తెలంగాణ అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌, ఎంఐఎం మధ్య తీవ్ర వాగ్వాదం నడిచింది. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంలో మంత్రులతో అక్బరుద్దీన్ ఓవైసీతో టాక్‌వార్ నడిచింది. సభలో మొదటి మాట్లాడిన అక్బరుద్దీన్‌ ఒవైసీ... ప్రభుత్వం తీరుపై విమర్సలు చేశారు. 
గవర్నర్ ప్రసంగంలో చాలా అంశాలను ప్రస్తావించలేదన్నారు అక్బరుద్దీన్. అది కావాలనే చేశారా లేకుంటే గవర్నర్ తొలగించారా అని ప్రశ్నించారు. ఇదంతా ఉద్దేశపూర్వకంగానే చేసినట్టు కనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. అసలు గవర్నర్ ప్రసంగానికి మంత్రివర్గం ఆమోదించిందా లేదా అని ప్రశ్నించారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన మంత్రి ప్రశాంత్‌రెడ్డి సబ్జెక్ట్ మాట్లాడాలని హితవు పలికారు. 


గవర్నర్‌తో రాష్ట్ర ప్రభుత్వం రిలేషన్ బాగుంటే మంచిదే అన్నారు అక్బరుద్దీన్‌ కానీ తెలంగాణకు కేంద్రం చేస్తున్న అన్యాయమన్ని మాత్రం ప్రశ్నించకపోవడమేంటని నిలదీశారు. కేంద్రం నుంచి వచ్చే నిధులు అంశాన్ని సభలో ప్రస్తావించకుండా  బయట మాట్లాడితే ప్రయోజనం ఏంటని అభిప్రాయపడ్డారు. బయట సీఎం కేసీఆర్ చెప్పే అంశాలేవీ కూడా గవర్నర్ ప్రసంగంలో ఎందుకు పెట్టలేదని నిలదీశారు. 
ఈ సందర్భంగా హైదరాబాద్‌సహా తెలంగాణలో ప్రజలు ముఖ్యంగా ముస్లింలు ఎదుర్కొంటన్న సమస్యలను అక్బరుద్దీన్ ప్రస్తావించారు. చాలా ఆవేశంగా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. చాలా సార్లు చాలా సమస్యల పరిష్కారానికి హామీ అయితే ఇచ్చారు కానీ ఇంత వరకు వాటిని చేసి చూపించ లేదన్నారు. బీజేపీకి వంతపాడేలా బీఆర్‌ఎస్‌ ఉందని... ఇన్నాళ్లూ తమ పార్టీ బీజేపీకి బీ పార్టీగా ప్రచారం చేశారని... ఇప్పుడు బీఆర్‌ఎస్‌ను బీజేపీకి ఏ పార్టీగా ప్రచారం చేస్తారని ఎద్దేవా చేశారు. 


అక్బరుద్దీ చేస్తున్న విమర్శలకు మంత్రి కేటీఆర్‌ లేచి ప్రతివిమర్శలు చేశారు. గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో వేరే అంశాల ప్రస్తావన ఎందుకు వస్తుందని అన్నారు. 105 మందికి ఉన్న తమ పార్టీకీ ఇస్తున్నంత టైమే అక్బరుద్దీన్‌కు ఇచ్చారని ఇది ఎంత వరకు కరెక్టన్ ప్రశ్నించారు. తమకు ఏం చేయాలో తెలుసని... అన్నారు. ఇంతలో స్పీకర్ కలుగుజేసుకొని డీవియేట్ కాకుండా సబ్జెక్ట్‌పై మాట్లాడి త్వరగా ముగించాలని అక్బరుద్దీన్‌కు రిక్వస్ట్ చేశారు. 


అంతకు ముందు గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ప్రవేశ పెట్టారు. దాన్ని ఎమ్మెల్యే వివేకానందగౌడ్‌ బలపరిచారు. తెలంగాణ అభివృద్ధి దేశానికి ఆదర్శంగా మారిందన్నారు. తెలంగాణలో ఆచరిస్తున్న పథకాలను దేశంలో చాలా రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నారన్నారు. ఈ మధ్య విశాఖ వెళ్లివస్తుండగా... తనను కొందరు కలిసి తమ అభిప్రాయాలు వెల్లబుచ్చారన్నారు వివేకానంద గౌడ్‌. ఏపీలో కేసీఆర్‌ లాంటి నాయకుడు ఉండి ఉంటే పోలవరం పూర్తి అయ్యేదని... చాలా కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు వచ్చేవన్నారు. విశాఖ, తిరుపతి, గుంటూరు, విజయవాడ లాంటి నగరాలు గొప్పగా అభివృద్ది చెందేవన్నారని తెలిపారు.