Suryakumar Yadav underwent surgery: టీమిండియా క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్‌కు సర్జరీ పూర్తయింది. జర్మనీలో సూర్యకు స్పోర్ట్స్ హెర్నియాకు విజయవంతంగా సర్జరీ చేశారు డాక్టర్లు. దీని గురించి సూర్య కుమార్ యాదవ్ సోషల్ మీడియాలో ఆపరేషన్ తర్వాత ఒక ఫోటోను షేర్ చేస్తూ అప్‌డేట్ ఇచ్చాడు. 34 ఏళ్ల సూర్యకుమార్ యాదవ్ భారత క్రికెట్ జట్టుకు టీ20 కెప్టెన్‌గా సేవలు అందిస్తున్నాడు. రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత బీసీసీఐ సూర్యకు టీ20 సారథ్య బాధ్యతలు అప్పగించింది.
సూర్యకుమార్ యాదవ్ తన సోషల్ మీడియా అకౌంట్లో ఓ ఫోటోను షేర్ చేస్తూ, "లైఫ్ అప్‌డేట్, పొత్తికడుపు కుడి దిగువ భాగంలో స్పోర్ట్స్ హెర్నియాకు సర్జరీ పూర్తయింది. సర్జరీ సక్సెస్. ఇప్పుడు నేను కోలుకుంటున్నానని చెబుతున్నందుకు సంతోషంగా ఉంది. క్రికెట్ స్టేడయింలోకి సాధ్యమైనంత త్వరగా తిరిగి రావడానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను" అని రాసుకొచ్చాడు.
సూర్యకుమార్ యాదవ్ ఎప్పుడు తిరిగి వస్తాడు?
భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం ఇంగ్లండ్‌లో పర్యటిస్తోంది. 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు పూర్తయింది. దీని తర్వాత టీమిండియా ఆగస్టులో బంగ్లాదేశ్ పర్యటనలో వన్డే సిరీస్ ఆడుతుంది, ఆ తర్వాత టీ20 సిరీస్ ఆడుతుంది. మొదటి టీ20 ఆగస్టు 26న, చివరి మ్యాచ్ ఆగస్టు 31న షెడ్యూల్ చేశారు. సూర్య కుమార్ యాదవ్ ఈ పర్యటనకు వెళ్లే అవకాశం కనిపించడం లేదు. స్పోర్ట్స్ హెర్నియా ఆపరేషన్ తర్వాత కోలుకోవడానికి 6 నుంచి 12 వారాల వరకు సమయం పడుతుంది. పూర్తి ఆరోగ్యంతో సూర్య మళ్లీ బ్యాట్ పట్టాలంటే మూడు నెలలు టైం పట్టేలా ఉంది.
టీ20లో తరువాత మేజర్ ఈవెంట్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనుంది. భారత్, శ్రీలంకలో హైబ్రిడ్ మోడల్‌లో ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 ఫిబ్రవరి- మార్చిలో నిర్వహించనుంది. ఇందులో మొత్తం 20 జట్లు తలపడతాయి. ఈ పొట్టి ప్రపంచ కప్‌లో టీమ్ ఇండియాకు కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ వ్యవహరించనున్నాడు.
సూర్యకుమార్ యాదవ్ కెరీర్
టీమిండియాకు లేటు వయసులో ఎంట్రీ ఇచ్చాడు. 30 ఏళ్ల వయసులో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన సూర్యకుమార్ యాదవ్ 1 టెస్ట్, 37 వన్డేలు, 83 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. వన్డేలు, టీ20లలో అతను 773 రన్స్, 2598 పరుగులు చేశాడు. వన్డేలలో సూర్య 4 హాఫ్ సెంచరీలు సాధించాడు. వన్డే ఫార్మాట్లో ఒక్క సెంచరీ లేని సూర్య టీ20ల విషయానికి వస్తే ఈ ఫార్మాట్‌లో 4 సెంచరీలు బాదేశాడు. 21 టీ20 అర్ధ శతకాలు సాధించాడు.
స్పోర్ట్స్ హెర్నియా ఆపరేషన్‌కు ముందు సూర్య ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ఆడాడు. ముంబై క్వాలిఫయర్స్ వెళ్లడంలో కీలకపాత్ర పోషించాడు. సూర్య 16 ఇన్నింగ్స్‌లలో 717 పరుగులు చేయగా, ఇందులో 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2012లో IPL అరంగేట్రం చేసిన సూర్య 4 సంవత్సరాల పాటు కేకేఆర్ జట్టుకు ఆడాడు. 2018లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతూ కీలక ఇన్నింగ్స్‌లు ఆడి పరుగుల వరద పారించాడు. టీమిండియా తలుపు తట్టి టీ20ల్లో నెంబర్ వన్ బ్యాటర్‌గా నిలిచాడు.