Ind Vs Eng 1st Test Latest Updates: ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టెస్టులో ఓడిన భారత్.. ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఐదుగురు బ్యాటర్లు సెంచరీలు చేసిన తర్వాత కూడా ఓడిపోయిన తొలి జట్టుగా రికార్డులకెక్కింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో యశస్వి జైస్వాల్, శుభమాన్ గిల్, రిషభ్ పంత్, రెండో ఇన్నింగ్స్ లో కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ వరుసగా సెంచరీలు చేసిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఇలా ఓ జట్టు ఓడిపోవడం 148 ఏళ్ల క్రికెట్ చరిత్రలో ఇదే తొలి సారి కావడం విశేషం. ఇక ఈ మ్యాచ్ లో భారత్ తరపున ఎన్నో లోపాలు కనిపించాయి. ముఖ్యంగా ఈజీగా గెలిచే ఉండే స్థితిలో కూడా, చేజేతులా ఓడి పోవడంపై భారత అభిమానులు మండి పడుతున్నారు. ముఖ్యంగా రెండు ఇన్నింగ్స్ లో మంచి స్థితిలో ఉండి, కొల్లాప్స్ కావడం టీమిండియా కొంప ముంచింది. మరోవైపు 370+ పరుగుల టార్గెట్ విధించినప్పటికీ ఇంగ్లాండ్ చేతిలో టీమిండియా రెండుసార్లు ఓడిపోవడంపై పెదవి విరుస్తున్నారు.
చెత్త సెలెక్షన్..ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా ప్లేయింగ్ లెవన్ సెలెక్షన్ బాగా లేదని విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా ప్లేయింగ్ లెవన్ లో సాయి సుదర్శన్, కరుణ్ నాయర్ ఇద్దరికీ చోటు కల్పించడంపై విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా మూడో నెంబర్లో అద్భుతంగా ఆడే కరుణ్ ను ఆరో స్థానంలో ఆడించడంపై ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఇక మూడో నెంబర్లో సాయి విఫలమయ్యాడు. ఇక పేస్ ఆల్ రౌండర్ గా శార్దూల్ ఠాకూర్ ను తీసుకుని, అతడిని సరిగా ఉపయోగించుకోలేక పోవడంపై పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా అతడితో ఎక్కువగా బౌలింగ్ వేయించక పోవడం, బ్యాటింగ్ లో తను విఫలం కావడం పలు ప్రశ్నలకు ఆస్కారం వ్యక్తం అవుతోంది. ఇవన్నీ టీమ్ మేనేజ్మెంట్ వైఫల్యాన్ని ఎత్తి చూపుతున్నాయి. ఇక ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుతంగా రాణించిన నితీశ్ రెడ్డిని కాదని శార్దూల్ ను ఏ బేసిస్ పై ఎంపిక చేశారని ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఇక బౌలింగ్ లోనూ మార్పులు చేయాల్సి ఉంది.
వారిపై వేటు ఖాయం..!ఇక రెండో టెస్టులో పలు మార్పులతో భారత్ బరిలోకి దిగాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శార్దూల్ స్థానంలో నితీశ్, ప్రసిధ్ స్థానంలో అర్షదీప్ సింగ్ ను ఆడించాలని పేర్కొంటున్నారు. వీలైతే స్పెషలిస్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ను ఆడించాలని కూడా సూచిస్తున్నారు. తొలి టెస్టు ఐదో రోజు స్పిన్ కు కాస్త అనుకూలించిన నేపథ్యంలో కుల్దీప్ ఉన్నట్లయితే కథ కాస్త వేరుగా ఉండేదని పేర్కొంటున్నారు. ఏదేమైనా కెప్టెన్ గా ఆడిన తొలి టెస్టులో శుభమాన్ గిల్ ఆకట్టుకున్నాడు. మిగతా మ్యాచ్ ల్లో సరైన ప్లేయింగ్ లెవన్ తో బరిలోకి దిగిన సత్ఫలితాలు పొందాలని అభిమానులు కోరుకుంటున్నారు.