Pervez Musharraf Death:


కయ్యానికి కాలు దువ్వి..


పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌...భారత్‌తో జరిగిన మూడు యుద్ధాల్లో కీలక పాత్ర పోషించారు. ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచిన కార్గిల్ వార్‌ ముషారఫ్ నేతృత్వంలో జరిగిందే. కావాలనే కవ్వించి మరీ యుద్ధానికి దిగారు. ఈ వార్‌ను చూపించుకునే తనను తాను పవర్‌ఫుల్ లీడర్‌గా ప్రకటించుకున్నారు. అప్పటికప్పుడు ప్రభుత్వాన్ని పడగొట్టి తానే అధ్యక్ష పదవిని చేపట్టారు. దాదాపు పదేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు. ఆయన ఈ స్థాయికి చేరుకోడానికి కారణం...భారత్‌తో జరిగిన మూడు యుద్ధాల్లో మాస్టర్‌మైండ్‌గా ఉండటమే. భారత్ పాక్ యుద్ధం అనగానే 1965 పరిణామాలే గుర్తొస్తాయి. యువ సైనికుడిగా ఆ సమయంలో భారత సైన్యంతో పోరాడారు ముషారఫ్. పాక్‌ ఆ యుద్ధంలో ఓడిపోయింది. అయినా...పాక్ ప్రభుత్వం ఆయనను గౌరవించింది. ఇంతియాజీ మెడల్ ఇచ్చి సత్కరించింది. తక్కువ వయసులోనే యుద్ధ వ్యూహాల్లో ఆరితేరిపోయారు ముషారఫ్. ఆ తరవాత 1971లోనూ భారత్‌తో కయ్యానికి కాలు దువ్వారు. అప్పుడు కూడా ఆయనే పాక్ సైన్యాన్ని ముందుండి నడిపారు. స్పెషల్ సర్వీస్ గ్రూప్ (SSG) నాయకుడిగా దిశా నిర్దేశం చేశారు. ఈ యుద్ధంలోనూ పాక్‌ను ఓడించింది భారత సైన్యం. అయినా...పాక్ ప్రభుత్వం మాత్రం ముషారఫ్‌ను ఆకాశానికెత్తేసింది. ప్రమోషన్ కూడా ఇచ్చింది. చాలా తక్కువ సమయంలోనే కమాండర్‌ స్థాయికి చేరుకున్నారు. ఆ తరవాత జనరల్ ర్యాంక్‌ కూడా సాధించారు. ఇదంతా భారత్‌తో గిల్లి కయ్యం పెట్టుకున్నందుకు పాక్ ప్రభుత్వం ఇచ్చిన నజరానాలే. 


ప్రధానిపైనే ఫైర్..


1998లో చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా నియమించింది. అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కార్గిల్‌ను సొంతం చేసుకోవాలని చాలానే కుట్రలు పన్నారు ముషారఫ్. ఎన్నో ప్రయత్నాలు చేసినా భారత్ దీటుగా వాటిని తిప్పికొట్టింది. ఈ అసహనాన్నంతా అప్పటి ప్రధాని నవాజ్ షరీఫ్‌పై చూపించారు. ఆయన అసమర్థత వల్లే కార్గిల్‌ను స్వాధీనం చేసుకోవడం కుదరలేదంటూ తీవ్రంగా మండి పడ్డారు. అప్పటికే పవర్‌ఫుల్ లీడర్‌గా ఎదిగిన ఆయన..వెంటనే ప్రధాని షరీఫ్‌ను ఆ పదవి నుంచి తప్పించేలా వ్యూహాలు అమలు చేశారు. తన ఆయోబయోగ్రఫీలోనూ షరీఫ్‌పై అసహనం వ్యక్తం చేశారు ముషారఫ్. అయితే...అసలు తనకు తెలియకుండానే కార్గిల్ ఆపరేషన్ చేపట్టారని నవాజ్ షరీఫ్ ఆ తరవాత ప్రకటించారు. కానీ...షరీఫ్‌కు అదంతా తెలుసని కొన్ని పాక్ మీడియా సంస్థలు అప్పట్లో వెల్లడించాయి. పవర్‌ఫుల్ లీడర్‌గా, సోల్జర్‌గా పేరు తెచ్చుకున్న ముషారఫ్‌ పలు వివాదాల్లోనూ ఇరుక్కున్నారు. 2013లో ఆయనపై దాదాపు నాలుగు నేరాలు నమోద య్యాయి. పాకిస్థాన్ రాజ్యాంగాన్ని సస్పెండ్ చేయడం, స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ, సీనియర్ లీడర్లను,జడ్జ్‌లను కారణం లేకుండా తొలగించడం లాంటి చర్యలతో విమర్శలు వెల్లువెత్తాయి. అంతే కాదు. ఆయనపై హత్యా ఆరోపణలూ వచ్చాయి. బలూచిస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అక్బర్ బుగాటీ హత్యలో ముషారఫ్ హస్తం ఉందని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. అంతే కాదు. పాక్ మాజీ ప్రధాని బెనజీర్ బుట్టో హత్యలోనూ ముషారఫ్‌ కుట్ర ఉందని అభియోగాలూ వచ్చాయి. 


Also Read: Apps Ban: చైనా యాప్స్‌పై మరోసారి కేంద్రం కొరడా, ఇకపై ఆ అప్లికేషన్లు కనిపించవ్