టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తాను నేడు (అక్టోబరు 5) ప్రకటించనున్న జాతీయ పార్టీ పేరును ఫైనల్ చేశారు. మొత్తానికి జాతీయ పార్టీకి కొత్త పేరు కోసం ఆయన దాదాపు 100 పేర్లకు పైగా పరిశీలించినట్లు సమాచారం. చివరకు ‘భారత్ రాష్ట్ర సమితి’ అనే పేరును ఫిక్స్ చేశారు. మంగళవారం రాత్రి కీలక పరిణామం జరిగింది. భారత్‌ రాష్ట్ర సమితి అనే పేరు తెలుగు వారితో పాటు హిందీలోనూ అర్థం అయ్యేలా సులభంగా ఉండడం వల్ల ఆ పేరు వైపే కేసీఆర్ మొగ్గు చూపినట్లు తెలిసింది. జాతీయ పార్టీ పెడతారని ఊహాగానాలు మొదలైనప్పటి నుంచి జాతీయ మీడియాలోనూ ఇదే పేరు దేశవ్యాప్తంగా ప్రజల్లోకి వెళ్లిందని ఆయన అభిప్రాయపడ్డట్లు తెలిసింది. 


నేడు (అక్టోబరు 5) తెలంగాణ భవన్‌లో జరిగే జనరల్ బాడీ మీటింగ్ లో పార్టీ పేరు మార్పుపై అధ్యక్షుడు కేసీఆర్‌ తీర్మానాన్ని ప్రతిపాదిస్తారు. దానికి పార్టీలో ఉన్న 283 మంది సభ్యులు ఏకగ్రీవ  ఆమోదం తెలుపుతారు. ముందుగా అనుకున్న ముహూర్తం ప్రకారం.. మధ్యాహ్నం 1.19 గంటలకు సదరు ఏకగ్రీవమైన తీర్మానంపై కేసీఆర్‌ సంతకం చేయనున్నారు. అనంతరం ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి తాము ఆమోదించిన తీర్మానం గురించి ప్రకటన చేస్తారని తెలుస్తోంది.


ఈ తీర్మానం ప్రతిపాదన, ఆమోదం, ఎవరెవరు ప్రసంగించాలనే అంశాలను నిర్ణయించేందుకు మంగళవారం ప్రగతి భవన్ లో కేసీఆర్ పార్టీ కీలక నేతలతో సమావేశం అయ్యారు. టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌, మంత్రులు హరీశ్‌రావు, మహమూద్‌ అలీ, పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు (కేకే), ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


హైదరాబాద్ కు చేరుకున్న నేతలు
ఈ కార్యక్రమం కోసం ప్రత్యేక ఆహ్వానితులుగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్‌ నేత కుమారస్వామి, తమిళనాడుకు చెందిన వీసీకే పార్టీ అధ్యక్షుడు, ఎంపీ తిరుమవలవన్‌ హాజరు కానున్నారు. వీరు నిన్న రాత్రే హైదరాబాద్ కు చేరుకున్నారు. జేడీఎస్ ప్రతినిధి బృందానికి బేగంపేట ఎయిర్ పోర్టులో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, చీఫ్ విప్ బాల్క సుమన్, మాజీ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ స్వాగతం పలికారు.


అక్టోబరు 6న ఢిల్లీకి
భారత్‌ రాష్ట్ర సమితిగా పార్టీ పేరు మార్పు నిర్ణయంపై చేసిన తీర్మానం ప్రతితో వినోద్‌కుమార్‌ సహా ఇతర కీలక నేతలు 6న ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి పార్టీ పేరు మార్పుపై చేసిన తీర్మానానికి ఆమోదం కోరుతూ అఫిడవిట్‌ ఇస్తారు. దానిపై కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేస్తుంది. పార్టీ పేరుపై అభ్యంతరాలుంటే తెలిపేందుకు 30 రోజుల టైం ఇస్తుంది. ఏవీ రాకపోతే దాన్ని ఆమోదించేస్తుంది.