Kejriwal Rally In Delhi:
20 మంది ఫోన్లు మాయం..
ఎన్నికలొస్తున్నాయంటే ఎంత హడావుడి ఉంటుందో చెప్పక్కర్లేదు. బహిరంగ సభలు, ర్యాలీలు, ఉపన్యాసాలు, నిరసనలు..ఇలా కొద్ది రోజుల పాటు రోడ్లన్నీ కిక్కిరిసిపోతాయి. జనాలు పెద్ద ఎత్తున పోగవుతుంటారు. ఇక కీలకమైన నేతలు వచ్చిన సమయంలో ఈ హడావుడి ఎక్కువగా ఉంటుంది. ఇదే అదను చూసుకుని...జేబు దొంగలు తమ చేతులకు పని చెబుతుంటారు. ఢిల్లీలోని ఆప్ ప్రచార ర్యాలీలో ఇదే జరిగింది. సీఎం కేజ్రీవాల్ నేతృత్వంలో ర్యాలీ జరుగుతుండగా...దొంగలు తమ చేతి వాటం చూపించారు. మొత్తం 20 మంది దగ్గర మొబైల్స్ కొట్టేశారు. ఈ బాధితుల్లో ఓ ఆప్ ఎమ్మెల్యే కూడా ఉన్నాడు. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల కోసం నార్త్ ఢిల్లీలోని మల్కా గంజ్ వద్ద నిర్వహించిన ర్యాలీలో తమ మొబైల్స్ మిస్ అయ్యాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. ఆప్ ఎమ్మెల్యే అఖిలేష్ త్రిపాఠి, ఆప్ నేత గుడ్డి దేవి, ఎమ్మెల్యే సోమనాథ్ భారతి సెక్రటరీ...కంప్లెయింట్ చేశారు. డిసెంబర్ 4వ తేదీన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 250 వార్డులున్న ఢిల్లీ మున్సిపాల్టీలో ఎన్నో ఏళ్లుగా బీజేపీ అధికారంలో కొనసాగుతోంది. ఈసారి మాత్రం తామే గెలుస్తామన్న ధీమాతో ఉంది ఆప్. కేజ్రీవాల్ పదేపదే ఇదే మాటను చెబుతూ వస్తున్నారు.
టార్గెట్ బీజేపీ..
ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి 20 కన్నా తక్కువ సీట్లు వస్తాయని జోస్యం కూడా చెప్పారు. "ఈ ఎన్నికల్లో బీజేపీ 20 కి మించి సీట్లు రావు. కావాలంటే రాసిస్తాను" అని మీడియా సమావేశంలో వెల్లడించారు కేజ్రీవాల్. కేవలం ఢిల్లీ అభివృద్ధిని అడ్డుకునేందుకు అవినీతి ఆరోపణలు చేస్తున్నారని బీజేపీని విమర్శించారు. ఢిల్లీలో కుప్పలుగా పేరుకుపోతున్న చెత్త కొండల్ని తొలగిస్తామని బీజేపీ నేతలు హామీ ఇచ్చినా..అవేవీ నెరవేరలేదని గుర్తు చేశారు. బీజేపీ ఇచ్చేవన్నీ అబద్ధపు హామీలని...మార్కెట్లలో ఎక్కడ వేసిన చెత్త అక్కడే ఉంటోందని ఆరోపించారు. తమపై అవినీతి మరకలు అంటించేందుకు బేజీపీ అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తోందని మండి పడుతున్నారు కేజ్రీవాల్. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కి, మనీష్ సిసోడియాకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కేవలం ఆప్‌ను గద్దె దించాలన్న లక్ష్యంతోనే ఇలాంటి అక్రమ ఆరోపణలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు.
కేజ్రీవాల్ ఇచ్చిన 10 హామీలివే..
1. ఢిల్లీని సుందరంగా తీర్చిదిద్దడం
2. చెత్త కొండలను కరిగించడంతో పాటు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌ను అవినీతి రహితంగా మార్చడం
3. పార్కింగ్ సమస్యలు పరిష్కరించడం.
4. వీధి కుక్కల బెడద తీర్చడం
5. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న రోడ్లన్నింటినీ బాగు చేయడం
6. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని పార్క్‌లను అందంగా మార్చడం
7. స్కూల్స్, ఆసుపత్రుల్లో వసతులను సమీక్షించడం
8. తాత్కాలిక ఉద్యోగులను పర్మినెంట్ చేయడం
9. వ్యాపారులకు ఆన్‌లైన్‌లోనే లైసెన్స్‌లు జారీ
10. వీధి వ్యాపారుల కోసం ప్రత్యేకంగా స్వచ్ఛమైన వెండింగ్ జోన్స్‌ల ఏర్పాటు
Also Read: Shraddha Murder Case: అఫ్తాబ్‌కు నార్కో టెస్ట్ పూర్తి- రెండు గంటల పాటు ప్రశ్నలు