Unstoppable Politics :  ఎంటర్‌టెయిన్‌మెంట్ వేరు, రాజకీయం వేరు. రెండు కలిస్తే జరిగే రచ్చ వేరు. అయితే అరుదుగా ఇలాంటి కాంబినేషన్ కుదురుతుంది. ఇప్పుడు అన్‌స్టాపబుల్ పేరుతో బాలకృష్ణ నిర్వహిస్తున్న షోకు గెస్టులుగా చంద్రబాబు, లోకేష్ రావడం.. ఆ షోలో ఏమేమి ఉండబోతున్నాయో టీజర్‌లో చూపించడం హాట్ టాపిక్ అయింది . అందులో ఎంటర్‌టెయిన్‌మెంట్‌కి .. ఎంటర్‌టెయిన్మెంట్ ఉంది. రాజకీయానికి రాజకీయం ఉంది. అదే ఇప్పుడు అందర్నీ ఆకర్షిస్తోంది. ఒక్క షోతో మొత్తం రాజకీయం మారిపోతుందన్న విశ్లేషణలు రావడానికి కారణం అవుతోంది. ఇంతకీ ఆ షోలో ఏమి ఉంటుంది ? ఆ షో రాజకీయాన్ని ఎలా మారుస్తుంది ?


ఎన్టీఆర్‌ను పదవి నుంచి దించేసిన ఘటనపై తొలి సారి మనసు విప్పిన చంద్రబాబు !


తన జీవితంలో తీసుకున్న అతి పెద్ద నిర్ణయం 95 నిర్ణయం అని చంద్రబాబు ఓపెన్‌గా చెప్పారు. అంటే ఎన్టీఆర్‌ను పదవి నుంచి దించేసి తాను ముఖ్యమంత్రి అయిన ఘటన అది. ఆ ఘటన జరిగి 27 ఏళ్లు అయింది. అప్పుడేం జరిగిందో కానీ చంద్రబాబు ఇంకా ఆ విషయంలో నిందలు భరిస్తూనే ఉన్నారు. ఎప్పుడూ ఆ ఘటనపై  ఓపెన్ అవలేదు. కానీ ప్రజలు మాత్రం ఆదరించారు. చంద్రబాబు సీఎం అయిన తర్వాత ఎన్టీఆర్ ప్రజల్లోకి వెళ్లారు. కానీ ప్రజలు పట్టించుకోలేదు. ఎన్టీఆర్ మరణం తర్వాత జరిగిన ఎన్నికల్లో నందమూరి హరికృష్ణతో పాటు లక్ష్మి పార్వతి కూడా ప్రత్యేక పార్టీలతో రంగంలో ఉన్నారు. అయినా ప్రజలు చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీనే ఆదరించారు. ప్రజలు ఆదరించినా ఆయనపై ఇతర పార్టీల నేతలు నిందలు వేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ అవి కొనసాగుతూండటంతో.. కొత్త తరం కోసం అయినా వాటికి చెక్ పెట్టాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. అందుకే అప్పుడు జరిగిన వాటిపై ఓపెన్ అవ్వాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అప్పుడేం  జరిగిందో చంద్రబాబు వివరించారు. ఎన్టీఆర్ కాళ్లు పట్టుకుని బతిమాలానని కూడా చెప్పారు. అంటే... అసలు ఈ ఆగస్టు సంక్షోభంలో అసలు ఇంత కాలం నిందలు మోస్తున్న చంద్రబాబు వెర్షన్ వెలుగులోకి వస్తుందన్నమాట. 


లోకేష్‌పై వచ్చే విమర్శలకూ కౌంటర్ !


