మూడేళ్లుగా పెండింగ్ ఉన్న డీఏలు, రెండు కొత్త డీఏలు, పీఆర్సీ ఎరియర్స్ తక్షణమే చెల్లించాలని ఏపీ సీఎస్‌ను కలిసి అమ‌రావ‌తి జేఎసి నేత‌లు విజ్ఞ‌ప్తి చేశారు. కనీసం జీతాలు, పెన్షన్లు కూడా ప్రతి నెల సకాలంలో ఇచ్చే పరిస్థితి లేదని త‌మ ఆవేద‌న‌ సీఎస్ ముందు వ్య‌క్తం చేశారు. ఏపీ జేఏసీ అమరావతి పక్షాన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు రావాల్సిన పాత మూడు డీఏలు ఉత్తర్వులు ఇచ్చినా నేటికీ చెల్లించలేదన్నారు. కొత్తగా 2022 జనవరి, ఏప్రిల్ డీఏలపై నేటికీ ఉత్తర్వులు ఇవ్వకపోవడాన్ని తప్పుపట్టారు.


పీఆర్సీ ఎరియర్స్‌ ఇప్పటికీ చెల్లించకపోవడం వలన ఉద్యోగులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, కనీసం జీతాలు, పెన్షన్లు కూడా ప్రతి నెల సకాలంలో ఇచ్చే పరిస్థితి లేనందున, త‌మ డిమాండ్‌లపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాల నాయకులు కోరారు. 2017 జులై, 2019 జులై మధ్య కాలంలో రావాల్సిన రెండు డీఏలు చెల్లించాలని జీవో విడుదల చేసినా నేటికీ చెల్లించలేదని గుర్తు చేశారు. ప్రభుత్వం చెల్లించక పోగా 2020-21, 2021-22 రెండేళ్లలో వరుసగా ఐటీ వసూలు చేయడం బాధాకరమన్నారు. కాబట్టి దాదాపు రెండేళ్ల క్రితం ఇచ్చిన జీవోలు తక్షణమే అమలు చేసి సీపీఎస్‌ పెన్షనర్లకు క్యాష్ చెల్లించాలని, ఓపీఎస్‌ ఉద్యోగులకు జీపీఎఫ్‌ అకౌంట్లకు జమ చేయాలన్నారు. 


2019 నాటి డీఏ ఎరియర్స్‌ జీవో 99ను గత డిసెంబర్‌ 20న విడుదల చేసి 21 జనవరి 2022న రద్దు చేశారని గుర్తు చేశారు. ఎందుకు రద్దు చేశారో కూడా తెలియదన్నారు. కనుక తక్షణమే రివైజ్డ్‌జీవో ఇచ్చి చెల్లించాలని కోరారు. 2022 జనవరి డీఏ, జులై డీఏలు కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మంజూరు చేసిందని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఈ రెండు డీఏలు చెల్లించాలన్నారు.


2020 ఏప్రిల్‌ నుంచి డిసెంబర్ 2021 వరకు పెండింగ్ ఉన్న పీఆర్సీ ఎరియర్స్‌ను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వెంటనే చెల్లించాలన్నారు. రిటైర్డ్ ఎంప్లాయీస్‌కు ఏప్రిల్‌ 2020 నుంచి డిసెంబల్‌ 2021 వరకు ఎన్కాష్మెంట్ ఎరన్డ్ లీవ్, డిఫరెన్స్ అమౌంట్ వెంటనే చెల్లించాలని పేర్కొన్నారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ ఈఈఎల్‌ కోసం అప్లై చేస్తే జనవరి 2022 నుంచి మాత్రమే క్యాష్ చెల్లించమని ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు అధికారులు తెలియచేస్తున్నారు. కానీ ప్రభుత్వం ఇచ్చిన జీవోలో మానిటరీ బెనిఫిట్ తేదీ ఏప్రిల్‌ 2020 నుంచి వర్తిస్తుందని స్పష్టంగా ఉన్నప్పటికీ నేటికీ చెల్లించక పోవడం బాధాకరమైన విషయమన్నారు. కనుక ఎన్కాష్మెంట్ ఎరన్డ్ లీవ్ (EEL) డిఫరెన్స్ అమౌంట్ ను పెన్షనర్లకు  వెంటనే చెల్లించాలన్నారు.


11వ పీఆర్సీ రికమండేషన్ ప్రకారం ఆయా కేడర్‌ల స్కేల్స్‌ను ఆనవాయితీ ప్రకారం అన్ని శాఖలకు వెంటనే పంపించాలి. ఇదే విషయన్ని అనేక సమావేశాల్లో మంత్రుల కమిటీ సమావేశంలో కూడా తెలియ చేసినప్పటికీ నేటికీ స్కేల్స్ పంపలేదు. తక్షణమే అన్నీ శాఖలకు కేడర్‌ వారీగా స్కేల్స్ పంపాలన్నారు. పీఆర్సీలో అనేక శాఖలకు సంబంధించిన అలవెన్సులపై నేటికీ ఎలాంటి ఉత్తర్వులు మంజూరు చేయనందున రాష్ట్రంలోని అలవెన్సులు పొందే ఉద్యోగులు అవి కోల్పోయే పరిస్థితులు వచ్చాయన్నారు. 


ఏపీ జేఏసీ అమరావతి అభ్యర్థనపై సీఎస్‌ సానుకూలంగా స్పందించారని ప్రత్యేకంగా నోట్ పెట్టి ఆర్థిక శాఖ అధికారులకు పంపి వీలైనంత త్వరలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇప్పటి వరకూ చాలా ఓపికతో ఉన్నామని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడినందున, జీత భత్యల‌్లో భాగమైన పెండింగ్ సమస్యలపై తక్షణమే ప్రభుత్వం పరిష్కరించాలని నాయ‌కులు కోరారు.