Telangana, AP Weather News: తెలుగు రాష్ట్రాలను వానలు ముంచెత్తుతున్నాయి. కొద్ది రోజులుగా కరవు సీమ అయిన అనంతపురం వరదల్లో చిక్కుకోగా, మిగతా ప్రాంతాల్లో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోని కొన్ని జిల్లాలతో పాటు హైదరాబాద్‌లోనూ బుధవారం (అక్టోబరు 12) రాత్రి వరుణుడు ప్రతాపం చూపాడు. ఈ నెల 15 వరకూ (మరో రెండు రోజులు) తెలుగు రాష్ట్రాల్లో కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాల ప్రభావం ఉంటుందని వాతావరణ అధికారులు అంచనా వేశారు.


ప్రస్తుత వాతావరణ పరిస్థితి
ఉపరితల ద్రోణి ఇంటీరియర్‌ కర్ణాటక నుంచి మరాఠ్వాడా, విదర్భ మీదుగా నైరుతి మధ్యప్రదేశ్‌ వరకు కొనసాగుతోందని వాతావరణ అధికారులు తెలిపారు. దీనికితోడు నైరుతి రుతుపవనాల తిరోగమనం ప్రారంభమైందని చెప్పారు. దీనికి తోడు ప్రస్తుత వాతావరణ పరిస్థితులను బట్టి బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది ఏర్పడితే మరింత బలపడి రాష్ట్రంలో వర్షాలు మరింతగా కురుస్తాయని భావిస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.


గడిచిన 24 గంటల్లో అనంతపురం, అన్నమయ్య, పల్నాడు, చిత్తూరు, సత్యసాయి, అనకాపల్లి, పల్నాడు, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లో భారీవర్షాలు కురిశాయి. ప్రధానంగా అనంతపురం జిల్లాలో ప్రజలు వరదలు ఎదుర్కొన్నారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం కసిపాడులో బుధవారం అత్యధికంగా 12.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. గత 24 గంటల్లోఅనంతపురంలో 6.2, తంబళ్లపల్లెలో 5.7,రాప్తాడు, కూడేరుల్లో 6.4, కె.కోటపాడులో 6.3, కుట్టగుళ్లలో 5.4,  పుంగనూరులో 6.9 సెంటీమీటర్లు, రాజాంలో 5.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది.


Telangana Weather: తెలంగాణలో పరిస్థితి ఇలా..
హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించిన వివరాల మేరకు.. మెదక్, సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, కామారెడ్డి, సిరిసిల్ల వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో ఈ ఉదయం వర్షాలు తేలికపాటి నుంచి ఓ మోస్తరుగా కురిసే అవకాశం ఉంది. 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు. ఈ మేరకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేశారు. 


గత రాత్రి వర్ష బీభత్సం
ఇప్పటికే హైద‌రాబాద్‌లో గత రాత్రి చాలాచోట్ల భారీ వ‌ర్షం కురిసింది. రోడ్లపైకి భారీగా వరద చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల ట్రాఫిక్‌ జామ్‌ అయింది. ఎర్రగడ్డ మెట్రో స్టేషన్‌ కింద భారీగా వరద నీరు చేరింది. దీంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. ఇరువైపులా కిలో మీటర్‌ మేర వాహనాలు ఆగిపోయాయి. బోరబండలో అపార్ట్‌మెంట్‌ సెల్లార్లలోకి వరద నీరు చేరింది. బోరబండలో వరద ప్రవాహంలో ఆటోలు, బైక్ లు కూడా కొట్టుకుపోయాయి. ఇళ్ల ముందు పార్క్‌ చేసిన వాహనాలు కొట్టుకుపోయేలా వరద వచ్చింది. రహమత్ నగర్, బోరబండలోని లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. రసూల్‌పురాలో ఇళ్లలోకి నీరు చేరింది.