గత నవంబర్ నెల నుంచి కాకతీయ మెడికల్ కాలేజీ పీజీ విద్యార్థిని ప్రీతి.. సైఫ్ అనే మరో విద్యార్థి వల్ల ఇబ్బంది పడిందని వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. ప్రీతి కేసులో విచారణలో కీలక అంశాలు తెలిశాయని చెప్పారు. ప్రీతి కేసు గురించి వరంగల్ సీపీ శుక్రవారం (ఫిబ్రవరి 24) మధ్యాహ్నం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. జూనియర్ ను సీనియర్ అవమానిస్తే అది ర్యాగింగ్ కిందకే వస్తుందని సీపీ చెప్పారు. అందుకే ప్రీతిని ఆత్మహత్యకు పురిగొల్పడం, ర్యాగింగ్, ఎస్సీ - ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద సైఫ్‌పై కేసులు పెట్టినట్లుగా సీపీ చెప్పారు. ప్రీతి చాలా డేరింగ్ అమ్మాయి అని, అదే సమయంలో సెన్సిటివ్ కూడా అని చెప్పారు. ప్రీతికి ప్రశ్నించే తత్వం ఉందని చెప్పారు. కరెక్ట్ గా లేని ఏ విషయాన్ని అయినా అంగీకరించకుండా ప్రశ్నించేదని చెప్పారు. అలా తనను క్వశ్చన్ చేయడాన్ని సైఫ్ జీర్ణించుకోలేకపోయారని, ప్రీతిని కావాలనే వేధించినట్లుగా తెలుస్తుందని సీపీ చెప్పారు.


‘‘ఫోన్ గ్రూప్ చాటింగ్ లో అవమానపరుస్తున్నావని ప్రీతి సైఫ్‌ను ప్రశ్నించింది. అతను వాట్సాప్ గ్రూప్ లో ఇన్సల్ట్ చేయడం లాంటివి చేశాడు. బుర్ర తక్కువుందని ఇబ్బందులకు గురి చేశాడు. సైఫ్ ఒక బాస్ లా వ్యవహరించాడు. సెకండియర్ వాళ్ళను ఫస్టియర్ వాళ్ళు సర్ అనే అలవాటు ఉంది. దాన్ని ఆసరాగా చేసుకుని బాస్ లా వ్యవహరించారు. ప్రీతి తెలివిగల అమ్మాయి, ప్రశ్నించే తత్వం గల అమ్మాయి. అలా ప్రశ్నించడం సైఫ్ సహించలేక పోయాడు.’’ అని సీపీ వెల్లడించారు.


ప్రీతి ఫోన్‌లోని చాటింగ్‌లు, కాల్స్ డేటాను బట్టి సైఫ్‌తో ఆమెకు మధ్య జరిగిన విభేదాల కారణంగా బాగా ఒత్తిడికి లోనైనట్లు అర్థం అవుతుందని సీపీ చెప్పారు. ఒకరోజు అర్ధరాత్రి 3 గంటల సమయంలో తన స్నేహితుడికి ఫోన్ చేసిందని, అతను ఆమెకు ధైర్యం చెప్పాడని సీపీ చెప్పారు. ఆ రోజే ఉదయం ప్రీతి ఆత్మహత్యకు పాల్పడింది. అనస్తీషియా స్టూడెంట్స్‌కు ఇచ్చే కిట్‌లో ఉండే డ్రగ్‌ను ప్రీతి ఇంజెక్ట్ చేసుకుందని చెప్పారు. అంతకుముందు ఆమె ఆ మందు వాడితే ఎలా ప్రభావం చూపుతుందని కూడా గూగుల్ లో సెర్చ్ చేసిందని వివరించారు. ప్రీతి రక్త పరీక్షల రిపోర్టు వచ్చాక, అందులో ఏ డ్రగ్ కలిసిందనే కచ్చితమైన విషయం తెలుస్తుందని చెప్పారు.


ఇంకా ఎంక్వైరీ చేస్తున్నాం


‘‘సైఫ్ కావాలనే ప్రీతిని వేధించినట్లు వాట్సప్ చాట్స్ ద్వారా తెలిసింది. తన ఫ్రెండ్స్ తో కూడా ప్రీతి ఎక్కువ చేస్తున్నట్లు చెప్పాడు. సైఫ్ కి ప్రీతి తనను ఎందుకు వేధిస్తున్నావంటూ మెసేజ్ కూడా చేసింది. ప్రీతి మానసికంగా ఇబ్బంది పడినందువల్లే ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రీతి ఆత్మహత్యాయత్నానికి సైఫ్ వేధింపులే కారణంగా ప్రాథమికంగా నిర్దారించాం. ఈ ఘటనకు ఎలాంటి రాజకీయ రంగుపులమొద్దు. సైఫ్ కు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేదు. ఘటన వెలుగులోకి రాగానే పోలీసులు రియాక్ట్ కాలేదన్నది అవాస్తవం. పోలీసులను హెల్ప్ కావాలని తనకున్న సంబంధాలతో ఓరల్ గా అడిగారు. ప్రీతి తండ్రిని అడిగితే పోలీస్ రియాక్ట్ అయ్యారని చెప్పారు. ర్యాగింగ్ అనేది ఇక్కడ చూడకూడదు.. బాసింగ్ అనేదే ఇక్కడ ప్రధానం. ఇంకా ఎంక్వైరీ చేస్తున్నాం.. ఫస్ట్ ఇయర్ విద్యార్థులతో మాట్లాడాలి. 


లైంగిక వేధింపులు లేవు - సీపీ


ఈ ఘటనలో పోలీస్ పరంగా ఎలాంటి నిర్లక్ధ్యం ఉన్నా ఊరుకోం. ఈ ఘటనలో ఎక్కడా లైంగిక వేధింపులు లేవు. ఈ కేసులో వాట్సప్ చాట్స్ కీలకంగా తీసుకున్నాం. .సైఫ్ మాత్రం తను టార్గెట్ చేయట్లేదని.. సబ్జెక్ట్ నేర్పించే ప్రయత్నం చేశానని చెప్పాడు.’’ అని సీపీ చెప్పారు.