Shraddha Murder Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్‌ హత్య కేసులో నిందితుడు అఫ్తాబ్ పూనావాలాకు నార్కో అనాలసిస్‌ పరీక్షలు పూర్తయ్యాయి. దిల్లీ ఆసుపత్రిలో అఫ్తాబ్‌కు రెండు గంటల పాటు నార్కో పరీక్ష కొనసాగింది. పరీక్ష  ముగిసిందని ఆ సమయంలో అఫ్తాబ్ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని అధికారులు వెల్లడించారు.






ఉదయం


నార్కో పరీక్ష చేసేందుకు గురువారం ఉదయం 8.40 గంటలకు అఫ్తాబ్‌ను ఆసుపత్రికి తీసుకువచ్చారు. టెస్ట్‌ గురించి అఫ్తాబ్ కు వివరించిన నిపుణుల బృందం.. అతడి అంగీకారం తీసుకుంది. అనంతరం 10 గంటలకు నార్కోటెస్ట్‌ మొదలుపెట్టిన అధికారులు.. సుమారు రెండు గంటలపాటు నిందితుడిని ప్రశ్నించినట్లు సమాచారం. 


ఒప్పుకున్నాడు


శ్రద్ధాను అత్యంత దారుణంగా హతమార్చినట్లు నిందుతుడు విచారణలో అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. ఇటీవల నిర్వహించిన పాలిగ్రాఫ్‌ టెస్టులోనూ తన నేరాన్ని అంగీకరించినట్లు తెలిసింది. పాలిగ్రాఫ్‌ టెస్టు సమయంలో శ్రద్ధాను తానే హత్య చేశానని.. అందుకు తనకేమీ పశ్చాత్తాపం, బాధ లేదని చెప్పినట్లు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి. హత్యానంతరం ఆమె శరీర భాగాలను అడవిలో పడేసినట్లు అఫ్తాబ్ ఒప్పుకున్నాడని సమాచారం.


ఆమెను హత్య చేయాలని చాలా కాలం క్రితమే అఫ్తాబ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. చాలా మంది అమ్మాయిలతో తనకు శారీరక సంబంధం ఉన్నట్లు అఫ్తాబ్ ఒప్పుకున్నాడు. శ్రద్ధాను హత్య చేసిన తర్వాత ఆమె కుటుంబ సభ్యులకు అఫ్తాబ్ ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఒప్పుకున్నాడు.


గిఫ్ట్


శ్రద్ధాను హత్య చేసిన తర్వాత మరో అమ్మాయితో అదే ఫ్లాట్‌లో అఫ్తాబ్ సహజీవనం చేశాడు. ఆమెను పోలీసులు విచారణకు పిలువగా నిర్ఘాంత పోయే అంశాలు బయటికి వచ్చాయి. అఫ్తాబ్‌కు ఆమె ఒక డేటింగ్ యాప్ ద్వారా పరిచయం అయింది. వృత్తి రీత్యా ఆమె ఓ మానసిక వైద్యురాలు. శ్రద్ధా హత్య అనంతరం అఫ్తాబ్ ఆమె దగ్గర కౌన్సెలింగ్ తీసుకున్నాడు. ఆమె అతనితో కలిసి చట్రపుర్‌లోని అఫ్తాబ్ ప్లాట్‌కు కూడా వెళ్ళింది. కానీ అఫ్తాబ్ ఎప్పుడూ భయపడినట్లు, కంగారు పడినట్లు కానీ ఆమెకి అనిపించలేదని సైకియాట్రిస్ట్ తెలిపింది. కొన్ని రోజుల క్రితం వెలుగులోకి వచ్చిన శ్రద్ధా హత్య గురించి తెలిసి తాను షాక్‌కు గురైనట్లు ఆమె చెప్పింది. 


Also Read: Hanuman Chalisa Row: నవనీత్ రాణా దంపతులపై అరెస్ట్ వారెంట్ జారీ చేసిన కోర్టు