US Student Visas:


వెయిటింగ్ పీరియడ్ తగ్గించేందుకు..


యూఎస్‌లో చదువుకోవాలని కలలు కనే విద్యార్థులకు ఆ దేశం తీపి కబురు అందించింది. కోర్స్‌ మొదలయ్యే సంవత్సరం ముందే వీసా తీసుకునేందుకు అవకాశం కల్పించనుంది. ఇప్పటికే వీసాల కోసం రోజుల తరబడి ఎదురు చూస్తున్న వారికి ఇది ఊరటనివ్వనుంది. సాధారణంగా వెయిటింగ్ పీరియడ్‌ 300 రోజుల వరకూ ఉంటోంది. అయితే...భారత్, అమెరికా మధ్య పలు రౌండ్ల చర్చల తరవాత...వరుసగా అమెరికా వీసా నిబంధనలను సులభతరం చేస్తూ వస్తోంది. వెయిటింగ్ పీరియడ్‌ను తగ్గించేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే విద్యార్థులు అకాడమిక్ కోర్స్‌ మొదలయ్యే ఏడాది ముందే వీసా తీసుకునేలా వెసులుబాటు కల్పించనుంది. అమెరికా బ్యూరో ఆఫ్ కన్సూలర్ అఫైర్స్ అధికారికంగా ఈ ప్రకటన చేసింది. F,M కేటగిరీల్లో  విద్యార్థులకు ఇచ్చే వీసాలను 365 రోజుల ముందే జారీ చేసేలా రూల్ మార్చింది. 


"I-20 ప్రోగ్రామ్‌లో భాగంగా F&M స్టూడెంట్ వీసాలను 365 రోజుల ముందే జారీ చేయనున్నాం. తద్వారా ఎక్కువ మంది విద్యార్థులు వీసాల కోసం అప్లై చేసుకునేందుకు వీలుంటుంది" 


-యూఎస్ బ్యూరో 










ఏడాది ముందే వీసా వచ్చినప్పటికీ కోర్సు మొదలు కాకముందే విద్యార్థులు అమెరికాకు వెళ్లేందుకు అనుమతి ఉండదు. కోర్సు మొదలయ్యే 30 రోజుల కన్నా ముందు అనుమతించరు. యూనివర్సిటీలో అడ్మిషన్ దొరికిన విద్యార్థులు వీసా ఇంటర్వ్యూలను 120 రోజులు ముందుగానే షెడ్యూల్ చేసుకోవచ్చని అగ్రరాజ్యం వెల్లడించింది. ఈ ఏడాది రికార్డు స్థాయిలో భారత విద్యార్థుల నుంచి వీసాలు వచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకే...ఆ మేరకు నిబంధనల్ని సులభతరం చేస్తున్నారు.