Teachers MLC Voter Application: హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ శాసన మండలి టీచర్ నియోజకవర్గంలో ఆసక్తి, అర్హులైన వారు ఓటరుగా నమోదు చేసుకోవాలని శాసన మండలి టీచర్ నియోజకవర్గ ఎలక్ట్రోల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్, జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ పంకజ తెలిపారు. శాసన మండలి టీచర్ నియోజకవర్గంలో ఓటరు నమోదుకు అక్టోబర్ 1 నోటిఫికేషన్ జారీ చేశారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి నవంబర్ 7వ తేదీ వరకు ఓటరు నమోదుకు ఫారం-19 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. అయితే ఈ నియోజకవర్గంలో ఆరు సంవత్సరాల పాటు స్థానికంగా నివాసితులై ఉండాలి. మూడు సంవత్సరాల పాటు ఏదైనా పాఠశాలలో టీచర్ గా పని చేసిన అనుభవం గలవారు అర్హులు అని తెలిపారు.
ఓటరు నమోదుకు సంబంధిత ఇఆర్ఓలు, అసిస్టెంట్ ఇఆర్ఓలు సంబంధిత జిల్లాల ఆర్డీవో, తహశీల్దార్లు, జీహెచ్ఎంసీ పరిధిలో నియోజకవర్గ ఇఆర్ఓలుగా వ్యవహరిస్తున్న డిప్యూటీ కమిషనర్లను సంప్రదించి ఫారం 19 ద్వారా ఆఫ్ లైన్ లో దరఖాస్తు పూర్తి చేసుకోవాలన్నారు. అనంతరం సంబంధిత సర్వీస్ సర్టిఫికెట్ జత చేసి తిరిగి అక్కడే అందజేయాలని స్పష్టం చేశారు. ఆన్ లైన్ లో సీఈవో వెబ్ సైట్ ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చని, ఆన్ లైన్ లో కూడా సర్వీస్ సర్టిఫికెట్ అప్ లోడ్ చేయాలని రిటర్నింగ్ ఆఫీసర్ పంకజ తెలిపారు.