తెలుగుదేశం పార్టీ యువనేత లోకేష్ గురించి ప్రత్యర్థి పార్టీల నేతలు ఎవరైనా విమర్శలు చేయాలంటే ముందుగా కొంత మంది అమ్మాయిలతో స్విమ్మింగ్ ఫూల్‌లో ఉన్న ఫోటోలను చూపిస్తారు. లోకేష్‌ను ప్లే బాయ్ అన్నట్లుగా విమర్శలు చేస్తారు. ఇది చాలా కాలంగా ఉంది. ఆయన ఫోటోలు తరచూ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేసి.. ప్రత్యర్థి పార్టీల నేతలు విమర్శలు చేస్తూంటారు.  ఇటీవల చట్టసభల్లో కూడా ఆ ఫోటోల అంశంపై వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు, మంత్రులు విమర్శలు చేయడంతో లోకేష్ ఒక్క సారిగా బ్లాస్ట్ అయ్యారు.   అన్ స్టాపబుల్ సీజన్ 2 మొదటి ఎపిసోడ్‌లో  లోకేష్ కూడా జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా లోకేష్‌ను కూడా బాలకృష్ణ కొన్ని ప్రశ్నలు అడిగారు. ఈ ప్రశ్నల్లో ఒకటి లోకేష్ ఫోటోల గురించి. ఇంట్రస్టింగ్ టాపిక్ లోకేష్ చిల్ అవుతున్న ఫోటో..   మరెవరో అయితే ఎలా స్పందించేవారో కానీ ఎదురుగా ఉన్నది.. అడుగుతున్నది పిల్లనిచ్చిన మామ. ఎదురుగా ఉన్న పరాయి అమ్మాయిలతో కలిసి స్విమ్మింగ్ ఫూల్‌లో ఉన్న ఫోటో. అయినా లోకేష్ పెద్దగా కంగారు పడలేదు.ఇలాంటి ఫోటోల విషయంలో వచ్చే విమర్శలకు సమాధానం చెప్పకుండా సంశయిస్తే వాటినే పదే పదే ప్రచారం చేసే అవకాశం ఉంది. అందుకే లోకేష్ ఏ మాత్రం కంగారు పడకుండా సమాధానం చెప్పినట్లుగా తెలుస్తోంది. తాను కూడా స్టూడెంట్ లైఫ్‌ ను ఎంజాయ్ చేశానని .. అందరి లాంటిదే తన జీవితం అని లోకేష్ తన చేతల ద్వారా వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.  పిల్లనిచ్చిన మామ, తండ్రి ముందే వాటిపై క్లారిటీ ఇవ్వడంతో ఇక విపక్షాలకు వాటిపై మాట్లాడే చాన్స్ లేకుండా పోయినట్లవుతుంది. 


ఈ ఎపిసోడ్‌పై ప్రజల్లో అమితమైన ఆసక్తి !


ప్రోమో విపరీతంగా ఆకట్టుకోవడంతో  పధ్నాలుగో తేదీన  ఓటీటీలో ప్రసారం కానున్న మొదటి ఎపిసోడ్‌పై అందరి దృష్టి పడింది. సామాన్యుల్లో కూడా ఈ ఎపిసోడ్‌పై చర్చ జరుగుతోంది. చంద్రబాబు ఇంతకు ముందు చాలా మందికి ఇంటర్యూలు ఇచ్చి ఉండవచ్చు కానీ ఇలా.. మొదటి సారి ఓపెన్ అయ్యారని.. ఏం చెబుతారోనన్న ఆసక్తి అందరిలో ఏర్పడింది. అందుకే ప్రోమో కూడా ట్రెండింగ్‌లో ఉంది. ఇదేదో తేడాగా ఉందనుకున్నారేమో కానీ వైఎస్ఆర్‌సీపీ నేతలు కూడా విమర్శలు ప్రారంభించారు. ఆ షోను తక్కువ చేసి చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ వారు అలా రెస్పాండ్ అవడం వల్ల మరంత హైప్ వస్తోంది. ఇది ఒకందుకు మంచిదేనని టీడీపీ నేతలు చెబుతున్నారు. 


ఒక్క ఎపిసోడ్‌తో చంద్రబాబు, బాలకృష్ణ , లోకేష్ టీడీపీలో జోష్ తీసుకొస్తారా ?


ముగ్గురూ రాజకీయాల్లో ఉన్నారు. రాజకీయంగా తమ పార్టీకి మేలు జరిగేలా..  మొత్తం ప్రజల ముందు పెట్టేలా ఈ ఎపిసోడ్‌ను నిర్వహించి ఉంటారు. వారు అనుకున్న టార్గెట్ రీచ్ అయితే.. టీడీపీకి మేలు జరుగుతుంది. ఇప్పటి వరకూ అయితే వారనుకున్న ఎఫెక్ట్ వచ్చినట్లయింది. రాజకీయంగా గేమ్ ఛేంజర్ అవుతుందనుకుంటే వైఎస్ఆర్‌సీపీ ఊరుకోదుగా.. అంతకు మించిన విమర్శలు ప్రారంభిస్తుంది. అందుకే ... అన్ స్టాపబుల్ రాజకీయం షురూ అనుకోవచ్చు !