Pakistan Economic Crisis:


ఖర్చులు తగ్గించుకుంటున్న పాక్..


పాకిస్థాన్‌లోని ఆర్థిక సంక్షోభం సాధారణ ప్రజల్నే కాదు. మంత్రుల్ని కూడా ఇబ్బందులు పెడుతోంది. వాళ్లూ సొంత ఖర్చులు తగ్గించుకోవాల్సి వస్తోంది. ప్రభుత్వం నుంచి వచ్చే జీతాల్లోనూ కోతలు తప్పడం లేదు. మంత్రులెవరైనా సరే ఇకపై విమాన ప్రయాణం చేయాల్సి వస్తే బిజినెస్ క్లాస్‌లో వెళ్లడానికి వీల్లేదు. అంతే కాదు. ఫైవ్ స్టార్‌ హోటళ్లలోనూ స్టే చేయడానికి అవకాశం లేదు. శాలరీల్లోనూ కోతలు విధించి ఇస్తున్నారు. 6.5 బిలియన్ డాలర్ల IMF బెయిల్ అవుట్‌ దక్కాలంటే...కాస్ట్ కట్టింగ్ తప్పదు. అందుకే ఇలా వీలైనంత వరకూ ఖర్చులు తగ్గించుకుంటోంది పాక్ ప్రభుత్వం. ఇప్పటికే 764 మిలియన్ డాలర్ల కాస్ట్ కటింగ్ చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే...ఈ ఖర్చులు తగ్గించుకునే ప్రక్రియ ఇక్కడితే ఆగేలా లేదు. మరి కొన్ని రోజుల పాటు ఇలాగే కొనసాగనుంది. జులైలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. ఆ పద్దులోనే ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు తీసుకోవాల్సిన చర్యలను ప్రకటించనుంది. ఇదే విషయాన్ని ప్రధాని షెహబాజ్ షరీఫ్ వెల్లడించారు. ప్రస్తుతానికి ఇంతకు మించి చేసేదేమీ లేదని స్పష్టం చేశారు. "ఇదొక్కటే తక్షణ పరిష్కారం. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మేం కొన్ని త్యాగాలు చేయక తప్పడం లేదు" అని అన్నారు షెహబాజ్. ప్రస్తుతం పాక్ వద్ద 3 బిలియన్ డాలర్ల ఫారెక్స్ నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఇవి మరి కొద్ది వారాల్లో ఖర్చైపోతాయి. ఆ మధ్య వచ్చిన వరదల కారణంగా దేశం ఆర్థికంగా మరింత బలహీనపడిపోయింది. ఆహార కొరత వేధిస్తోంది. ద్రవ్యోల్బణం 30%కి పెరిగింది. 


పన్నులు పెంచిన ప్రభుత్వం..


ఇప్పటికే దేశ పౌరులు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అయినా షెహబాజ్ ప్రభుత్వం మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా కఠినంగా వ్యవహరిస్తోంది. మంత్రులు తమంతట తాముగా జీతాలు తక్కువగా తీసుకుంటామని చెప్పారు. లగ్జరీ వస్తువులు కొనొద్దని ప్రభుత్వం ప్రజల్ని ఆదేశించింది. విలాసవంతమైన వస్తువులపై ట్యాక్స్‌లను విపరీతంగా పెంచింది. ఈ వస్తువులు దిగుమతిపైనా సుంకాన్ని పెంచేసింది. 


పాకిస్థాన్‌లో ఆర్థిక వ్యవస్థ కుప్ప కూలిపోయింది. అక్కడి ప్రజలు ఎంతో దారుణమైన పరిస్థితుల్లో బతుకుతున్నారు. కనీసం ఒక్క పూట తిండి తినడానికీ అవస్థలు పడుతున్నారు. ఆహార ధాన్యాల కోసం కొట్టుకుంటున్నారు. ద్రవ్యోల్బణం 30 శాతానికి చేరుకుంది. కిలో పిండి ధర రూ.250కు చేరుకుంది. ఇక పెట్రోల్, డీజిల్ ధరలైతే కొండెక్కి కూర్చున్నాయి. అయితే ఆపదలో ఉన్న టర్కీని ఆదుకుంటున్న భారత్ పాకిస్థాన్‌కు సాయం చేస్తుందా..? అన్న చర్చ చాలా రోజులుగా జరుగుతోంది. ఈ క్రమంలోనే RSS నేత డాక్టర్ కృష్ణ గోపాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ ప్రభుత్వానికి ఓ సూచన చేశారు. 


"పాకిస్థాన్‌ మనల్ని సాయం కోరకపోయినా భారత్‌ సహకరించాలి. అక్కడి ప్రజల గురించి ఆలోచించాలి. అక్కడి కుక్కలు కూడా ఆకలితో బాధ పడకుండా చూసుకోవాలి. ఆ దేశ పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. భారత్ కనీసం 10-20 లక్షల టన్నుల గోధుమల్ని పాకిస్థాన్‌కు పంపితే  బాగుంటుంది. కచ్చితంగా ఆ దేశం గురించి ఆలోచించాలి" 


-డాక్టర్ కృష్ణ గోపాల్, ఆర్‌ఎస్‌ఎస్ నేత 


Also Read: US F-1 Visa New Rule: భారత విద్యార్థులకు అమెరికా గుడ్‌న్యూస్, ఇకపై ఏడాది ముందే వీసా తీసుకోవచ్చు