Dog Bites Girl in Lift: యూపీలోని నోయిడాలో ఓ అపార్ట్‌మెంట్‌లో బాలికపై కుక్క దాడి చేసింది. నోయిడాలో ఈ తరహా ఘటనలు పెరుగుతున్న క్రమంలోనే ఈ వీడియో వెలుగులోకి వచ్చింది. ఓ హౌజింగ్ సొసైటీ లిఫ్ట్‌లో పెంపుడు కుక్క బాలికపై దాడి చేసి గాయపరిచింది. నోయిడా సెక్టార్‌ 107లోని Lotus 300 సొసైటీలో జరిగిందీ ఘటన. లిఫ్ట్‌లోని సీసీ కెమెరాలో ఈ దాడికి సంబంధించిన విజువల్స్ రికార్డ్ అయ్యాయి. సోషల్ మీడియాలో ఈ వీడియో పోస్ట్ చేయగా వెంటనే వైరల్ అయిపోయింది. మే 3వ తేదీన ఈ ఘటన జరిగినా ఆలస్యంగా బయటకు వచ్చింది. లిఫ్ట్‌లో ఓ బాలిక నిలబడి ఉంది. ఓ ఫ్లోర్ వద్ద లిఫ్ట్ ఆగింది. తలుపులు తెరుచుకున్న వెంటనే పెంపుడు కుక్ లోపలికి వచ్చింది. వచ్చీ రాగానే ఆ బాలికపై దాడి చేయడం మొదలు పెట్టింది. చేతిని గట్టిగా కొరికింది. కుక్క నుంచి తప్పించుకునేందుకు బాలిక వెంటనే వెనక్కి వెళ్లిపోయింది. ఈ దాడి జరిగినప్పుడు బాలిక లిఫ్ట్‌లో ఒంటరిగా ఉంది. వెంటనే మరో వ్యక్తి అక్కడికి వచ్చి ఆ కుక్కని బెదిరించి అక్కడి నుంచి వెళ్లగొట్టాడు. అప్పటికే ఆ బాలిక చేతికి గాయమైంది. ఆ నొప్పిని తట్టుకోలేక గట్టిగా ఏడ్చింది. లిఫ్ట్‌లో కుక్కల్ని తీసుకెళ్లొద్దు అని అధికారులు ఎన్ని సార్లు హెచ్చరించినా యజమానులు పట్టించుకోవడం లేదు. గతంలోనూ చాలా సార్లు ఇలా లిఫ్ట్‌లో కుక్కలు దాడి చేసిన ఘటనలు నమోదయ్యాయి. ఈ బెడద తట్టుకోలేక ప్రభుత్వం పలు జాతుల కుక్కలపై నిషేధం విధించింది. ఆ జాతి కుక్కల్ని పెంచుకోవద్దని స్పష్టం చేసింది.  






23 రకాల కుక్కలపై నిషేధం..


దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కుక్కల దాడులు పెరుగుతున్న క్రమంలోనే కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు ఇటీవల లేఖలు పంపింది. దాడి చేసే ప్రమాదమున్న కుక్కల జాతులను నిషేధించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ జాతులకు చెందిన కుక్కల్ని దిగుమతి చేసుకోవడం, అమ్మడం, బ్రీడింగ్ చేయడంపై నిషేధం విధించాలని స్పష్టం చేసింది. ఈ జాబితాలో Rottweiler,Mastiffs, Terrier,Pitbull సహా 23 రకాల జాతుల కుక్కలున్నాయి. ఈ శునకాలు దాడి చేస్తే ప్రాణాలకే ప్రమాదం అని కేంద్రం హెచ్చరించింది. అన్ని రాష్ట్రాలకు Department of Animal Husbandry లేఖలు రాసింది. ఈ జాబితాలో ఉన్న కుక్కల్ని పెంచుకోడానికి ఇప్పటి వరకూ ఇచ్చిన లైసెన్స్‌లను వెనక్కి తీసుకోవాలని తేల్చి చెప్పింది.


Also Read: UP News: అత్యాచారం చేశాడంటూ యువకుడిపై తప్పుడు కేసు, మహిళకు జైలు శిక్ష విధించిన కోర్టు