Nawaz Sharif: పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ లాహోర్ ఒప్పందంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఒప్పందాన్ని పాకిస్థాన్ ఉల్లంఘించిందని అంగీకరించారు. అదే కార్గిల్ యుద్ధానికి దారి తీసిందని స్పష్టం చేశారు. పాక్ ఈ తప్పు చేయడం వల్లే యుద్ధం జరిగిందని ఒప్పుకున్నారు. 1999లో అటల్ బిహారీ వాజ్‌పేయీ ప్రధానిగా ఉన్న సమయంలో భారత్, పాక్ మధ్య లాహోర్ ఒప్పందం కుదిరింది. 1998లో మే 28వ తేదీన పాకిస్థాన్ న్యూక్లియర్ బాంబులను పరీక్షించింది. ఆ తరవాత వాజ్‌పేయీ పాకిస్థాన్‌కి వెళ్లి లాహోర్ అగ్రిమెంట్ కుదిరేలా చొరవ చూపించారు. అయితే...ఈ ఒప్పందంలోని నిబంధనలకు అనుగుణంగా పాక్ నడుచుకోలేదని నవాజ్ షరీఫ్ అంగీకరించడం కీలకంగా మారింది. Pakistan Muslim League-Nawaz (PML-N) అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు నవాజ్. ఈ సందర్భంగానే ఈ వ్యాఖ్యలు చేశారు. అక్కడి సుప్రీంకోర్టు ఆయనపై నిషేధం విధించిన ఆరేళ్ల తరవాత మళ్లీ అధ్యక్ష పదవిని చేపట్టారు.
ఏంటీ లాహోర్ ఒప్పందం..?
అప్పటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ 1999లో ఫిబ్రవరి 21వ తేదీన భేటీ అయ్యారు. ఆ తరవాత ఇద్దరూ Lahore Declaration పై సంతకాలు చేశారు. రెండు దేశాల మధ్య శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు ఉద్దేశించిన ఒప్పందం ఇది. కానీ ఆ అగ్రిమెంట్‌ని పట్టించుకోకుండా పాకిస్థాన్ కార్గిల్‌లో జమ్ముకశ్మీర్‌లో చొరబడింది. ఫలితంగా భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అలా ఇరు దేశాల మధ్య పరిస్థితులు అదుపు తప్పి కార్గిల్ యుద్ధానికి (Kargil War) దారి తీసింది. న్యూక్లియర్ టెస్ట్‌లు చేయకుండా అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ తమకు డబ్బులు ఇచ్చేందుకు ప్రయత్నించారని, కానీ తాను అందుకు అంగీకరించలేదని వివరించారు నవాజ్ షరీఫ్.
"మేం న్యూక్లియర్ టెస్ట్‌లు చేయకుండా ఉండేందుకు అప్పటి అమెరికా ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ మాకు 5 బిలియన్ అమెరికన్ డాలర్లు ఆఫర్ చేశారు. కానీ నేను అందుకు ఒప్పుకోలేదు. ఒకవేళ అప్పట్లో ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉండి ఉంటే కచ్చితంగా ఆ ఆఫర్‌కి ఓకే చెప్పేవారు"
- నవాజ్ షరీఫ్, పాకిస్థాన్ మాజీ ప్రధాని
తనపై తప్పుడు కేసులు పెట్టి ప్రధాని పదవి నుంచి తొలగించేలా చేశారని, ఇది పాకిస్థాన్ స్పై ఏజెన్సీ పని అని ఆరోపించారు నవాజ్ షరీఫ్. ఇమ్రాన్‌ఖాన్‌ని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఓ వర్గం కావాలనే తనపై కుట్ర చేసిందని మండి పడ్డారు. ISI చీఫ్ నుంచి తనకు బెదిరింపులు వచ్చాయని, కానీ తాను అందుకు ఒప్పుకోలేదని తేల్చి చెప్పారు. కానీ ఆ తరవాత కేసులు పెట్టి ఇలా పదవి నుంచి తప్పించారని ఆరోపించారు. ప్రస్తుతం పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. చాలా రోజులుగా రాజకీయ అనిశ్ఛితి ఎదుర్కొంటున్న పాక్‌లో ఇటీవలే కొత్త ప్రభుత్వం కొలువు దీరింది. ఉన్న అప్పులు తీర్చుకోవడంలో దాయాది దేశం నానా అవస్థలు పడుతోంది. సాయం కావాలంటూ IMFని అభ్యర్థిస్తోంది. కానీ IMF మాత్రం తాము చెప్పిన కండీషన్స్ ఫాలో అయితేనే అప్పు ఇస్తామని తేల్చి చెబుతోంది.
Also Read: Cancer Treatment: వేల ఏళ్ల క్రితమే క్యాన్సర్‌కి చికిత్స, ఈజిప్టియన్‌లు అద్భుతాలు చేశారా?