనన్న భయం వీరిలో ఏ మాత్రం కనిపించడం లేదు. ఏదైనా తొక్కిసలాట లేదా ఇంకా ఏదైనా జరిగితే మాత్రం చాలా మంది ప్రాణాలు పోతాయని నెటిజన్లు ఆందోళనవ్యక్తం చేస్తున్నారు. ఈ హరిహర్ ఫోర్ట్‌కు వారాంతంలో భారీగా జనం వస్తుంటారు. ఇంకో ప్రమాదం జరగకుండా నియంత్రించాలని నెటిజన్లు రిక్వస్ట్ చేస్తున్నారు. లేకుంటే చిన్న తొక్కిసలాట లేదా ఎవరైనా బ్యాలెన్స్ కోల్పోతే మాత్రం పెను ప్రమాదానికి దారి తీయొచ్చని అంటున్నారు. వందలాది మంది చనిపోతారు. అని టైటిల్‌తో వీడియో పోస్టు చేశారు.
ఇంత ప్రమాదకర రీతిలో జనాలను ఎలా అనుమతించారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. "నాసిక్‌లోని అటవీ శాఖ దీనిని నియంత్రిస్తుంది. ఫీజు వసూలు చేస్తున్నారు. వారు రోజుకు 300 మందినే పంపించారు. కానీ అది వాస్తవంగా అమలు కావడం లేదు. ఇప్పుడు, వీడియో వైరల్ అవ్వడంతో పర్యాటకుల ప్రవేశాన్ని పరిమితం చేసినట్లు చెప్పారు. అది కూడా అమలుకావడం లేదని తేలింది. ఇప్పుడు అధికారులపై ఏం చర్యలు తీసుకున్నారు?" అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
మరొక నెటిజన్ ఇలా రాశాడు "అధికారులు ప్రతి విషయంలో జోక్యం చేసుకోలేరు. ప్రజలకు ఇంగిత జ్ఞానం ఉండాలి కదా, ప్రమాదకరమైన పరిస్థితుల్లో స్వయం నియంత్రణ ఉండొద్దా అని ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రతి ప్రమాదాన్ని కాపాడుతుందని ఆశించడం మమ్మల్ని మూర్ఖులను చేస్తుంది." అని చెప్పుకొచ్చారు.