UP Woman False Abuse Case: యూపీలో ఓ మహిళ తనపై అత్యాచారం జరిగిందని తప్పుడు కేసు పెట్టింది. ఇదంతా డ్రామా అని తెలిసి ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు ఆమెకి జైలు శిక్ష విధించింది. భారీగా జరిమానా కట్టాలంటూ ఆదేశించింది. యూపీలోని బరేలీ జిల్లాలో జరిగిందీ ఘటన. 2018లో ఓ మహిళ ఓ వ్యక్తిపై అత్యాచార ఆరోపణలు చేసింది. 2019లో ఓ కేసు కూడా నమోదైంది. అయితే...విచారలో ఇదంతా అవాస్తవం అని తేలింది. దీనిపై అసనహం వ్యక్తం చేసిన కోర్టు 21 ఏళ్ల యువతికి 1,653 రోజుల పాటు జైలు శిక్ష విధించింది. దీంతో పాటు రూ.5.8 లక్షల జరిమానా కట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మొత్తం చెల్లించలేకపోతే అదనంగా మరో ఆరు నెలల పాటు జైలు శిక్షని పొడిగిస్తామని తేల్చి చెప్పింది. ఈ జరిమానాని అంతా ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తికి చెల్లించాలని స్పష్టం చేసింది. యూపీలో రోజువారీ కూలీకి ఎంత అయితే ఆదాయం వస్తుందో..అంత మేరకు జరిమానా విధించినట్టు కోర్టు వివరించింది. తనను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడని ఆ వ్యక్తిపై ఆరోపణలు చేసిన యువతి క్రాస్ ఎగ్జామినేషన్‌లో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా వాంగ్మూలం ఇచ్చింది. తనను కిడ్నాప్ చేశాడన్న విషయం నిజం కాదని, అత్యాచారం జరగలేదని వెల్లడించింది. వెంటనే పోలీసులు ఈ స్టేట్‌మెంట్ ఆధారంగా ఆమెని అరెస్ట్ చేసి జైలుకి తరలించారు. ఆ తరవాత బెయిల్‌పై విడుదలైంది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
"మహిళల భద్రత అనేది చాలా ముఖ్యమైన అంశం. ఆ బాధ్యత ప్రతి ప్రభుత్వానికి ఉంటుంది. వాళ్ల రక్షణ కోసం ఎన్నో చట్టాలున్నాయి. అలా అని వాటిని అడ్డం పెట్టుకుని ఇలాంటి అసత్య ఆరోపణలు చేసే హక్కు మాత్రం ఏ మహిళకీ లేదు. ఇలాంటప్పుడు పురుషులు పోరాటం చేసే అధికారం కచ్చితంగా ఉంటుంది. ఇలాంటి కేసులలో కొన్ని మినహాయింపులు తప్పకుండా ఉండాలి. ఈ కేసులో మహిళ అబద్ధం చెప్పిందని తేలింది. ఇలాంటి వాళ్ల వల్ల అసలైన బాధితులకు న్యాయం జరగకుండా పోతుంది. అందుకే ఇలాంటి వాళ్లకు కఠిన శిక్ష విధించాలని నిర్ణయించుకున్నాం"
- న్యాయస్థానం