Pegasus Row:
ఎన్‌వీ రమణ ధర్మాసనం విచారణ..
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన స్పైవేర్ కేసుని సుప్రీం కోర్టు విచారించింది. గతంలో ఈ కేసుపై కమిటీ వేసిన సర్వోన్నత న్యాయస్థానం... దీనిపై ఓ సమగ్ర నివేదిక కోరింది. ఆ కమిటీ...రిపోర్ట్‌ను సుప్రీం కోర్టుకు అందించింది. ఈ నివేదికను పరిశీలించిన సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 29 మొబైల్స్ పెగాసస్ బారిన పడ్డాయనటానికి ఎలాంటి ఆధారాలు టెక్నికల్ కమిటీకి లభించలేదని, బహుశా అది వేరే మాల్‌వేర్ అయ్యుంటుందని వెల్లడించింది. 29 మొబైల్స్‌లో 5 ఫోన్స్ మాల్‌వేర్‌కు గురైనట్టు తెలిపింది. అది కచ్చితంగా పెగాసస్ అని చెప్పలేమని వ్యాఖ్యానించింది. సుప్రీం కోర్టు నియమించిన కమిటీ...మొత్తం మూడు భాగాలుగా నివేదిక సమర్పించింది. ఈ నివేదికలను గోప్యంగా ఉంచాలని, పబ్లిక్‌గా విడుదల చేసేందుకు వీల్లేదని కమిటీ స్పష్టం చేసింది. గతేడాది అక్టోబర్‌లో సుప్రీం కోర్టు ఓ కమిటీని నియమించింది. నిపుణులతో కూడిన ఈ కమిటీ...కేంద్రం స్పైవేర్ వినియోగించిందో లేదో తేల్చి చెప్పాలని ఆదేశించింది. ఈ ఏడాది జనవరిలో కమిటీ ఓ ప్రకటన చేసింది. తమ మొబైల్ డివైసెస్‌కి అనుమానాస్పద లింక్‌లు రావటం లేదా పెగాసస్ స్పైవేర్‌కు గురి కావటం లాంటివి జరిగితే...తమకు ఆ వివరాలు అందించాలని కోరింది. తమ ఫోన్ హ్యాక్‌కు గురైందని అనుమానించటానికి కారణాలేంటి..అనేది కూడా తెలపాలని సూచించింది.
పార్లమెంట్‌లో దుమారం..
గతేడాది ఇజ్రాయేల్ స్పైవేర్ పెగాసస్‌పై పెద్ద దుమారమే రేగింది. పార్లమెంట్‌లోనూ ఈ అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. పలువురు రాజకీయ నేతలు, జర్నలిస్టులు సహా ప్రముఖుల ఫోన్లు హ్యాక్ చేశారనే ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు చేయించాలని కోరుతూ ప్రముఖ జర్నలిస్ట్‌లు ఎన్. రామ్, శశి కుమార్ గతేడాది పిటిషన్ దాఖలు చేశారు. పెగాసస్ వ్యవహారం (Pegasus Spyware)తో కీలక పరిణామాలు చోటుచేసుకంటున్నానని వివరించారు. ఈ అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన సర్వోన్నత న్యాయస్థానం..వాదనలు వినేందుకు అప్పట్లో సుముఖత చూపించింది. జర్నలిస్టులు, న్యాయవాదులు, మంత్రులు, విపక్ష నేతలు, రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులు
ఇలా మొత్తం 142 మంది భారతీయులు పెగాసస్ టార్గెట్ జాబితాలో ఉన్నట్లు పలు మీడియా సంస్థలు తెలుసుకున్నాయని పిటిషనర్లు పేర్కొన్నారు.
రెండేళ్ల క్రితం..
సరిగ్గా రెండేళ్ల క్రితం తమ యూజర్ల గోపత్యకు పెగాసస్ వల్ల భంగం వాటిల్లుతోందని ఫేస్‌బుక్ సంస్థ ఆరోపించింది. దీనికి సంబంధించి ఎన్‌ఎస్‌ఓ కంపెనీపై కేసు కూడా నమోదు వేసింది. పెగాసస్ స్పైవేర్ ద్వారా ఎన్‌ఎస్‌ఓ యూజర్ల డేటాను దొంగలిస్తుందనే ఆరోపణలు చేసింది.
అదే ఏడాది కొందరు కేంద్ర మంత్రులు, జర్నలిస్టులు, ప్రతిపక్ష నేతల ఫోన్లు హ్యాకింగ్‌కు గురయ్యాయన్న వార్తలు వెల్లువెత్తాయి. 2019లో కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ రాజ్యసభలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. అధికార ప్రభుత్వమే తమ ఫోన్లను హ్యాక్ చేయిస్తోందని ఆరోపించారు.
యూజర్లకు ఏ మాత్రం అనుమానం రాకుండా ఫోన్లను హ్యాక్ చేయడమే పెగాసస్ ప్రత్యేకత. మొదట హ్యాక్ చేయాలనుకున్న వ్యక్తి ఫోనుకు ఓ మిస్డ్ కాల్ వస్తుంది. దానిని లిఫ్ట్ చేసినా.. చేయకపోయినా పర్వాలేదు. మిస్ట్ కాల్ వచ్చిందంటే సదరు వ్యక్తి ఫోనులో పెగాసస్ వచ్చి చేరినట్లే. గేమ్స్, సినిమా యాప్స్, వైఫైల ద్వారా కూడా ఇది ఫోన్లలోకి చొరబడుతుంది. గతంలో మెసేజ్‌లు, మెయిల్స్ ద్వారా లింకులను పంపేది. వీటిని క్లిక్ చేసిన వ్యక్తి ఫోన్‌లో పెగాసస్ ఇన్‌స్టాల్ అయిపోతుంది. దీనిని నిరోధించే పద్ధతులను ఫోన్ల కంపెనీలు కనిపెట్టగలగడంతో ఒక అడుగు ముందుకేసి ఈ మిస్డ్ కాల్ టెక్నిక్‌ను వాడుతోంది. స్పైవేర్ ఇన్‌స్టాల్ అయిన తర్వాత మిస్డ్ కాల్‌ను కూడా ఇది డిలీట్ చేస్తుంది. దీంతో యూజర్లు కూడా దీనిని కనిపెట్టలేరు.
Also Read: లైగర్ లో విజయ్ దేవరకొండ MMA Fighter.. ఆ ఆట గురించి మీకు తెలుసా..