గుంటూరు జిల్లా పొన్నూరులో అధిపత్య పోరుకు వైఎస్‌ఆర్‌సీపీ చెక్ పెట్టింది. ఎమ్మెల్యే కిలారి రోశయ్యకు కంటగింపుగా మారిన రావి వెంకటరమణను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఇది గుంటూరుజిల్లాలో సంచలనంగా మారింది.
గుంటూరుజిల్లా పొన్నూరులో కిలారి, రావి వర్గీయు మధ్య ఎప్పటి నుంచో వైరం నడుస్తోంది. అయితే ఈ మధ్య జరిగిన ఓ సంఘటన ఈ వైరాన్ని తీవ్ర స్థాయికి తీసుకెళ్లిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల పెదకాకాని మండలం పార్టీ అధ్యక్షుడు పూర్ణ పై దాడి జరిగింది. ఈ దాడికి పాల్పడింది, ఎమ్మెల్యే కిలారి రోశయ్య వర్గం అని ఆరోపిస్తున్నారు రావి వెంకటరమణ వర్గం. పూర్ణ రావి వెంకటరమణ వర్గం కావటంతోనే దాడి జరిగిందని చెబుతున్నారు. దీంతొ నిందితులను అరెస్టు చేయాలని పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. అంతే కాకుండా రావి వెంకటరమణ వర్గం నిరసనకు పిలుపునిచ్చింది. దాడికి గురయిన పూర్ణకు న్యాయం చేయాలంటూ పెద్దకాకాని సెంటర్ లో ఆందోళను చేపట్టింది. సొంత పార్టి నేతలపైనే దాడి జరిగితే పట్టించుకోరా అంటూ ఫ్లెక్సీలు పెట్టారు. ఇదే ఇప్పుడు అధిష్ఠానం ఆగ్రహానికి కారణమైనట్టు తెలుస్తోంది.
ఆది నుంచి వర్గపోరే
పొన్నూరు నియోజకవర్గంలో వైసీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు మొదటి నుంచి కంటిన్యూ అవుతుంది. ఈ విషయం పార్టీలోని పెద్దలకు కూడా తెలుసు. పార్టీ ఏర్పాటు అయిన నాటి నుంచి రావి వెంకటరమణ జగన్‌తో పాటే ఉంటూ పార్టీని నియోజకవర్గంలో బలోపేతం చేశారు. 2019 ఎన్నికల టైంలో పీకే సర్వే ఆధారంగా పొన్నూరు సీట్ రావి వెంకటరమణకు రాలేదు. రావి వెంకటరమణను పక్కన పెట్టి కిలారి రోశయ్యను తీసుకొచ్చారు. సీటు రాని రావి వెంకటరమణకు తగిన ప్రాధాన్యత ఇస్తామని అప్పట్లోనే జగన్ హామీ ఇచ్చారని ఆయన వర్గీయులు చెప్పేవాళ్లు.
రోశయ్య గెలుపుతో మొత్తం పరిస్థితి మారిపోయింది. రావి వర్గం పార్టీని అంటిపెట్టుకొని ఉన్నప్పటికి ప్రాధాన్యత కల్పించలేదు. ఎమ్మెల్యే కిలారికి ప్రయార్టీ పెరిగిపోవడంతో రావి వర్గం అసంతృప్తిగా ఉంది. దీంతో సమయం వచ్చినప్పుడల్లా ఎమ్మెల్యే కిలారికి అడ్డుపడటంతోపాటుగా, నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా వర్గాన్ని ప్రోత్సహించారని ప్రచారంలో ఉంది.
దీనిపై ఎమ్మెల్యే కిలారి వర్గం ఆధారాలతో అధిష్ఠానానికి ఫిర్యాదు చేసింది. రావిని అధిష్ఠానం పిలిచి నచ్చచెప్పేందుకు ప్రయత్నించింది. అయినా పరిస్థితిలో మార్పు రాలేదు. అప్పటి నుంచి ఎమ్మెల్యే వర్గం ఎదురు దాడి ప్రారంభించింది. రావి వర్గంపై ప్రత్యక్ష్యంగా,పరోక్షంగా దాడులు ఆరంభం అయ్యాయయని అంటున్నారు.
మట్టి మాఫియా నడుపుతున్నారని ఎమ్మెల్యే కిలారిని టీడీపీ నేత ధూళిపాళ్ళ నరేంద్ర టార్గెట్ చేసుకోవడంలో రావి వెంకటరమణ పాత్ర ఉందని లోకల్‌గా టాక్ వినిపిస్తోంది. దీనిపై ఎమ్మెల్యే టీం పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేసింది. వీటన్నంటికి తోడు పార్టీలో కీలకంగా ఉండే ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడ కిలారి రోశయ్యకు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారని పార్టీలో చర్చ. అప్పట్లో అదే లాబీయింగ్‌తో కిలారీ సీట్ దక్కించుకున్నారని అందరూ అనుకున్నారు. ఇప్పుడు కూడా అదే సపోర్ట్ తో కిలారి పార్టీలో చక్రం తిప్పారని ప్రచారం. అందుకే రావిని పార్టీ నుంచి తప్పించారని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు.