Jammu Kashmir Target Killings: 



జమ్ముకశ్మీర్‌లో టార్గెట్ కిల్లింగ్స్ కొనసాగుతున్నాయి. మైనార్టీ వర్గానికి చెందిన ఓ బ్యాంకు సెక్యూరిటీ గార్డ్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఘటన జరిగిన వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రాణాలతో పోరాడి చివరకు కన్ను మూశాడు. మృతుడిని సంజయ్ శర్మగా గుర్తించారు. పుల్వామాలో మార్కెట్‌కు వెళ్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్టు పోలీసులు వెల్లడించారు. సంజయ్ శర్మ ప్రాణాలతో పోరాడి ఓడినట్టు తెలిపారు. ఈ ఘటనతో మరోసారి పుల్వామా ఉలిక్కి పడింది. ఆ ప్రాంతంలో పూర్తి స్థాయిలో తనిఖీలు చేపడుతున్నారు పోలీసులు. కశ్మీర్‌ పోలీసులు ఈ విషయాన్ని నిర్ధరిస్తూ ట్వీట్ చేశారు. 









జమ్ముకశ్మీర్‌లో ఈ మధ్య కాలంలో మళ్లీ ఉగ్రదాడులు పెరుగుతున్నాయి. రాజౌరి జిల్లాలో జరిగిన దాడిలో ఆరుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో కేంద్రం అప్రమత్తమైంది. భద్రతను కట్టుదిట్టం చేస్తోంది. ఇందులో భాగంగానే...18 వందల మంది అదనపు CFPF బలగాలను రంగంలోకి దించనుంది. పూంచ్‌, రాజౌరీ జిల్లాల్లో వీరిని మొహరించనున్నారు. ANI తెలిపిన వివరాల ప్రకారం...CRPFకి చెందిన 18 కంపెనీల బలగాలు రంగంలోకి దిగనున్నాయి. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ అదనపు బలగాలతో ఉగ్రవాదంపై పోరాడటం మరింత సులువవుతుందని కేంద్రం భావిస్తోంది. ఇప్పటికే 9 సీఆర్‌పీఎఫ్ కంపెనీలు రాజౌరికి చేరుకున్నాయి. మిగతా బలగాలు ఢిల్లీ నుంచి వెళ్లనున్నాయి. వీరంతా కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్‌లో కీలక పాత్ర పోషించనున్నారు. జమ్ముకశ్మీర్‌లో జరుగుతున్న ఉగ్రదాడులపై ప్రతిపక్షాలు మండి పడుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ బీజేపీని తీవ్రంగా విమర్శించారు. జమ్ముకశ్మీర్‌లో జరుగుతున్న ఈ విధ్వంసానికి కేంద్ర ప్రభుత్వమే కారణమని అన్నారు. రోజురోజుకీ జమ్ముకశ్మీర్‌లో పరిస్థితులు అదుపు తప్పుతున్నాయని అసహనం వ్యక్తం చేశారు. జమ్ము ప్రజలు బీజేపీకి మద్దతుగా నిలబడ్డారని...కానీ వారికి రక్షణ లేకుండా పోయిందని అన్నారు.