వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గవర్నర్ ను కలిసిన సందర్భంగా టీఆర్ఎస్, కేసీఆర్ పై చేసిన ఘాటు వ్యాఖ్యలపై వరుసగా గులాబీ నేతలు స్పందిస్తు్న్నారు. వైఎస్ షర్మిల భారతీయ జనతా పార్టీ వదిలిన బాణమని, కేంద్ర హోం మంత్రి అమిత్ షా డైరెక్షన్‌లోనే షర్మిల పాదయాత్ర సాగుతోందని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. దీక్ష దివాస్ సందర్భంగా థియేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్న భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహంతో పాటు దీక్ష దివాస్ స్ఫూర్తి చిహ్నానికి వినోద్ కుమార్, ప్రభుత్వ చీఫ్ దాస్యం వినయ్ భాస్కర్, మేయర్ గుండు సుధారాణి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల గురించి మాట్లాడారు.


తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుండా అడ్డకుంది వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని, ఆయన కుమార్తె వైఎస్ షర్మిల ఈ రోజు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ డైరెక్షన్‌లో పాదయాత్రలు చేస్తూ ఉద్యమకారులను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థికంగా అణగదొక్కాలని కేంద్ర ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆటలు సాగబోవని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర వాటా తోనే అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు నిర్వహిస్తున్నామని అన్నారు. కేవలం మతతత్వాన్ని రెచ్చగొట్టేందుకే బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ పాదయాత్రలు చేస్తున్నారని తెలంగాణ ప్రజలు అటు షర్మిలను కానీ ఇటు బీజేపీని కానీ నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పనితీరు పట్ల ప్రజలకు ఎంతో గౌరవం నమ్మకం ఉందని ఆ నమ్మకమే టీఆర్ఎస్ పార్టీకి బలమని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ అన్నారు.


షర్మిల వ్యాఖ్యలు ఇవీ


టీఆర్ఎస్ పార్టీలో ప్రతి నాయకుడిపైన విచారణ జరగాలని, ఐటీ సోదాలు జరగాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపకురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు అందరి ఇళ్లపైనా కేంద్ర దర్యాప్తు సంస్థలు సోదాలు చేయాలని అన్నారు. రాష్ట్రంలో లక్షల కోట్ల అవినీతి జరుగుతోందని, కేసీఆర్‌ కుటుంబం లక్షల కోట్లు సంపాదించిందని దుయ్యబట్టారు. కేసీఆర్ దగ్గర ఉన్నవాళ్లు అంతా తాలిబన్ సైన్యమే అని ఎద్దేవా చేశారు. గురువారం (డిసెంబర్ 1) రాజ్ భవన్‌కు వెళ్లిన వైఎస్ షర్మిల గవర్నర్ తమిళిసైను కలిశారు. తనను అరెస్టు చేయడంపై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. అనంతరం బయటకు వచ్చిన ఆమె అక్కడే మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్ గతంలో మాట్లాడిన చెడు వ్యాఖ్యలను షర్మిల ప్రదర్శించారు.


తనను పదే పదే ఆంధ్రా నుంచి వచ్చానని అంటున్నారని వైఎస్ షర్మిల అన్నారు. మరి కేటీఆర్ భార్య ఎక్కడి నుంచి వచ్చారని ప్రశ్నించారు. ఆమె ఆంధ్రా నుంచి వచ్చిందని షర్మిల అన్నారు. అలాంటప్పుడు ఆమెతో విడాకులు తీసుకోవాలని మేము అడుగుతామా? అంటూ నిలదీశారు. తాను పుట్టింది.. పెరిగింది.. వివాహం అన్నీ హైదరాబాద్‌లోనే అయ్యాయని మరోసారి వైఎస్ షర్మిల అన్నారు. ఏ కారణం లేకుండానే తమపై టీఆర్ఎస్ నేతలు, పోలీసులు దాడి చేశారని షర్మిల మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌ కనుసన్నల్లోనే ఇదంతా జరిగిందని ఆరోపించారు. పాదయాత్రను అడ్డుకోవడం, దాడి ఘటనలు, అరెస్టు వ్యవహారంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. 


ఆ ఒక్క మంత్రినే తిడతా - షర్మిల
‘‘చెప్పుతో కొడతా అని కేవలం ఒక మంత్రిని మాత్రమే తిట్టా. ఆయన నన్ను మరదలు అని సంబోధించాడు. కేటీఆర్‌ భార్య ఎక్కడి నుంచి వచ్చారు.. ఆంధ్రా నుంచి కాదా?. విడాకులు తీసుకోమని మేం అడుగుతున్నామా? నేను ఇక్కడే చదివా.. ఇక్కడే పెళ్లి చేసుకున్నా, ఇక్కడే కొడుకుని కన్నా, నా గతం, వర్తమానం, భవిష్యత్‌ అంతా ఇక్కడే’’ అని షర్మిల మాట్లాడారు.