Pauri Garhwal Bus Accident: పండగ పూట విషాదం- లోయలో పడిన బస్సు, 25 మంది మృతి!

ABP Desam   |  Murali Krishna   |  05 Oct 2022 11:58 AM (IST)

Pauri Garhwal Bus Accident: ఉత్తరాఖండ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 25 మంది మృతి చెందారు.

(Image Source: ANI)

Pauri Garhwal Bus Accident: ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 55 మంది ప్రయాణికులతో వస్తున్న బస్సు పౌరీ జిల్లాలో అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 25 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో 21 మందికి తీవ్ర గాయలయ్యాయి.

ఇదీ జరిగింది

ధూమకోట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిమ్ది గ్రామ సమీపంలో ఈ బస్సు అదుపు తప్పి లోయలో పడింది. బస్సు 500 మీటర్ల లోతు ఉన్న లోయలో పడిపోయింది. మంగళవారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

రాత్రంతా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. ఈ ఘటనలో 25 మంది మృతదేహాలు వెలికితీసినట్లు పోలీసులు తెలిపారు. మరో 21 మందిని పోలీసులు రక్షించి ఆసుపత్రికి తరలించారు. హరిద్వార్ జిల్లాలోని లాల్‌ధాంగ్ నుంచి పౌరీ జిల్లా బీర్‌ఖాల్ బ్లాక్‌కు బస్సు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులో పెళ్లి కోసం వచ్చిన జనం ఉన్నారని పోలీసులు చెప్పారు. 

ధూమకోట్‌లోని బీరోఖల్ ప్రాంతంలో మంగళవారం రాత్రి జరిగిన పౌరీ గర్వాల్ బస్సు ప్రమాదంలో 25 మంది మరణించారు. పోలీసులు, SDRF రాత్రిపూట 21 మందిని రక్షించారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు చేర్చారు.                          - అశోక్ కుమార్, డీజీపీ

మోదీ సంతాపం

పౌరీ గర్వాల్ బస్సు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు.

ఉత్తరాఖండ్‌లోని పౌరీలో జరిగిన బస్సు ప్రమాదం వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యాను. ఈ విషాద సమయంలో నా ఆలోచనలు మృతుల కుటుంబాలతో ఉన్నాయి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని నేను ఆశిస్తున్నాను. బాధిత కుటుంబాలకు అన్ని విధాలా సహాయాన్ని అందిస్తాం.                         - ప్రధాని నరేంద్ర మోదీ 

Also Read: Viral Video: కరెంట్ స్తంభానికి కట్టేసి, చితక్కొట్టిన పోలీసులు- వైరల్ వీడియో!

Also Read: Amit Shah Jammu Kashmir Visit: జమ్ముకశ్మీర్‌లో అమిత్ షా కీలక ప్రకటన- ఆ వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ!

Published at: 05 Oct 2022 10:56 AM (IST)
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.