Pakistan Blocked Wikipedia:


దైవదూషణపై ఆగ్రహం..


పాకిస్థాన్ ప్రభుత్వం వికీపీడియాను బ్యాన్ చేసింది. పాకిస్థాన్ మీడియా రిపోర్ట్‌ల ప్రకారం...ఆ దేశ టెలికామ్ అథారిటీ వికీపీడియాపై నిషేధం విధించింది. దైవదూషణకు సంబంధించిన కంటెంట్‌ను తొలగించడం లేదన్న కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. 48 గంటల్లోగా ఆ కంటెంట్‌ను తొలగించాలని వికీపీడియాకు అల్టిమేటం జారీ చేసింది. అయితే...ఇంత వరకూ వికీపీడియా దీనిపై స్పందించలేదు. అధికారులతోనూ ఎలాంటి సంప్రదింపులు జరపలేదని సమాచారం. ప్రభుత్వం ప్రతిపాదించిన కంటెంట్‌ను తొలగిస్తే తప్ప రీస్టోర్ చేసేదే లేదని స్పష్టం చేసింది. Censorship of Wikipedia పేరిట పాక్ మీడియాలో వార్తలు సర్య్కులేట్ అవుతున్నాయి. కేవలం పాక్‌లోనే కాదు. వికీపిడియాపై ఇతర దేశాల్లోనూ ఫిర్యాదులు ఉన్నాయంటూ పలు ఆర్టికల్స్ వెల్లడించాయి. చైనా, ఇరాన్, మయన్మార్, రష్యా, సౌదీ అరేబియా, సిరియా, తునీషియా, టర్కీ, ఉజ్బెకిస్థాన్, వెనెజులాలోనూ వికీపీడియాపై ఆంక్షలు విధించారు. ఈ నిర్ణయాన్ని కొందరు సమర్థిస్తున్నా...మరి కొందరు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. డిజిటల్ రైట్స్  యాక్టివిస్ట్ ఉసామా ఖిల్జీ అసంతృప్తి వ్యక్తం చేశారు. "ఈ నిర్ణయం రాజ్యాంగ వ్యతిరేకం" అని తేల్చి చెప్పారు. ఈ సెన్సార్‌షిప్ కారణంగా పాక్‌లోని విద్యార్థులతో పాటు రీసెర్చ్‌లు, హెల్త్ సెక్టార్‌పైనా ప్రభావం పడుతుందని అన్నారు. పాకిస్థాన్‌లో దైవదూషణ చేసిన వారికి కఠినమైన శిక్షలు విధిస్తారు. 1860లోనే బ్రిటీష్‌ ఇందుకు సంబంధించిన ఓ చట్టాన్ని రూపొందించింది. కేవలం మతపరమైన ఘర్షణలను తగ్గించేందుకు ఈ చట్టం తెచ్చారు. ఇటీవలే ఈ చట్టాన్ని మరింత కఠినతరం చేసింది పాకిస్థాన్. ఇస్లాం మతాన్ని కించపరిస్తే...అంతకు ముందు మూడేళ్ల జైలుశిక్ష విధించేవారు. ఇప్పుడు పాక్‌ ఆ శిక్షను పదేళ్లకు పెంచింది. 


దారుణమైన స్థితిలో పాక్..


పాకిస్థాన్‌ దారుణమైన స్థితిలో ఉంది. ఓ పూట తిండికీ అక్కడి ప్రజలు అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా చమురు విషయంలో సవాళ్లు ఎదుర్కొంటోంది. ప్రభుత్వాన్ని ఇప్పటికే ఆయిల్ కంపెనీలు అలెర్ట్ చేశాయి. ఆయిల్ ఇండస్ట్రీ పతనమయ్యే దశలో ఉందని తేల్చి చెప్పాయి. ఫారెక్స్ నిల్వలు లేకపోవడం, రోజురోజుకీ పాకిస్థాన్ కరెన్సీ విలువ పడిపోతుండటం వల్ల సంక్షోభం తప్పేలా లేదని వివరించాయి. మరి కొద్ది రోజుల్లో ఆయిల్ ఇండస్ట్రీ పూర్తిగా కుప్ప కూలిపోతుందని వెల్లడించాయి. ఇప్పటికే దేశంలోని పరిస్థితులు చేసి షెహబాజ్ సర్కార్ చేతులె త్తేసింది. ఏం చేయాలో పాలు పోక తలలు పట్టుకుంటోంది. ఉన్న అప్పులు తీర్చలేక..కొత్త అప్పులు పుట్టక నానా అవస్థలు పడుతోంది. IMF ఆదుకుంటుంది అనుకుంటే..అది కూడా జరిగేలా కనిపించడం లేదు. వీటికి తోడు చమురు రంగం పూర్తిగా పతనం అవుతుండటం మరింత కలవర పెడుతోంది. స్థానిక కరెన్సీ విలువ దారుణంగా పడిపోవటం వల్ల బిలియన్‌ల కొద్ది ఆర్థిక నష్టం వాటిల్లింది. ఫారెక్స్ నిల్వలు అడుగంటుతున్నాయి. ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలంటూ IMFని అర్థిస్తోంది పాకిస్థాన్. కానీ...IMF మాత్రం చాలా విషయాల్లో ఆచితూచి వ్యవహరిస్తోంది. 7 బిలియన్ డాలర్ల రుణం అందించేందుకు సిద్ధంగానే ఉన్నా...అందుకు తగ్గ అర్హతలన్నీ పాక్‌కు ఉన్నాయా లేదా అని సమీక్షిస్తోంది.  ఈ లోన్ ఇచ్చేందుకు ఇప్పటికే 8 సార్లు పాక్‌కు వచ్చిన IMF బృందం...ఇప్పుడు తొమ్మిదో సారీ సమీక్ష జరుపుతోంది.  దీనిపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్పందించారు. ఆర్థిక మంత్రి ఇషాక్ దర్‌కు IMFని ఎదుర్కోటం చాలా కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది తమకు గడ్డు కాలం అంటూ వ్యాఖ్యానించారు. 


Also Read: Karnataka Elections: మరోసారి గెలిచేది బీజేపీనే, మా విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరు - యడియూరప్ప