Karnataka Elections:
మాదే విజయం: యడియూరప్ప
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి బీజేపీయే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని అన్నారు. బెంగళూరులో స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్‌లో మాట్లాడిన యడియూరప్ప...ఎన్నికల్లో బీజేపీకి 130-140 సీట్లు వస్తే తప్పకుండా మళ్లీ అధికారంలోకి వస్తుందని చెప్పారు. ఇప్పటికే కాంగ్రెస్‌లో ఎన్నికల టెన్షన్ మొదలైందని అని సెటైర్లు వేశారు. కర్ణాటక ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ను నియమించడంపైనా స్పందించారు యడియూరప్ప. ఈ నిర్ణయంతో బీజేపీకి కలిసొస్తుందని స్పష్టం చేశారు. కో ఇంఛార్జ్‌గా తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె అన్నమలైను నియమించింది అధిష్ఠానం. అన్నమలైపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు సీనియర్ నేతలు. ఈ ఇద్దరి నేతృత్వంలో కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ తప్పకుండా విజయం సాధిస్తుందని బలంగా నమ్ముతున్నారు. ఈ ఏడాది మే నెలలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. త్వరలోనే ఎన్నికల సంఘం దీనిపై పూర్తి వివరాలు ప్రకటించనుంది. 2018 మేలో జరిగిన ఎన్నికల్లో జనతాదళ్ సెక్యులర్ (JDS),కాంగ్రెస్ భారీ మెజార్టీతో గెలిచాయి. జేడీఎస్ లీడర్ కుమారస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే..2019లో ఈ సంకీర్ణ ప్రభుత్వం కుప్ప కూలింది. బీజేపీ అధికారంలోకి వచ్చింది. యడియూరప్ప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. తరవాత కొన్ని కారణాల వల్ల ఆయన ఆ పదవి నుంచి తప్పుకోగా...బసవరాజ్ బొమ్మై సీఎం అయ్యారు.
ట్రెండ్ మారుతుందా..?
కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై కర్ణాటకలోనూ గుజరాత్ ఫలితాలు రిపీట్ అవుతాయని చాలా ధీమాగా చెబుతున్నారు. కానీ...హిమాచల్‌లో జైరామ్ ఠాకూర్‌ను ప్రజలు ఎలాగైతే పక్కన పెట్టారో..అలాగే బొమ్మై సర్కార్‌ను కూడా పక్కన పెట్టే అవకాశాలు లేకపోలేదు. ఓ సారి కర్ణాటక ఎన్నికల ఫలితాల ట్రెండ్‌ని గమనిస్తే...2004 నుంచి అక్కడి ఓటర్లు ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజార్టీ ఇవ్వలేదు. 2008లో బీఎస్ యడియూరప్ప నేతృత్వంలోని బీజేపీ 110 స్థానాలు గెలుచుకుంది. ఆ తరవాత..."ఆపరేషన్ లోటస్" మొదలు పెట్టి ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను తనవైపు లాక్కుంది. మ్యాజిక్ ఫిగర్ సాధించుకుంది. ఆ తరవాత 2013లో మాత్రం బీజేపీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆ ఎన్నికల్లో 40 సీట్లకే పరిమితమైంది కాషాయ పార్టీ. ఓటు షేర్ కూడా దారుణంగా పడిపోయింది. కాంగ్రెస్ 122స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2018లో మళ్లీ సీన్ మారింది. కాంగ్రెస్‌ను కాదనుకుని ఓటర్లు బీజేపీకి ఓటు వేశారు. కాంగ్రెస్ 80 స్థానాలకు
పరిమితం కాగా...బీజేపీ 104 చోట్ల గెలుపొందింది. కాంగ్రెస్ జేడీఎస్ కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిప్పటికీ...ఆపరేషన్ లోటస్ ధాటికి ఎక్కువ కాలం నిలబడలేకపోయింది. కాంగ్రెస్, జేడీఎస్ కూటమికి చెందిన 17 మంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చి బీజేపీలో చేరారు. ఫలితంగా...బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. ఈ ట్రెండ్ కొనసాగితే...ఈ సారి ఓటర్లు కాంగ్రెస్‌కు అవకాశమిస్తారేమో అన్న అంచనాలున్నాయి.
Also Read: CM Yogi Adityanath: ఇండియా ఇప్పటికీ సెక్యులర్ దేశమే, సనాతన ధర్మాన్ని గౌరవించండి - యోగి ఆదిత్యనాథ్