వరంగల్ లోని కాకతీయ వైద్య కళాశాల విద్యార్థిని డాక్టర్ ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసులో అందుకు కారణంగా భావిస్తున్న వ్యక్తిని అరెస్టు చేశారు. సీనియర్ పీజీ విద్యార్థి డాక్టర్ సైఫ్ వేధింపుల కారణంగానే ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసినట్టు వార్తలు వచ్చాయి. విచారణ చేసిన మట్టెవాడ పోలీసులు సైఫ్‌ను అదుపులోకి తీసుకున్నారు. సైఫ్ ఫోన్‌ను చెక్ చేసిన పోలీసులకు ఛాటింగ్‌లో కొన్ని ఆధారాలు వెలుగు చూశాయి. పోలీసులు సైఫ్‌ఫై ర్యాగింగ్, వేధింపులతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఈ కేసును అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నట్లుగా ఏసీపీ బోనాల కిషన్ తెలిపారు. ప్రీతిని సైఫ్ వేధించిన అంశంపై మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెడతామని ఏసీపీ తెలిపారు. ఇప్పటికే వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్ మట్టెవాడ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. అక్కడి పోలీసులతో సమావేశం అయి మొత్తం వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు ఆందోళనలు చేస్తుండడంతో కాకతీయ మెడికల్ కాలేజీ, ఎంజీఎం హాస్పిటల్ వద్ద భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.
డాక్టర్ ప్రీతి మెడికల్ బులెటిన్ విడుదల
ప్రస్తుతం ప్రీతిని వరంగల్ నుంచి హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆరోగ్యం విషమంగా ఉంది. ఆమెకు ఎక్మోపై చికిత్స అందిస్తున్నారు. న్యూరాలజీ, జనరల్ ఫిజీషియన్, కార్డియాలజిస్టుతో కూడిన ఐదుగురు వైద్యుల బృందం నిరంతరం పర్యవేక్షిస్తుంది. డాక్టర్ ప్రీతిని తమ దగ్గరకు తీసుకొచ్చేటప్పటికే పలు అవయవాలు పనిచేయడం లేదని, ఆమెను వెంటిలేటర్ సపోర్ట్‌తో తరలించినట్లు నిమ్స్ వర్గాలు నిన్న ఓ ప్రకటనలో తెలిపాయి.
గవర్నర్ పరామర్శ
నిమ్స్‌లో డాక్టర్ ప్రీతిని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గురువారం పరామర్శించారు. ఆమెకు అందిస్తున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ‘‘ఇది చాలా బాధాకర పరిస్థితి. ఒక డాక్టర్‌గా నేను పరిస్థితిని అర్థం చేసుకోగలను’’ అని వ్యాఖ్యానించారు. వైద్యులు చేయాల్సిందంతా చేస్తున్నారని.. ఇప్పుడే ఒక నిర్ణయానికి రాలేమని అన్నారు. గవర్నర్ పరామర్శకు వచ్చిన సందర్భంలో ప్రీతి తల్లిదండ్రులు బోరున విలపించారు. తమకు న్యాయం చేయాలని గవర్నర్‌ను వేడుకున్నారు.