Parliament Winter Session: 


ప్రైవేట్ మెంబర్స్ బిల్‌లో భాగంగా..


ప్రభుత్వ కార్యక్రమాల్లో అందించే విందులో "మాంసాహారం" లేకుండా పూర్తి స్థాయి నిషేధం విధించాలని ఓ బీజేపీ ఎంపీ పట్టుపడుతున్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్‌ను ప్రవేశపెట్టనున్నారు. ప్రైవేట్ మెంబర్స్ బిల్‌ (Private Members' Bill)లో భాగంగా ఈ బిల్‌ను పార్లమెంట్‌లో సమర్పించేందుకు సిద్ధమవుతున్నారు...ఎంపీ పర్వేష్ సాహిబ్ సింగ్. "కార్బన్ అధికంగా ఉండే మాంసాహారాన్ని తగ్గించడమే మంచిది" అని హితవు పలుకుతున్నారు. డిసెంబర్ 7 నుంచి 29వ తేదీ వరకూ శీతాకాలం సమావేశాలు జరగనున్నాయి. ఆ సమయంలోనే...ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో నాన్ వెజ్ వంటకాలు లేకుండా చూడాలని సూచిస్తూ ఈ బిల్‌ను పాస్ చేయనున్నారు.. పర్వేష్. మొత్తం 20 వరకూ ప్రైవేట్ మెంబర్స్ బిల్స్‌ పార్లమెంట్‌ ముందుకు రానున్నాయి. వీటిలో ఇదీ ఒకటి. దీనిపై పర్వేష్ స్పందించారు. "జర్మనీ పర్యావరణ శాఖ ప్రభుత్వ కార్యక్రమాల్లో నాన్‌ వెజ్ వంటకాలు లేకుండా చూసుకుంటోంది. వాతావరణ మార్పులపై ఇదెంతో ప్రభావం చూపుతోందని భావించి వాళ్లు నిషేధం విధించారు. భారత్‌లోనూ ఈ నిర్ణయాన్ని అమలు చేయొచ్చు. అధిక కార్బన్ ఉండే మాంసాహారాన్ని తగ్గించుకోవాలి" అని అన్నారు. అయితే...ఈ బిల్ సాధారణ ప్రజల ఆహార అభిరుచులకు అడ్డంకిగా ఉండదని, పర్యావరణ హిత జీవనాన్ని సాగించేందుకే ఈ నిర్ణయం అమలు చేయాలని కోరుతున్నామని స్పష్టం చేశారు. ఈ బిల్‌తో పాటు మరో ఆసక్తికర బిల్ కూడా పార్లమెంట్‌ ముందుకు రానుంది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తిరాత్ సింగ్ రావత్ "అన్ని విద్యా సంస్థల్లోనూ యోగాను తప్పనిసరి"చేసే బిల్‌ను ప్రవేశపెట్టనున్నారు. దేశమంతా అన్ని స్కూల్స్‌లోనూ ఇది అమలు చేయాలని కోరనున్నారు.


నాన్‌వెజ్‌పై మోహన్ భగవత్..


రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)చీఫ్ మోహన్ భగవత్ ఆహారపు అలవాట్లపై ఇటీవలే కీలక వ్యాఖ్యలు చేశారు. "తప్పుడు ఆహారం తీసుకుంటే తప్పుడు ఆలోచనలే వస్తాయి" అని వ్యాఖ్యానించారు. మాంసాహారం తీసుకునే వాళ్ల గురించి ఇలా పరోక్ష వ్యాఖ్యలు చేశారు భగవత్. హింసతో కూడుకున్న ఆహారాన్ని తీసుకోవటం మంచిది కాదని హితవు పలికారు. ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థైన భారత్ వికాస్ మార్చ్ ఓ కార్యక్రమం నిర్వహించింది. ఈ ఈవెంట్‌లో పాల్గొనేందుకు వచ్చిన భగవత్‌ పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ గురించి ప్రస్తావిస్తూ.. ఈ కామెంట్స్ చేశారు. "తప్పుడు ఆహారం తింటే తప్పుడు మార్గంలోనే వెళ్తాం. తామసాన్ని కలిగించే ఆహారాన్ని తినకపోవటమే మంచిది. విపరీతమైన హింసతో కూడుకున్న ఆహారం తినకూడదు" అని అన్నారు. ఇక్కడ తామసంతో కూడుకున్న ఆహారం అంటే మాంసం అనే అర్థమే వస్తుంది. పాశ్చాత్య దేశాల్లో, భారత్‌లో మాంసాహారులను పోల్చుతూ మరి కొన్ని కామెంట్స్ చేశారు. "భారత్‌లోనూ కొందరు మాంసాహారం తింటారు. కానీ... పశ్చిమ దేశాలతో పోల్చుకుంటే మన దేశంలో మాంసాహారం తీసుకునే వాళ్లు కూడా కొన్ని నియమాలు పాటిస్తారు. శ్రావణ మాసంలో కొందరు మాంసం తినకుండా నిష్ఠగా ఉంటారు. కొందరు సోమవారం, మంగళవారం, శుక్రవారం, శనివారం..ఇలా కొన్ని రోజుల్లో మాంసం ముట్టుకోరు. తమకు తాముగా ఈ నియమాలు పెట్టుకుంటారు" అని భగవత్ చెప్పారు. 


Also Read: Delhi: ఆప్ ఎమ్మెల్యే మొబైల్ చోరీ, 20 మంది ఫోన్లు మిస్ - ప్రచార ర్యాలీలో దొంగల చేతి వాటం