Ravi Shastri Comments : ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ లో భారత్ ఓడిపోవడంపై మాజీ కోచ్ రవి శాస్త్రి అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఆటగాళ్లతో హెడ్ కోచ్ గౌతం గంభీర్ విడివిడిగా మాట్లాడి, వాళ్లలో జవాబుదారి తనాన్ని తీసుకు రావాలని సూచించాడు. నిజానికి అంతగా అంచనాలు లేకుండా ఇంగ్లాండ్ టూర్ కు వెళ్లిన భారత జట్టు తొలి టెస్టులో అదిరే ప్రదర్శననే ఇచ్చింది. జట్టు తరపున ఐదు సెంచరీలు నమోదు కావడంతో ఇండియా రెండు ఇన్నింగ్స్ లోనూ భారీ స్కోరే సాధించింది. అయితే కీలకదశలో కుప్పకూలి పోవడం, క్యాచ్ లు నేలపాలు చేయడంతో చివరకు ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ లో పరాజయం పాలైంది. ఈ క్రమంలో పొరపాట్లు చేసిన ఆటగాళ్లతో సమావేశమై, వారిని తిరిగి గాడిలో పెట్టాలని సూచించాడు. ప్రస్తుతం తరుణంలో జట్టు పరిస్థితిని చక్కదిద్దేందుకు కోచింగ్ స్టాఫ్ పాత్ర కీలకమని గుర్తు చేశాడు.
గిల్ ఓకే..కెప్టెన్ గా అరంగేట్రం చేసిన తొలి మ్యాచ్ లోనే కెప్టెన్ శుభమాన్ గిల్ ఆకట్టుకున్నాడని శాస్త్రి తెలిపాడు. తను బ్యాటింగ్ లో ముందుండి సెంచరీ చేసి, తొలి ఇన్నింగ్స్ లో భారీ స్కోరు చేసేందుకు ప్రేరేపించాడని పేర్కొన్నాడు. అయితే ఆటాగాళ్లు క్యాచ్ లు డ్రాప్ చేయడం తన చేతుల్లో లేదని, మొత్తానికి పెట్టుకున్న అంచనాలకు తగినట్లుగా గిల్ రాణించడాని తెలిపాడు. అయితే ఈ మ్యాచ్ లో ఇండియాకు చాలా సానుకూల ఫలితాలు ఉన్నాయని, అయితే ఎక్కడైతే ఆటగాళ్లు గాడి తప్పారో వాళ్లతో విడిగా సమావేశమై పొరపాట్లను సరిదిద్దాలని సూచించాడు. పొరపాట్లు చేసే ఆటగాళ్లపై కాస్త కఠినంగా ఉండాలని సూచించాడు.
జవాబు దారీ తనం నేర్పాలి..జట్టులో ప్రతి ఆటగాడికి నిర్దిష్టమైన రోల్ ఉందని, జవాబుదారీ తనంతో ఆడాలని టీమిండియా ప్లేయర్లకు శాస్త్రి సూచించాడు. కొంతమందిపై ఆధారపడితే విజయాలు రావని సూచించాడు. ఇక ఈ మ్యాచ్ లో లోయర్ మిడిల్, లోయర్ ఆర్డర్ వైఫల్యం కావడంతో భారత్ అనుకున్నంత భారీ స్కోరు రెండు ఇన్నింగ్స్ లోనూ చేయలేక పోయింది. అలాగే పలు క్యాచ్ లు నేలపాలు కావడం కూడా శాపంగా మారింది. ముఖ్యంగా యశస్వి జైస్వాల్ ఏకంగా మ్యాచ్ మొత్తం మీద నాలుగు క్యాచ్ లు డ్రాప్ చేశాడు. దీంతో ఇంగ్లాండ్ పుంజుకుని మ్యాచ్ ను కైవసం చేసుకుంది. రిషభ్ పంత్ కూడా రెండు క్యాచ్ లు జారవిడిచాడు. అలాగే బాగా హైప్ తో జట్టులో చోటు సంపాదించిన సాయి సుదర్శన్, కరుణ్ నాయర్ తుస్సుమన్నారు. దీంతో రెండోటెస్టుకు ఈ లోపాలను సరిదిద్దుకోవాలని శాస్త్రి సూచిస్తున్నాడు. ఇక తొలి టెస్టు ఓడిపోయిన భారత్.. వచ్చేనెల 2న ఎడ్జ్ బాస్టన్ లో జరిగే రెండో టెస్టులో పుంజుకోవాలని చూస్తోంది. అయితే ఈ టెస్టులో టీమిండియాలో మార్పులు ఉంటాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ లోనూ ఒకట్రెండు మార్పులు ఉండే అవకాశముంది. తొలి టెస్టు ఓటమితో పేసర్ హర్షిత్ రాణాను జట్టు నుంచి రిలీజ్ చేశారు.