Pegasus Case:


భాజపా వర్సెస్ కాంగ్రెస్ 


పెగాసస్‌ స్పైవేర్‌పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అది పెగాసస్‌ మాల్‌వేర్ అనడానికి ఎలాంటి ఆధారాలు లేవని చాలా స్పష్టంగా చెప్పింది. టెక్నికల్ టీమ్‌ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ వివరాలు వెల్లడించింది. అదే సమయంలో కేంద్రం ఈ విచారణలో కమిటీకి సరిగా సహకరించలేదనీ అసహనం వ్యక్తం చేసింది. ఇప్పుడు దీనిపైనే భాజపా, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ట్విటర్ వేదికగా కేంద్రంపై విమర్శలు చేశారు. "కేంద్రం కమిటీకి సహకరించలేదంటే, ఏదో నిజాన్ని దాస్తున్నట్టే కదా" అని ట్వీట్ చేశారు. ఇది ప్రజాస్వామ్యాన్ని అణిచివేయటమే అంటూ ప్రధాని మోదీ, భాజపాపై మండిపడ్డారు. అటు భాజపా కాంగ్రెస్‌పై ఎదురు దాడికి దిగుతోంది. కాంగ్రెస్ ఉద్దేశపూర్వకంగా ఈ పని చేస్తోందని, ప్రధాని మోదీ చరిష్మాను దెబ్బ తీయాలని చూస్తోందని విమర్శిస్తోంది. సీనియర్ భాజపా నేత రవి శంకర్ ప్రసాద్...రాహుల్ గాంధీని టార్గెట్ చేశారు. ఆ 5 మొబైల్స్‌లో ఏ మాల్‌వేర్ ఉందో తేలిన తరవాత, భాజపా ఈ పని చేసిందో లేదో కచ్చితంగా తెలుస్తుందని..అప్పుడు కాంగ్రెస్ తప్పకుండా క్షమాపణ చెప్పాల్సి వస్తుందని మండిపడ్డారు. అటు సీనియర్ కాంగ్రెస్ నేత చిదంబరం...సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యకం చేశారు. మన న్యాయవ్యవస్థలోని లొసుగులు ఉన్నాయనటానికి ఇదే నిదర్శనం అని వ్యాఖ్యానించారు. ఎన్‌డీయే ప్రభుత్వం కమిటీకి సహకరించకపోయినా...సుప్రీం కోర్టు అలాంటి వ్యాఖ్యలు చేయటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 






ఇదేం తీరు..? 


"ఈ తీర్పుతో ఏం చెప్పాలనుకుంటున్నారు..? మనం చేసుకున్న చట్టాల్లో లొసుగులున్నాయని, వాటిని దుర్వినియోగం చేయొచ్చని తేలింది. ప్రభుత్వం స్పై వేర్‌తో నిఘా పెట్టలేదని కప్పి పుచ్చారు. ఈ దేశంలో చట్టం అనేది ఉందా? " అని ట్వీట్ చేశారు చిదంబరం. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన స్పైవేర్‌ కేసుని సుప్రీం కోర్టు విచారించింది. గతంలో ఈ కేసుపై కమిటీ వేసిన సర్వోన్నత న్యాయస్థానం... దీనిపై ఓ సమగ్ర నివేదిక కోరింది. ఆ కమిటీ...రిపోర్ట్‌ను సుప్రీం కోర్టుకు అందించింది. ఈ నివేదికను పరిశీలించిన సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 29 మొబైల్స్‌ పెగాసస్‌ బారిన పడ్డాయనటానికి ఎలాంటి ఆధారాలు టెక్నికల్ కమిటీకి లభించలేదని, బహుశా అది వేరే మాల్‌వేర్ అయ్యుంటుందని వెల్లడించింది. 29 మొబైల్స్‌లో 5 ఫోన్స్‌ మాల్‌వేర్‌కు గురైనట్టు తెలిపింది. అది కచ్చితంగా పెగాసస్ అని చెప్పలేమని వ్యాఖ్యానించింది. సుప్రీం కోర్టు నియమించిన కమిటీ...మొత్తం మూడు భాగాలుగా నివేదిక సమర్పించింది. ఈ నివేదికలను గోప్యంగా ఉంచాలని, పబ్లిక్‌గా విడుదల చేసేందుకు వీల్లేదని కమిటీ స్పష్టం చేసింది. గతేడాది అక్టోబర్‌లో సుప్రీం కోర్టు ఓ కమిటీని నియమించింది. నిపుణులతో కూడిన ఈ కమిటీ...కేంద్రం స్పైవేర్ వినియోగించిందో లేదో తేల్చి చెప్పాలని ఆదేశించింది. ఈ ఏడాది జనవరిలో కమిటీ ఓ ప్రకటన చేసింది. తమ మొబైల్ డివైసెస్‌కి అనుమానాస్పద లింక్‌లు రావటం  లేదా పెగాసస్ స్పైవేర్‌కు గురి కావటం లాంటివి జరిగితే...తమకు ఆ వివరాలు అందించాలని కోరింది. తమ ఫోన్‌ హ్యాక్‌కు గురైందని అనుమానించటానికి కారణాలేంటి.. అనేది కూడా తెలపాలని సూచించింది. 


Also Read: Viral Video: రైలు పైకి ఎక్కేందుకు ప్రయత్నించిన మహిళ, ఇంతలో ఏం జరిగిందంటే !