Sri Lanka Crisis: 


75వ స్వాతంత్య్ర దినోత్సవం..


శ్రీలంక సంక్షోభంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగింది. ఇంకా జరుగుతూనే ఉంది. చేజేతులా దేశాన్ని సంక్షోభంలోకి నెట్టుకున్నారు పాలకులు. గొటబయ రాజపక్స పాలనలో ఆ దేశం అన్ని రంగాల్లోనూ కుదేలైపోయింది. ఆర్థికంగా కుప్పు కూలిపోయింది. ఆ తరవాత  నాటకీయ పరిణామాల మధ్య అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే బాధ్యతలు తీసుకున్నారు. ఆ తరవాత కూడా పరిస్థితుల్లో ఏ మార్పూ రాలేదు. విక్రమసింఘేపైనా ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆ పదవి నుంచి తప్పుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.  శ్రీలంక 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే సంచలన వ్యాఖ్యలు చేశారు. చేసిన తప్పులు సరిదిద్దుకుని, మళ్లీ బలమైన దేశంగా నిలబడాల్సిన అవసరముందని అన్నారు. మునుపెన్నడూ లేని విధంగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయామని, గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నామని చెప్పారు. ఈ వేడుకలకు పలు దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. భారత్ తరపున విదేశీ వ్యవహారాల ప్రతినిధి వి మురళీధరన్ వెళ్లారు. ఈ వేడుకలపైనా ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకోసం  ప్రభుత్వం 20 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని, ఇలాంటి కష్టకాలంలో ఇంత ఖర్చు పెట్టడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. విక్రమసింఘే మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా స్వాతంత్ర్య దినోత్సవాలు జరిపారు. 


"మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లైంది. ఇలాంటి సమయంలో దేశానికి ఆర్థిక సవాళ్లు ఎదురవుతున్నాయి. ఏదేమైనా మరోసారి మనల్ని మనం రివ్యూ చేసుకోవాలి. మన బలాలేంటో గుర్తించాలి. తప్పుల్ని సరిదిద్దుకోవాలి" 


- రణిల్ విక్రమసింఘే, శ్రీలంక అధ్యక్షుడు


కొలంబో హోటల్‌లో 2019 ఈస్టర్ ఆదివారం బాంబు పేలుళ్లతో శ్రీలంక రాజపక్స కుటుంబ ప్రజాదరణ పతనమవ్వడం మొదలైంది. ఈ తీవ్రవాద దాడిలో వందలాది మంది మరణించారు.  మరెంతో మంది వికలాంగులుగా మారారు. దీనికి తోడు కొవిడ్‌ మొదలైంది. మొత్తంగా విదేశీ మారక ద్రవ్య నిల్వలకు కీలకమైన శ్రీలంక పర్యాటక రంగం దెబ్బతింది. ఉద్యోగాలు పోవడం దెబ్బ మీద దెబ్బగా మారింది. ఇదే సమయంలో రాజపక్స ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం లంకను నాశనం చేసింది. సేంద్రియ ఆహార ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయాలన్న ఉద్దేశంతో రసాయనాలు, పురుగు మందులను నిషేధించింది. ఆరు నెలల్లో ధాన్యం ఉత్పత్తి దాదాపు 43% తగ్గింది. విదేశీ ఎగుమతుల ఆర్జన 15% తగ్గింది. హడావుడిగా ఈ పాలసీ రద్దు చేసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.





పర్యాటకం తిరోగమనం, కోవిడ్-19, ఎరువుల నిషేధం శ్రీలంక విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గిపోయాయి.  ఇంధనం నుంచి బియ్యం వరకు దిగుమతి చేసుకొనేందుకు డాలర్లు కరవయ్యాయి. ఒకప్పుడు శ్రీలంక తలసరి ఆదాయం భారత్‌ కన్నా ఎక్కువుండేది. ప్రభుత్వ నిర్ణయాలతో ఇదంతా నాశనమైంది. ఈ ద్వీప దేశం నాలుగు దశాబ్దాలలోనే ఘోరమైన ఆర్థిక సంక్షోభానికి గురైంది. విద్యుత్‌ కోతలతో కొలంబోలోని ఆసుపత్రులల్లో శస్త్ర చికిత్సలను వాయిదా వేయాల్సి వచ్చింది.ప్రజలు తమ దుస్థితికి రాజపక్సే కుటుంబాన్ని నిందించారు. కొలంబోలో నిరసనలు పూర్తి స్థాయి తిరుగుబాటుగా మారాయి. ఆగ్రహాన్ని చల్లార్చేందుకు ప్రధాని మహింద రాజపక్సే రాజీనామా చేసినా ఫలితం లేకుండా పోయింది. ప్రజలు గుంపులుగా చేరి అధికార పార్టీ శాసనసభ్యులపై దాడి చేశారు. అధ్యక్ష భవనానికి నిప్పు పెట్టారు. గోటాబయ రాజపక్సే తన బద్ధ శత్రువైన రణిల్ విక్రమసింఘేకు పగ్గాలు అప్పగించి నౌకలో దేశం విడిచి పారిపోయారు. అయినప్పటికీ ప్రజలు శాంతించలేదు. ప్రస్తుత పాలక వర్గం విక్రమసింఘేతో ఒప్పందాలు కుదుర్చుకుందని వ్యతిరేకిస్తున్నారు.