Russia Ukraine War:
ఓటింగ్‌కు భారత్ దూరం..
రష్యా ఉక్రెయిన్ మధ్య ఏడాదిగా యుద్ధం జరుగుతూనే ఉంది. ఇప్పటికీ ఈ వివాదం ఓ కొలిక్కి రాలేదు. తగ్గినట్టే తగ్గి మళ్లీ క్షిపణుల దాడులు చేస్తోంది రష్యా. అటు ఉక్రెయిన్ కూడా గట్టిగానే బదులు చెబుతోంది. ఫలితంగా..రోజురోజుకీ పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే ఐక్యరాజ్య సమితి కీలక నిర్ణయం తీసుకుంది. United Nations General Assembly (UNGA) ఉక్రెయిన్‌కు సంబంధించిన ఓ తీర్మానం ప్రవేశపెట్టింది. తక్షణమే రష్యా సేనలు ఉక్రెయిన్ నుంచి వెనుదిరగాలని, యుద్ధం ఆపేయాలని తేల్చి చెప్పింది. యుద్ధం మొదలై ఏడాది కావస్తున్న సందర్భంగా ఈ తీర్మానం తీసుకొచ్చింది. 141 ఓట్లతో ఈ తీర్మానానికి ఆమోదం లభించింది. అయితే...భారత్, చైనా మాత్రం ఈ ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డ్మిట్రో కులెబా ఈ తీర్మానంపై సంతోషం వ్యక్తం చేశారు. కేవలం పశ్చిమ దేశాలే కాకుండా మిగతా దేశాలు కూడా ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలవడాన్ని ప్రశంసించారు. లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆసియా దేశాలు కూడా ఉక్రెయిన్‌కు సపోర్ట్ ఇస్తున్నాయనడానికి ఇదే నిదర్శనం అని తేల్చి చెప్పారు. అయితే...ఈ తీర్మానానికి బెలారస్, మాలి, నికరాగువా, రష్యా, సిరియా,ఉత్తరకొరియా, ఎరిటెరా దేశాలు వ్యతిరేకంగా ఓటు వేశాయి.రష్యాకు మిత్రదేశమైన బెలారస్...ఈ తీర్మానంలో మార్పులు చేర్పులు చేయాలని పట్టు పట్టింది. ఉక్రెయిన్‌కు అండగా నిలిచిన దేశాలకు అధ్యక్షుడు జెలెన్‌స్కీ థాంక్స్ చెప్పారు. ట్విటర్‌లో వరుసగా పోస్ట్‌లు చేశారు.
5 సార్లు తీర్మానాలు..
నిజానికి..ఇప్పటికే ఐక్యరాజ్య సమితి అసెంబ్లీలో 5 సార్లు రష్యాకు వ్యతిరేకంగా తీర్మానాలు ప్రవేశ పెట్టారు. గతేడాది అక్టోబర్‌లో పాస్ చేశారు. ఉక్రెయిన్‌ను రష్యా అక్రమంగా హస్తగతం చేసుకోవాలని చూడడాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం ప్రవేశ పెట్టగా 143 ఓట్లు ఉక్రెయిన్‌కు అనుకూలంగా వచ్చాయి. దాదాపు రెండ్రోజుల పాటు అసెంబ్లీలో ఇప్పటికే చర్చలు జరిగాయి. 75 దేశాలకు చెందిన దౌత్యవేత్తలు ఈ అంశంపై చర్చించారు. ఉక్రెయిన్‌కు అండగా ఉంటామని స్పష్టం చేశారు.