శ్రీసత్య సాయి జిల్లా కదిరి పట్టణంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే కందికుంటకు వైఎస్ఆర్ సీపీ నాయకులు మధ్య రాళ్ల దాడి జరిగింది. సీఐ తమ్మిశెట్టి మధు ఇంటి ముందు టీడీపీ మహిళా విభాగం ధర్నా చేసింది. వారికి మద్దతుగా కందికుంట వెంకటప్రసాద్ నిలవగా పోలీసుల లాఠీ చార్జి చేశారు.


గొడవకు కారణం ఏంటంటే


స్థానిక లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ తిరువీధులలో ఆక్రమణలు తొలగించడానికి ప్రయత్నిస్తున్న సందర్భంగా ఈ గొడవ జరిగింది. వారికి మద్దతుగా ఉన్న  మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్‌కు అక్కడికి చేరుకున్న సీఐ తమ్మిశెట్టికు మధ్య మాట మాట పెరగడం జరిగింది. సీఐ మధు మహిళలను కించపరుస్తూ వ్యాఖ్యలు చేశాడని మధు ఇంటి వద్ద టీడీపీ మహిళా విభాగం ధర్నాకు వెళ్ళగా వారికి మద్దతుగా కందికుంట వెంకటప్రసాద్ కూడా వెళ్లారు. అదే సందర్భంలో వైసీపీ నాయకులు పోలీసులకు మద్దతుగా అక్కడకు చేరుకున్నారు. ఈ క్రమంలో పరస్ఫరంగా రాళ్ల దాడి చేసుకున్నారు. రాళ్లు, బాటిళ్లు, చెప్పులను విసిరారు.


పోలీసులు వైసీపీ కార్యకర్తల దాడిలో చాలా మంది గాయపడ్డారు. వారిని కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీ నేతలు పరిటాల సునీత, పల్లె రఘునాథ్ రెడ్డి, బికి పార్థసారథి, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప తదితరులు పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ దౌర్జన్యాలపై ధ్వజమెత్తారు.


జనాల భూజాలపైకి ఎక్కి.. మీసం మెలేసిన సీఐ


పట్టణ సీఐ మధు టీడీపీ శ్రేణులపై మీసం మెలేసి తగులుకుందాం రా అంటూ దురుసు ప్రవర్తన చేయడం సంచలనం అయింది. వైసీపీ నాయకులు, కార్యకర్తలు సీఐ తమ్మిశెట్టి మధును భుజాల పైకి ఎత్తుకుని మరోవర్గంపై రాళ్లు రువ్విన వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి.


కదిరి పట్టణంలోని నరసింహస్వామి ఆలయ వీధిలో ఆక్రమణలను తొలగించేందుకు ఆలయ అధికారులు, ధర్మకర్తలు ప్రయత్నించారు. అయితే, ఉన్నట్టుండి తమ దుకాణాలను తొలగిస్తే ఉపాధి కోల్పోతామని పలువురు అభ్యంతరం తెలిపారు. ఈ వివాదంపై బాధితుల తరఫున టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కందికుంట వెంకట ప్రసాద్‌ ఆలయ అధికారులతో ముందురోజు శుక్రవారం రాత్రి మాట్లాడారు. అయితే శనివారం ఉదయం నుంచే అధికారులు ఆక్రమణల తొలగింపు ప్రారంభించారు. కందికుంట వెంకట ప్రసాద్‌ ఆ సమయంలో అక్కడికి చేరుకుని అభ్యంతరం తెలిపారు. వీధుల్లో పూర్తిగా అడ్డంగా ఉన్నవి మాత్రమే తొలగించాలని కోరారు. దీనికి ఆలయ కమిటీ చైర్మన్‌ జెరిపిటి గోపాలకృష్ణ, ఈవో పట్టెం గురుప్రసాద్‌, సీఐ మధు ఒప్పుకోలేదు. రేకులన్ని తొలగించాల్సిందే అని వ్యాపారులకు సీఐ హుకుం జారీ చేశారు. దీంతో కందికుంటకు, అధికారులకు మధ్య ఈ గొడవ జరిగింది.