Google Office Desk Sharing: 


రూల్స్ పాటించాల్సిందే..


ఈ మధ్యే ట్విటర్‌ ఇండియాలోని రెండు ఆఫీస్‌లకు తాళం వేసేసింది. ఖర్చులు తగ్గించుకోడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడిదే బాటలో నడుస్తోంది గూగుల్. ఆఫీస్‌ల సంఖ్యను తగ్గించే పనిలో పడింది. ఆ మేరకు కాస్ట్‌ కటింగ్ చేసుకోవచ్చని భావిస్తోంది. ఫలితంగా ఉద్యోగులు ఇకపై డెస్క్‌లు షేర్ చేసుకోక తప్పదు. అంటే...ఒకే డెస్క్‌లో ఇద్దరు కలిసి పని చేసుకోవాలన్నమాట. అమెరికాలో మొత్తంగా 5 Google Cloud ఆఫీస్‌లున్నాయి. న్యూయార్క్, కిర్క్‌లాండ్, వాషింగ్టన్, సన్నీవేల్, శాన్ ఫ్రాన్సిస్కో, సియాటెల్‌లోని ఆఫీస్‌లలో ఉద్యోగులు డెస్క్ షేరింగ్ చేసుకోక తప్పేలా లేదు. ఈ మోడల్‌ను అమలు చేసేందుకు గూగుల్ ఇప్పటికే టీమ్‌లను తయారు చేస్తోంది. 200-300 మంది ఉద్యోగులను కలిపి ఓ టీమ్‌గా డివైడ్ చేస్తోంది. "నైబర్‌హుడ్స్" పేరుతో వీళ్లంతా డెస్క్ షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టీమ్‌కి ఓ లీడర్ ఉంటారు. డెస్క్‌ షేరింగ్‌కి సంబంధించిన రూల్స్‌ అన్నీ చెబుతారు. వర్క్‌ సెటప్‌కు సంబంధించి అన్ని సౌకర్యాలూ ఉండేలా, కమ్యూనికేషన్‌లో సమస్యలు తలెత్తకుండా చూసుకుంటారు. Google Cloud ఉద్యోగులంతా వారానికి రెండు రోజులు ఆఫీసులో పని చేయాల్సి ఉంటుంది. సోమ, బుధవారాల్లో లేదా మంగళ, గురువారాల్లో ఆఫీస్‌లకు రావచ్చు. ఈ రూల్‌ ప్రకారం...ఉద్యోగులు కచ్చితంగా ఆ రెండు రోజులు మాత్రమే ఆఫీస్‌కు రావాలి. అయితే...ఈ డెస్క్ సెటప్‌కు ఉద్యోగులందరూ సహకరించాలని కోరింది గూగుల్ యాజమాన్యం. డెస్క్‌ పార్టనర్‌ విషయంలో రూల్స్ పాటంచాలని తెలిపింది. అయితే...కంపెనీ నిర్ణయంపై ఎంప్లాయిస్ రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు మీమ్స్‌ కూడా షేర్ చేస్తున్నారు. ఇలాంటి రూల్స్ కూడా పెడతారా అంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.  


లేఆఫ్‌లు..


గూగుల్‌ మరోసారి ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. ఇప్పటికే లేఆఫ్‌లు మొదలు పెట్టిన సంస్థ...ఇప్పుడు మరోసారి అదే పని మొదలు పెట్టింది. ఇండియాలోని 453 మంది ఉద్యోగులను తొలగించింది. రకరకాల విభాగాల్లోని ఉద్యోగులను ఇంటికి పంపింది. రాత్రికి రాత్రే మెయిల్స్ పంపించి "టర్మినేట్" చేస్తున్నట్టు ప్రకటించింది. గూగుల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ సంజయ్ గుప్తా స్వయంగా ఈ ఉద్యోగులందరికీ మెయిల్స్ పంపారు. ఒకేసారి 12 వేల మందిని తొలగించనున్నట్టు ఇటీవలే గూగుల్ ప్రకటించింది. అందులో భాగంగానే ఆ పని ప్రారంభించింది. కంపెనీ గ్రోత్ తగ్గిపోయినందున లేఆఫ్‌లు తప్పడం లేదని ఇప్పటికే గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ వెల్లడించారు. ఇప్పటికిప్పుడు ఈ నిర్ణయం తీసుకోకపోతే..భవిష్యత్‌లో ఇంత కన్నా దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. అందుకే...వెనకా ముందు ఆలోచించకుండా లేఆఫ్‌లు కొనసాగిస్తున్నామని చెప్పారు. బడా కంపెనీలన్నీ ఇండియాలో మార్కెట్‌ పెంచుకునేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి. అయితే..కొవిడ్ తరవాత ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చాయి. రెవెన్యూ పడిపోయింది. దీనికి తోడు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం కొనసాగుతోంది. అందుకే ఖర్చులు తగ్గించుకునేందుకు పెద్ద సంస్థలన్నీ ఇలా ఉద్యోగులను తొలగిస్తూ పోతున్నాయి.


Also Read: Google Chrome: గూగుల్ క్రోమ్ గుడ్ న్యూస్ - ఇక మీరు ఎంత బ్రౌజ్ చేసినా మెమరీ నిండదు, పవర్ కూడా ఆదా!