పార్లమెంటు ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. అజెండాలో అంశాలు చాలా వరకు పూర్తయిన కారణంగా ఈ శీతాకాల సమావేశాలను ఒకరోజు ముందుగానే ముగించారు. నవంబర్ 29న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 23 వరకు ఇవి కొనసాగాల్సి ఉంది. అయితే కరోనా పరిస్థితులు, ఇతర అంశాల దృష్ట్యా ఒకరోజు ముందుగానే ముగించారు.
కరోనా వల్లా?
శీతాకాల సమావేశాలు ఒక రోజు ముందే ముగించడానికి కరోనా భయాలు కూడా కారణమని సమాచారం. ఈ సమావేశాలకు సోమవారం వరకు హాజరైన బీఎస్పీ ఎంపీ కున్వార్ డానిష్ అలీ మంగళవారం కరోనా బారిన పడ్డారు.
ఎంత సమయం వృథా?
సమావేశాలు ప్రారంభమైన తొలి రోజే రాజ్యసభలో 12 మంది విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడటం వల్ల సభలో నిరసనలు ఎక్కువయ్యాయి. ఎంపీల సస్పెన్షన్‌ను ఎత్తివేయాలంటూ ప్రతిరోజూ ప్రతిపక్షాలు ఆందోళనకు దిగడం వల్ల సభలో నిరంతరం వాయిదాల పర్వం కొనసాగింది. ఈ సమావేశాల్లో 18 గంటల 48 నిమిషాల సమయం వృథా అయింది. ఈ కారణంగా చాలా బిల్లులు చర్చలు లేకుండా మూజువాణి ఓటుతో ఆమోదం పొందాయి.
18 రోజులు..
శీతాకాల సమావేశాల్లో భాగంగా 18 రోజులు పార్లమెంట్ సమావేశమైంది. సాగు చట్టాల రద్దు, ఎన్నికల చట్టాల సవరణ సహా పలు కీలక బిల్లులకు ఈ సమావేశాల్లో పార్లమెంట్ ఆమోదం లభించింది. డిసెంబర్ 2న లోక్సభ సాధారణంతో పోలిస్తే 204 శాతం ఎక్కువగా పనిచేసిందని స్పీకర్ తెలిపారు.
Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 6,317 మందికి కరోనా.. 213కు చేరిన ఒమిక్రాన్ కేసుల సంఖ్య