Fact Check: బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 2024లో జరిగిన ఒక నిరసనలో కొంత మంది మహిళలు బీజేపీ ప్రభుత్వంపై తమ వ్యతిరేకతను వ్యక్తం చేయడానికి గుండు చేయించుకున్నారు అని చెప్తూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). అలాగే, ఇలాంటి నిరసన జరగడం దేశంలో ఇదే తొలిసారి అని కూడా క్లెయిమ్ చేస్తున్నారు. ఈ వీడియోలో కొందరు మహిళలు, పురుషులు రోడ్డుపై గుండు చేయించుకోవడం, ఒక మహిళ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గురించి మాట్లాడడం మనం చూడవచ్చు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.



ఈ పోస్ట్‌ని ఇక్కడ చూడవచ్చు.


క్లెయిమ్: బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 2024లో జరిగిన ఒక నిరసనలో కొంత మంది మహిళలు బీజేపీ ప్రభుత్వంపై తమ వ్యతిరేకతను వ్యక్తం చేయడానికి గుండు చేయించుకుంటున్న దృశ్యాలు. దేశంలోనే ఇలాంటి నిరసన జరగడం ఇదే తొలిసారి.


ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియోలోని దృశ్యాలు 25 జూలై 2018న ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో తమ సేవలను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది శిక్షా మిత్రలు (తాత్కాలిక టీచర్లు) పురుషులు, మహిళలతో సహా గుండు చేయించుకుని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించిన నిరసన ప్రదర్శనకి సంబంధించినవి. అలాగే, ఇలాంటి నిరసన ప్రదర్శన జరగడం దేశంలో ఇదే తొలిసారి కాదు. ఈ నిరసనకు ముందు కూడా జనవరి 2018లో మధ్యప్రదేశ్‌లో, 2017లో అస్సాంలో కూడా కొంత మంది మహిళలు గుండు చేయించుకుని నిరసన తెలిపారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.


ఈ వీడియోలో మనం ఒక మహిళ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గురించి, శిక్షా మిత్ర(టీచర్ల) సమస్యల గురించి మాట్లాడడం మనం చూడవచ్చు. దీని ఆధారంగా ఈ వీడియోకు సంబంధించిన సమాచారం కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, వైరల్ వీడియోలోని గుండు చేయించుకుంటున్న మహిళ దృశ్యాలతో కూడిన పలు రిపోర్ట్స్ లభించాయి (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ రిపోర్ట్స్ ప్రకారం, 25 జూలై 2018న ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని ఎకో గార్డెన్‌లో తమ సేవలను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది శిక్షా మిత్రలు (తాత్కాలిక టీచర్లు) పురుషులు, మహిళలతో సహా గుండు చేయించుకుని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన నిర్వహించారు.



‘ఇండియా టుడే’ (India Today) రిపోర్ట్ ప్రకారం, 25 జూలై 2018న లక్నోలో ఉత్తరప్రదేశ్‌లోని తాత్కాలిక ఉపాధ్యాయులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన గత నిరసనలలో ప్రాణాలు కోల్పోయిన ఉపాధ్యాయుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వం తమ సర్వీసులను క్రమబద్ధీకరించాలని, ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)లో ఉత్తీర్ణులైన వారికి వెంటనే నియామక పత్రాలు జారీ చేయాలని, తమ సేవలను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ శిక్షా మిత్రలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ నిరసనలో భాగంగా వందలాది మంది పురుషులు, మహిళ శిక్షా మిత్రలు గుండు చేయించుకుని తమ నిరసన వ్యక్తం చేశారు.


ఉత్తరప్రదేశ్  రాష్ట్రంలో ప్రాథమిక పాఠశాలల్లో బోధించే 1.73 లక్షల మంది తాత్కాలిక ఉపాధ్యాయులును 2014లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసింది. 2015లో, అలహాబాద్ హైకోర్టు వీరి సర్వీసులను క్రమబద్ధీకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యను చట్టవిరుద్ధమని ప్రకటించింది. అలాగే 2017లో, సుప్రీంకోర్టు వీరి నియామకాన్ని రద్దు చేసింది, టెట్ క్లియర్ చేస్తే తప్ప వారి కాంట్రాక్టు ఉద్యోగాలను ప్రభుత్వ ఉద్యోగాలుగా మార్చబోమని ప్రకటించింది. సుప్రీంకోర్టు తీర్పుతో కాంట్రాక్టు ఉపాధ్యాయుల వేతనాన్ని రూ.38,848 నుంచి రూ.3,500కు తగ్గించారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం శిక్షా మిత్రలు(కాంట్రాక్టు ఉపాధ్యాయుల) వేతనాన్ని రూ.3,500 నుంచి రూ.10,000కు పెంచింది.



అలాగే, ఇలాంటి నిరసన ప్రదర్శన జరగడం దేశంలో ఇదే తొలిసారా? అని ఇంటర్నెట్‌లో వెతకగా, ఈ 2018 ఉత్తరప్రదేశ్ కాంట్రాక్టు ఉపాధ్యాయుల నిరసనలో మహిళలు గుండు చేయించుకుని నిరసన తెలపడం కన్నా ముందు కూడా ఇలాంటి పలు నిరసన ప్రదర్శనలు జరిగినట్లు తెలసింది. 2017లో అస్సాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలో ముగ్గురు మహిళలు గుండు చేయించుకుని నిరసన తెలిపారు. అలాగే జనవరి 2018లో మధ్యప్రదేశ్ కాంట్రాక్టు ఉపాధ్యాయులు, విద్యా శాఖ తమను రెగ్యులర్ ఉపాధ్యాయులగా గుర్తించాలని కోరతూ పలువురు ఉపాధ్యాయులతో పాటు నలుగురు మహిళ ఉపాధ్యాయులు కూడా గుండు చేయించుకుని నిరసన తెలిపారు.


చివరగా, 2018లో ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలో కొందరు మహిళలు గుండు చేయించుకుంటున్న వీడియోను ఇటీవల జరిగిన సంఘటనగా షేర్ చేస్తున్నారు.



This story was originally published by factly.in, as part of the Shakti Collective. Except for the headline/excerpt/opening introduction para, this story has not been edited by ABP Desam staff.