Pakistan Economic Crisis:


సర్జరీలు చేయకండి: పాక్ ప్రభుత్వం 


పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభం అక్కడి హెల్త్‌కేర్ రంగాన్నీ దెబ్బ తీసింది. ఆసుపత్రుల్లో ఉన్న రోగులకు అత్యవసర మందులు అందించలేక ఇబ్బందులు పడుతోంది ప్రభుత్వం. ఫారెక్స్ నిల్వలు నిండుకుంటున్నాయి. ఫలితంగా వేరే దేశాల నుంచి మందులు దిగుమతి చేసుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది. దేశీయంగా తయారు చేయాలన్నా Active Pharmaceutical Ingredients (API)కూడా అందుబాటులో లేవు. ప్రస్తుతానికి దేశీయంగా మందులు తయారు చేస్తున్న కంపెనీలు కూడా పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేయడం లేదు. సర్జరీలు చేయొద్దంటూ వైద్యులకు అల్టిమేటం జారీ చేసింది పాక్ సర్కార్. అత్యవసర సర్జరీలకు అవసరమైన అనస్తీషియా మరో రెండు వారాలకు సరిపడ మాత్రమే ఉంది. గుండె, కిడ్నీ జబ్బులతో పాటు క్యాన్సర్‌తో బాధ పడుతున్న రోగులకూ మందులు దొరకడం లేదు. ఈ సమస్యలకు తోడు ఆసుపత్రుల్లో సరిపడా సిబ్బంది కూడా లేరు. చాలా మందికి జీతాలివ్వలేక తొలగించారు. ఫలితంగా ప్రజల కష్టాలు మరింత పెరిగాయి. అయితే...ఈ సమస్యకు ప్రభుత్వమే కారణమని డ్రగ్ కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి. బ్యాంకులు దిగుమతులకు అవసరమైన లెటర్స్ ఆఫ్ క్రెడిట్‌లు జారీ చేయడం లేదని మండి పడుతున్నాయి. పాకిస్థాన్‌లో వైద్యం అంతా విదేశాల నుంచి వచ్చిన మందులతోనే నడుస్తోంది. దేశీయంగా పెద్దగా ఉత్పత్తి లేక మొత్తంగా వేరే దేశాలపైనే ఆధారపడాల్సి వస్తోంది. భారత్, చైనా నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకుంటోంది. 


పెరిగిన ఖర్చులు..


మందుల తయారీ ఖర్చు కూడా భారీగా పెరిగినట్టు సంస్థలు వెల్లడించాయి. పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరగడం వల్ల రవాణా ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. విదేశాల నుంచి వచ్చిన మందులను కరాచీ పోర్ట్ వద్దే ఆపేశారు. వాటిని కొనుగోలు చేసేందుకు అవసరమైన డాలర్లు పాక్‌ వద్ద లేవు. అటు పాకిస్థాన్‌ రూపాయి విలువ దారుణంగా పడిపోతోంది. ఈ సంక్షోభం నుంచి బయటపడేసేందుకు ప్రభుత్వం ఏదో నిర్ణయం తీసుకోవాలని  Pakistan Medical Association (PMA) సూచించింది. కానీ అధికారులు కేవలం నిల్వలు ఎన్ని ఉన్నాయో లెక్కలు వేసుకుంటున్నారే తప్ప ఉపశమన చర్యలు తీసుకోవడం లేదు. ఈ సమస్య ఇలాగే కొనసాగితే...మరో నాలుగైదు వారాల్లో దారుణ పరిస్థితులు ఎదుర్కోక తప్పదని హెచ్చరిస్తున్నారు వైద్యులు. 


పాకిస్థాన్ సంక్షోభం ముదురుతోంది. తిండికి తిప్పలు పడుతున్నారు అక్కడి ప్రజలు. మాకు సాయం చేయండి అంటూ ప్రతి దేశాన్నీ అర్థిస్తోంది దాయాది. రోజుకు రెంజు సార్లు బ్రెడ్‌ కొనేందుకూ నానా అవస్థలు పడాల్సి వస్తోంది. ఈ క్రమంలోనే పాకిస్థాన్ మాజీ ప్రధాని 
ఇమ్రాన్ ఖాన్ జైల్ భరో ఉద్యమం మొదలు పెట్టారు. పాకిస్థాన్ తెహరీక్ ఇ ఇన్సాఫ్ పార్టీ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఆహారం కోసం రోడ్లపైకి వచ్చి నిరసనలు ప్రజలందరినీ జైళ్లకు పంపాలన్నదే ఈ ఉద్యమం ఉద్దేశం. జైల్లో పెడితే కనీసం టైమ్‌కి బ్రెడ్‌కి దొరుకుతుందన్నది ఇమ్రాన్ ఖాన్ ఇచ్చిన ఆలోచన. బయట అలా ఆహారం కోసం ఆందోళనలు చేసే బదులు జైల్లో ఉంటూ సమయానికి తిండి తినడం బెటర్ కదా అంటున్నారు ఇమ్రాన్. ఆకలికి తట్టుకోలేక కొందరు గోధుమ పిండిని దొంగిలిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఇమ్రాన్‌ ఖాన్ స్ట్రాటెజీ చాలా బాగుందంటూ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


Also Read: Jammu Kashmir: కశ్మీర్‌లో మరోసారి ఉగ్ర అలజడి, సెక్యూరిటీ గార్డ్‌పై కాల్పులు - ప్రాణాలతో పోరాడి మృతి