Amit Shah Jammu Kashmir Visit: జమ్ముకశ్మీర్ పర్యటనలో ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక హామీ ఇచ్చారు. గుజ్జర్లు, బకర్వాల్‌లు, పహారీ సామాజిక వర్గానికి ఎస్టీ హోదా కల్పిస్తామని హామీ ఇచ్చారు. దీంతో త్వరలో విద్య, ఉద్యోగాల్లో వారికి రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. చట్టపరమైన ప్రక్రియ పూర్తి కాగానే ఆయా వర్గాల ప్రజలు రిజర్వేషన్ ప్రయోజనాలు పొందనున్నారు.
కీలక హామీ
రాజౌరిలో ఏర్పాటు చేసిన భాజపా ర్యాలీలో అమిత్ షా ప్రసంగించారు. 2019లో ఆర్టికల్ 370 రద్దు చేయడంతో జమ్ముకశ్మీర్‌లోని సమాజంలో అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు అందించేందుకు మార్గం సుగమమైందని అమిత్ షా అన్నారు. కోటా ప్రయోజనాలు పరిశీలించేందుకు లెఫ్టినెంట్ గవర్నర్ ఏర్పాటు చేసిన జస్టిస్ శర్మ కమిషన్ సిఫారసుల మేరకు ఈ కోటా అమలు చేయనున్నట్టు వెల్లడించారు.
షా పర్యటన వేళ
అమిత్ షా జమ్ముకశ్మీర్ పర్యటనలో ఉన్న వేళ జమ్ముకశ్మీర్ డీజీపీ (జైళ్ల విభాగం) హేమంత్ కుమార్ లోహియా సోమవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసులో నిందితుడిగా అనుమానిస్తోన్న డీజీపీ ఇంటి సహాయకుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ హత్యకు తామే బాధ్యులమంటూ పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫోర్స్ (పీఏఎఫ్ఎఫ్) అనే ఉగ్ర సంస్థ ప్రకటించుకుంది. పటిష్ట భద్రత మధ్య కశ్మీర్ పర్యటనకు రానున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఇది మా గిఫ్ట్ అంటూ పీఏఎఫ్ఎఫ్ ఓ ప్రకటనలో పేర్కొంది.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంగళవారం నుంచి మూడు రోజుల పాటు జమ్ముకశ్మీర్‌లో పర్యటిస్తారు. ఇలాంటి సందర్భంలో డీజీ హత్యకు గురికావడంతో కలకలం రేగింది. దీంతో ఈ కేసును పోలీసులు సవాల్‌గా తీసుకున్నారు. నిందితుడి కోసం స్పెషల్ టీమ్‌లు ఏర్పాటు చేసి వెంటనే పట్టుకున్నారు. ఈ కేసులో పూర్తి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Also Read: Gujarat Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం- ఆటోను ఢీకొట్టిన ట్రక్కు, 11 మంది మృతి!
Also Read: Nobel Prize 2022 in Physics: భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి