Jasprit Bumrah News: మూలిగే నక్క మీద తాటి పండు పడినట్లు అయింది టీమిండియా తాజా పరిస్థితి. ఇప్పటికే తొలి టెస్టులో ఓడిపోయన బాధలో ఉన్న భారత జట్టుకు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా సేవలు దూరం కానున్నట్లు తెలుస్తోంది. వర్క్ లోడ్ మేనేజ్మెంట్ లో భాగంగా ఐదు టెస్టుల సిరీస్ లో కేవలం మూడింటిలోనే తను ఆడించనున్నట్లు కోచ్ గౌతం గంభీర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తొలి టెస్టు తర్వాత రెండో టెస్టులో తను ఆడేది అనుమానంగా ఉందని బోర్డు వర్గాలు పేర్కొంటున్నాయి. జూలై 2 న బర్మింగ్ హామ్ లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే బుమ్రా ఆడకపోతే అతని స్థానంలో ఎవరు ఆడేది అనేదానిపై సంధిగ్ధం నెలకొంది. లెఫ్టార్మ్ పేసర్ అర్షదీప్ సింగ్, ఆకాశ్ దీప్ సింగ్ లలో ఒకరిని ఆడించే అవకాశముంది. ఇక తొలి టెస్టులో భారీగా పరుగులు సమర్పించుకున్న ప్రసిధ్ కృష్ణను కూడా పక్కన పెట్టే అవకాశముంది.
జట్టులో మార్పులు ఖాయం..ఇక ప్లేయింగ్ లెవన్ లో పలు మార్పులు ఉండే అవకాశమున్నట్లు సమాచారం. మూడో నెంబర్లో సాయి సుదర్శన్ కు బదులుగా కరుణ్ నాయర్ ను ఆడించడంతోపాటు పేస్ ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ ప్లేస్ లో తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డిని బరిలోకి దించవచ్చు. మరో బ్యాటర్ కావాలనుకుంటే సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ లో ఒకరిని ఆడించవచ్చు. తొలి టెస్టులో భారత బౌలర్లలో బుమ్రా మాత్రమే రాణించాడు. తొలి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు తీసి ఇంగ్లాండ్ కు ముకుతాడు వేశాడు. తను చాలా ఎకానమీతో బౌలింగ్ చేసి ఇంగ్లాండ్ లో కాస్త కంగారూ పుట్టించాడు.
రెండో టెస్టులో ఆడించాలి..తొలి టెస్టు ఓటమిలో ఉన్న టీమిండియాకు బుమ్రాను రెండో టెస్టులో ఆడించాలని మాజీలు సూచిస్తున్నారు. బర్మింగ్ హామ్ లో బుమ్రా ఆడకపోతే చాలా కష్టమని, ఒకవేళ ఆ టెస్టులో ఓడిపోతే 2-0తో వెనుకంజలో ఉండి, పుంజుకోవడం కష్టమని వ్యాఖ్యానించాడు. రెండో టెస్టుకు, తొలి టెస్టుకు మధ్య గ్యాప్ వారానికపైగా ఉండటంతో బుమ్రాను ఆడిస్తే మంచిదని పేర్కొన్నాడు. కావాలంటే వ్యవధి తక్కువగా ఉన్న మూడో టెస్టును బుమ్రా స్కిప్ చేస్తే సరిపోతుందని తెలిపాడు. మరోవైపు ఐదు టెస్టులను ఆడించాలని దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ అభిప్రాయపడగా, గంభీర్ దాన్ని కొట్టిపారేశాడు. వర్క్ లోడ్ మేనేజ్మెంట్ లో భాగంగా బుమ్రాను మూడు టెస్టులు మాత్రమే ఆడిస్తామని నిర్ణయమైపోయిందని, ఇప్పుడు దాన్ని మార్చే అవకాశం లేదని తెలిపాడు. మున్ముందు చాలా క్రికెట్ ఆడాల్సి ఉండటంతో బుమ్రా సేవలు అవసరమని వివరణ ఇచ్చాడు. ఏదేమైనా ఇంకా ఆరు రోజుల సమయం ఉండటంతో బుమ్రా రెండో టెస్టు ఆడటంపై ఉత్కంఠ నెలకొంది.