Pakistan Bus Fire:


పాక్‌లో ఘోర ప్రమాదం..


పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ బస్సుకి మంటలు అంటుకుని 17 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీళ్లంతా వరద బాధితులే. దక్షిణ పాకిస్థాన్‌లోని  కరాచీలో M-9 మోటార్‌వేలో  జరిగిందీ ఈ దారుణం. సింధ్ ప్రావిన్స్‌లోని హైదరాబాద్‌, జమ్‌శోరో సిటీలను అనుసంధానించే మార్గం ఇది. "ఇప్పటి వరకూ 17 మంది మృతి చెందినట్టు గుర్తించాం. గాయాలపాలైన 10 మందికి చికిత్స అందిస్తున్నారు" అని పార్లమెంటరీ హెల్త్ సెక్రటరీ సిరాజ్ ఖాసిమ్ వెల్లడించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులున్నారు. "ఈ బస్సులో ప్రయాణిస్తున్న వారంతా వరద బాధితులే. కొద్ది రోజుల క్రితం సురక్షిత ప్రాంతానికి తరలిపోయారు. దాదు జిల్లాలోని తమ సొంత ఊరికి అంతా తిరిగొస్తున్నారు" అని అధికారులు తెలిపారు. అది ఓ ప్రైవేట్ బస్ అని నిర్ధరించారు. బస్సులో మంటలు చెలరేగటానికి కారణమేంటన్నది ఇప్పటికైతే తెలియరాలేదు. అయితే...బస్‌ ముందు భాగంలో ఒక్కసారిగా మంటలు అంటుకుని ఉండొచ్చని...అక్కడి నుంచి వెనక్కి వేగంగా అవి వ్యాపించి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. కొందరు బస్‌ నుంచి బయటకు దూకడం వల్ల ప్రాణాలతో బయట పడ్డారు. సింధ్ ప్రావిన్స్‌లో వరద ధాటికి తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాల్లో దాదు జిల్లా ఒకటి. ఈ M-9 మోటార్‌వేలో తరచూ ఇలాంటి రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ఈ ఏడాది ఆగస్టులో ఓ ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టడం వల్ల 20 మంది చనిపోయారు. అక్కడి రోడ్ ఇన్‌ఫ్రా సరిగా లేకపోవటం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయన్న వాదన వినిపిస్తోంది. 2017లోనూ ఓ ఆయిల్ ట్యాంకర్‌కు మంటలు అంటుకోవటం వల్ల పరిసరాల్లోని 100 మంది మృతి చెందారు. 


వరదల బీభత్సం..


పాకిస్థాన్‌లో వరదలు బీభత్సం సృష్టించాయి. దాదాపు మూడొంతుల దేశం నీట మునిగింది. చరిత్రలోనే ఎప్పుడూ లేనంత స్థాయిలో వరద తాకిడికి విలవిలాడింది దాయాది దేశం. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ పాకిస్థాన్‌ వరదలకు సంబంధించిన ఫోటోలు విడుదల చేసింది. పాక్ ఎంత దారుణ స్థితిలో ఉంది కళ్లకు కట్టాయి ఆ ఫోటోలు. ఈ వరదల కారణంగా...ఆహారం దొరక్క ప్రజలు ఆకలితో అలమటించారు. వ్యవసాయ భూమి అంతా నీట మునిగింది. ఆహార కొరతతో పాటు అనారోగ్యమూ పాక్ ప్రజల్ని పట్టి పీడిస్తోంది. అంటు వ్యాధులు ప్రబలుతున్నాయి. సాధారణ వర్షపాతం కన్నా 10 రెట్లు ఎక్కువగా నమోదవటమే ఈ దుస్థితికి కారణమని వాతావరణ అధికారులు చెబుతున్నారు. ఈ భారీ వర్షపాతం కారణంగా...ఇండస్ నది పొంగిపొర్లుతోంది. కొన్ని కిలోమీటర్ల మేర ఇదో సరస్సులా మారిపోయినట్టు...యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఫోటోల్లో స్పష్టంగా కనిపించింది. మెడికల్ అసిస్టెన్స్ లేకపోవటం వల్ల పాకిస్థాన్‌లో వరదల కారణంగా...జబ్బులు తీవ్రమయ్యే ప్రమాదముందని 
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించింది. దాదాపు 3 కోట్ల 30 లక్షల మందిపై వరదల ప్రభావం పడిందని అధికారులు వెల్లడించారు. దాదాపు 10 లక్షల ఇళ్లు కుప్ప కూలాయి. 5 వేల కిలోమీటర్ల రహదారులు ధ్వంసమయ్యాయి. 


Also Read: Viral Video: ఎంత కొడితే అంత మద్యం- చేతి పంపు మహత్యం! అవాక్కయిన పోలీసులు!