నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని ఏడాది కాలంగా రైతులు చేసిన ఉద్యమంపై కేంద్ర ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ ఉద్యమంలో ఎంత మంది రైతులు చనిపోయారనే విషయంపై తమ వద్ద ఎలాంటి రికార్డు లేదని పార్లమెంటులో ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఏ ఒక్కరికి పరిహారం ప్రకటించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది.
700 మంది మృతి..
అయితే అన్నదాతలు చేసిన ఈ ఉద్యమంలో 700 మందికి పైగా రైతులు చనిపోయారని రైతు సంఘాలు, విపక్షాలు చెబుతున్నాయి. ముఖ్యంగా పంజాబ్, హరియాణా, పశ్చిమ ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎక్కువ మంది అన్నదాతలు ప్రాణాలు కోల్పోయినట్లు చెబుతున్నారు.
ప్రశ్నకు సమాధానంగా..
సాగు చట్టాల నిరసనలో చనిపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లిస్తుందా అని పార్లమెంటులో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఈ మేరకు స్పందించారు.
ఏడాది ఉద్యమం..
నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని గత ఏడాది నవంబర్ 26 నుంచి రైతులు ఉద్యమం చేస్తున్నారు. ఎట్టకేలకు ఏడాది గడుస్తోన్న సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ.. ఈ సాగు చట్టాలను రద్దు చేస్తామని ప్రకటించారు. అయితే కనీస మద్దతు ధర (ఎమ్‌ఎస్‌పీ)పై చట్టం తీసుకురావాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో పాటు ఉద్యమంలో చనిపోయిన రైతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు.
Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 8,954 కరోనా కేసులు నమోదు, 267 మంది మృతి
Also read: అన్నం తింటే బరువు పెరుగుతామని భయమా... వండే స్టైల్ మార్చండి, బరువు తగ్గుతారు
Also Read: కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్... మొదటి ఫోటో విడుదల చేసిన పరిశోధకులు