TS Congress :   ఓ వైపు ఆర్థిక అధికార బలంతో పొటీ పడుతున్న రెండు పార్టీల మధ్య మునుగోడులో నలిగిపోతున్న కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు మరో సవాల్ ఎదురైంది. అదే రాహుల్ గాంధీ జోడో యాత్ర. ఖచ్చితంగా మునుగోడు ఉపఎన్నికల సమయంలోనే రాహుల్ యాత్ర తెలంగాణలో అడుగు పెడుతోంది. దీంతో అటు ఎన్నికలను సమన్వయం చేసుకోవాలా.. రాహుల్ గాంధీ యాత్రపై దృష్టి పెట్టాలా అన్నది పెను సవాల్‌గా మారింది. సీనియర్ల సహాయ నిరాకరణతో అన్ని బాధ్యతలూ రేవంత్ రెడ్డి మీదే పడుతున్నాయి. ఇప్పుడు ఈ రెండు సవాళ్లను ఆయన ఎదుర్కోవాల్సి ఉంది. ఏ మాత్రం తేడా వచ్చినా ఆయనపై ఎటాక్ చేయడానికి సొంత పార్టీ వాళ్లే ఆయుధాలతో రెడీగా ఉన్నారు మరి !


23న తెలంగాణలోకి భారత్ జోడో యాత్ర ఎంట్రీ !


రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలోకి అడుగు పెట్టే ముహుర్తం ఖరారయింది.  అక్టోబర్ 23న రాష్ట్రంలోకి రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రవేశిస్తుందని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిగం ఠాగూర్ ప్రకటించారు.  మక్తల్  నియోజకవర్గం కృష్ణా మండలం, కృష్ణా గ్రామం వద్ద తెలంగాణలోకి భారత్ జోడో యాత్ర ప్రవేశించనుంది. 14 రోజుల పాటు  కొనసాగుతుంది.  షెడ్యూల్ ప్రకారం ఈ నెల 24న మక్తల్ దగ్గర రాహుల్ పాదయాత్ర తెలంగాణలోకి ప్రవేశించాలి. అయితే మార్చిన షెడ్యూల్ ప్రకారం 23వ తేదీనే మక్తల్ సమీపంలోని కృష్ణా బ్రిడ్జి వద్ద రాహుల్ పాదయాత్ర తెలంగాణలోకి ఎంటర్ కానున్నది. అనంతరం రెండు రోజుల పాటు యాత్రకు విశ్రాంతి ఇవ్వనున్నారు.  ఈ నెల 23న తెలంగాణలోకి రాహుల్ యాత్ర ఎంటర్ అయినా.. ఆ తర్వాత 26 నుంచి మాత్రమే కొనసాగనున్నది. ఇప్పటికే దీనికి సంబంధించిన పూర్తి రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. 
 
రేవంత్‌కు డబుల్ టాస్క్ !


తెలంగాణ కాంగ్రెస్ నేతలకు డబుల్ టాస్క్ అయిపోయింది. ఓ వైపు మునుగోడు ఉపఎన్నిక. మరో వైపు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర. కాంగ్రెస్ పార్టీకి చుక్కలు చూపించడానికే ఇలా ఉపఎన్నికలు పెట్టారేమో అన్నట్లుగా మునుగోడు ఉపఎన్నిక కీలక దశలో ఉన్నప్పుడు రాహుల్ తెలగాణలోకి ఎంట్రీ ఇస్తున్నారు. దాదాపుగా పదిహేను రోజుల పాటు సాగే ఆయన పాదయాత్ర అయిపోయే సరికి మునుగోడులో ఎన్నికల ప్రక్రియ ముగిసిపోతుంది. నేతలంతా రాహుల్ గాంధీ టూర్‌లో బీజీగా ఉంటారు. మరి మునుగోడులో ఎన్నికల ప్రక్రియను ఎవరు చూస్తారు ?. ఒక వేళ కీలక దశలో మునుగోడులో కాంగ్రెస్ కీలక నేతలు లేకపోతే చేతులెత్తేసినట్లు అవుతుంది. అలాగని ..రాహుల్ యాత్రకు వెళ్లకుండా ఉండలేరు. 


రాహుల్ దృష్టిలో పడేందుకు నేతల ప్రయత్నాలు కామన్ ! 


తెలంగాణ కాంగ్రెస్ నేతలందరూ ఎవరికి వారు రాహుల్ దృష్టిలో పడేందుకు .. ప్రయత్నిస్తారు. దీంతో మునుగోడులోనే ఉండి పార్టీని చూసుకొమ్మంటే ఒక్కరు కూడా ఉండరు.  టీ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పాదయాత్రను సమన్వయం చేసుకోవాలి. పెద్ద ఎత్తున జన సమీకరణ చేసుకోవాలి. ఈ పనుల్లో ఉంటూనే మునుగోడులో ప్రచారం చేస్తున్నారు. ఇక ముందు ఆ అవకాశం ఉండదు. అసలే మునుగోడులో టీఆర్ఎస్, బీజేపీ .. యుద్ధం చేసుకుంటున్నట్లుగా వ్యవహరిస్తున్నాయి.  కాంగ్రెస్ పార్టీ రేసులో లేదని చెప్పడానికి ఆ రెండు పార్టీలు కుట్ర చేస్తున్నాయని రేవంత్ ఆరోపిస్తున్నారు. కనీసం అలా కాదు.. తాము రేసులో ఉన్నామని చెప్పుకోవడానికైనా కాంగ్రెస్ పార్టీ..  మునుగోడులో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది. ఈ విషయంలో రేవంత్ రెడ్డికి డబుల్ టాస్క్ అయినట్లుగా ఉంది. ఈ సవాల్‌ను అయన అధిగమించాల్సి ఉంది. 


సీనియర్ల సహాయనిరాకరణ ! 


కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు పని చేస్తున్నారో లేదో అన్న రీతిలో ఆ పార్టీ వ్యవహారాలు ఉన్నాయి. స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కనీసం భారత్  జోడో యాత్రలో కూడా పాలు పంచుకోవడానికి సిద్ధంగా లేరు. ఆయన ఎందుకొచ్చిన వివాదం అనుకున్నారేమో కానీ విదేశీ పర్యటనకు వెళ్లిపోతున్నారు. ఇతర సీనియర్లు ఉన్నా ఎక్కడా యాక్టివ్‌ాగ కనిపించడం లేదు. 


రాహుల్ పాదయాత్ర జోష్‌ను..మునుగోడులో పక్కాగా ఉపయోగించుకునేలా ప్రణాళికలు రూపొందించుకుంటే... రెండింటిని సమస్వయం చేసుకున్నట్లవుతుంది. అదే జరిగితే ఈ సవాల్‌ను సరిగ్గా ఉపయోగించుకున్నట్లవుతుంది. మరి అలాంటి టాస్క్‌ను కాంగ్రెస్ పార్టీ వినియోగించుకోగలదా అనేదే ప్రశ్న