Wipro Q2 Results: బెంగళూరు ప్రధాన కేంద్రంగా పని చేసే ఐటీ కంపెనీ విప్రో లిమిటెడ్ ‍‌(Wipro Ltd) ఆదాయం రెండో త్రైమాసికంలో (సెప్టెంబర్‌ త్రైమాసికం - Q2FY23) పెరిగింది. సప్లై సైడ్ ఒత్తిళ్లు మార్జిన్‌ను కిందకు గుంజినప్పటికీ, డీల్ విన్స్‌ వల్ల అంచనాలను అందుకుంది. 


సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో, ఈ ఐటీ కంపెనీ ఆదాయం 5% QoQ పెరిగి రూ.22,540 కోట్లకు చేరుకుంది. బ్లూంబెర్గ్ ట్రాక్ చేసిన విశ్లేషకుల ఏకాభిప్రాయ అంచనా రూ. 22,615.1 కోట్లతో పోలిస్తే, ట్రాక్‌లోనే ఉంది.


IT సేవల నుండి దాని ఆదాయం మునుపటి త్రైమాసికం కంటే 2.3% పెరిగి 2,797.7 మిలియన్‌ డాలర్లకు చేరుకుంది. 2021 జులై-సెప్టెంబరు కాలంతో పోలిస్తే 8.4 శాతం పెరిగింది. స్థిర కరెన్సీ (CC) ప్రాతిపదికన ఆదాయం 12.9 శాతం (YoY), త్రైమాసిక ప్రాతిపదికన (QoQ) 4.1 శాతం వృద్ధి చెందింది.


ఆర్డర్లలో బలమైన వృద్ధి, బిగ్‌ కాంట్రాక్టులు పెరగడం వల్ల మార్కెట్‌ పోటీలో మెరుగయ్యామని విప్రో మేనేజింగ్‌ డైరెక్టర్‌, CEO థియరీ డెలాపోర్టే రిజల్ట్స్‌ గైడెన్స్‌లో చెప్పారు. మూడు లేదా డిసెంబరు త్రైమాసికంలో ఐటీ సేవల వ్యాపార ఆదాయం 2,811-2,853 మిలియన్‌ డాలర్ల రేంజ్‌లో నమోదయ్యే అవకాశం కంపెనీ అంచనా వేసింది. జులై- సెప్టెంబరులోని ఆదాయంతో పోలిస్తే ఇది 0.5-2 శాతం ఎక్కువ. అంటే, ప్రపంచ స్థాయి సవాళ్లు, ఆర్థిక మాంద్యం భయాలు ఉన్నా తగ్గేది లేదని పరోక్షంగా సంకేతం ఇచ్చింది.


ఆపరేటింగ్‌ రెవెన్యూ
కార్యకలాపాల ద్వారా ఆదాయం కూడా, గతేడాది ఇదే కాలంలోని (YoY) రూ.19,667.40 కోట్ల నుంచి 14.60 శాతం వృద్ధితో రూ.22,539.70 కోట్లకు చేరింది. త్రైమాసిక ప్రాతిపదికన (QoQ) 4.69 శాతం పెరిగింది.


ఆపరేటింగ్‌ మార్జిన్‌
వేతనాల పెంపు, ప్రమోషన్ల  భారం ఉన్నప్పటికీ, ఆపరేటింగ్‌ మార్జిన్‌ 15.1 శాతానికి చేరింది, త్రైమాసిక ప్రాతిపదికన 16 బేసిస్‌ పాయింట్లు పెరిగింది.


అమెరికాయేతర మార్కెట్ల నుంచి ఆదాయం తగ్గింది. ఐరోపా మార్కెట్‌ ఆదాయం రూ.918.60 కోట్ల నుంచి రూ.787.50 కోట్లకు పడిపోగా, ఆసియా పసిఫిక్‌/ మధ్య ప్రాచ్య/ ఆఫ్రికా మార్కెట్ల ఆదాయాలు కూడా రూ.302.80 కోట్ల నుంచి రూ.219.40 కోట్లకు పరిమితమైంది.


తగ్గిన నెట్‌ ప్రాఫిట్‌
ఆదాయ పరంగా అంచనాలను అందుకున్నా, విప్రో నికర లాభం మాత్రం 9.3% తగ్గింది. ఏకీకృత ప్రాతిపదికన రూ.2,659 కోట్ల నికర లాభాన్ని ఈ కంపెనీ ఆర్జించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.2,930.60 కోట్లతో పోలిస్తే లాభం 9.3 శాతం తగ్గింది. సిబ్బంది వ్యయాలు పెరగడం, అమెరికాయేతర మార్కెట్లలలో ఆదాయాలు తగ్గడం ఇందుకు కారణంగా కంపెనీ పేర్కొంది. అయితే ఏప్రిల్‌-జూన్‌లోని (QoQ) రూ.2,563.60 కోట్లతో పోలిస్తే లాభం 3.72 శాతం పెరిగింది. 


ఆర్డర్ల మొత్తం విలువ 23.8 శాతం పెరిగింది. బిగ్‌ కాంట్రాక్ట్స్‌ విలువ 42 శాతం పెరిగింది. మొత్తంగా చూస్తే, 725 మి.డాలర్ల విలువ గల 11 బిగ్‌ కాంట్రాక్టులను విప్రో గెలుచుకుంది.


2022-23 తొలి అర్ధభాగంలో 14,000 మంది ఫ్రెషర్లు ఈ కంపెనీ నియమించుకుంది. వచ్చే త్రైమాసికంలోనూ ఫ్రెషర్ల నియామకాలను కొనసాగిస్తామని మేనేజ్‌మెంట్‌ వెల్లడించింది. సెప్టెంబర్‌ త్రైమాసికంలో నికరంగా 605 మందిని నియమించుకుంది. ఐటీ సేవల విభాగంలో ఉద్యోగుల సంఖ్య జూన్‌ చివరి నాటికి 2,58,574 కాగా, సెప్టెంబరు త్రైమాసికం ముగిసేనాటికి 2,59,179కు చేరింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.