AP Election Counting: ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సెంట్రలైజ్డ్ కంట్రోల్ రూము అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (AP CEO) ముఖేష్ కుమార్ మీనా (Mukesh Kumar Meena) అధికారులకు సూచించారు. పల్నాడు జిల్లాలో జూన్ 4న చేపట్టనున్న ఓట్ల లెక్కింపుకు సంబంధించిన ఏర్పాట్లను మంగళవారం ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా (Harish Kumar Gupta) పర్యవేక్షించారు. జేఎన్టీయూ కాకానిలోని కౌంటింగ్ కేంద్రం, కౌంటింగ్ ప్రక్రియ చేపట్టేందుకు చేసిన, చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.  అనంతరం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీకేష్ బిలత్కర్, ఎస్పీ మల్లిక గార్గ్ తదితరులతో కలసి సమీక్షా సమావేశం నిర్వహించారు.


అన్ని పార్టీల నేతలు సహకరించాలి
సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌కు అన్ని రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని ఎన్నికల అధికారులు కోరారు. కౌంటింగ్‌కు వచ్చే ఆయా పార్టీల ఏజెంట్లు ముందస్తుగానే పాసులు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. కౌంటింగ్ వచ్చే అభ్యర్థులు, ఏజెంట్లు వాహనాలను కౌంటింగ్ కేంద్రం వద్దకు అనుమతించేందుకు ముందస్తుగానే పాస్లు తీసుకోవాలన్నారు. కౌంటింగ్ కేంద్రంలోకి సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతిచ్చేది లేదన్నారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, ఒకరు గెలిస్తే మరొకరు ఓడతారని, గొడవలు చేసినంత మాత్రాన ఫలితాలు తారుమారు కావన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును ప్రతి ఒక్కరూ గౌరవించాలన్నారు. ఓట్ల లెక్కింపు అనంతరం ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించేంత వరకు అభ్యర్థుల ఏజెంట్లు అందుబాటులో ఉండాలన్నారు. ఫలితాలు వెలువడిన అనంతరం గెలిచిన, ఓటమి పాలైన అభ్యర్థులు, వారి ప్రతినిధులు శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. ఫలితాలు వెలువడిన తరువాత ఊరేగింపులు, డీజేలకు, ర్యాలీలకు అనుమతులు లేవన్నారు.


జాప్యం లేకుండా ఫలితాలు
రౌండ్ల వారీగా ఓట్లు లెక్కింపు చేపట్టి జాప్యం లేకుండా ఫలితాల వెల్లడికి చర్యలు తీసుకుంటున్నట్లు సీఈఓ మీనా తెలిపారు. కౌంటింగ్ సెంటర్‌లో, సెంటర్ బయట  జరిగేటప్పుడు అవాంచనీయ సంఘటనలు సంబంధిత రిటర్నింగ్ అధికారి వెంటనే స్పందించాలని తెలిపారు. అలాగే పోలింగ్ రోజున ఈవీఎంలు ధ్వంసం చేసిన కేసులలో ఉన్న వారిని, పోలింగ్ ముందు రోజు, పోలింగ్ తర్వాత రోజున హింసాత్మక ఘటనలలో పాల్గొన్న వారిని కౌంటింగ్ ఏజెంట్లుగా నియమించవద్దని మీనా సూచించారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ.. ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా జూన్ 3, 4, 5 తేదీలలో మద్యం అమ్మకాలు నిషేధించినట్లు చెప్పారు. ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను పరిశీలించాలన్నారు. జిల్లాలోని అన్ని హోటళ్లు, లాడ్జీల్లో ముమ్మర తనిఖీలు చేసి అనుమానితులను అదుపులోకి తీసుకోవాలని డీజీపీ సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని తెలిపారు. ఓట్లలెక్కింపు కేంద్రంవద్దకు ఎలాంటి ఆయుధాలతో రాకూడదని, మత్తు పదార్థాలు సేవించి రాకూడదన్నారు.  


అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిర్వహించేందుకు చేపట్టిన చర్యలను వివరించారు. ఈసారి భారీగా కౌంటింగ్ సూపర్ వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, మైక్రోఅబ్జర్వర్లు తదితరులతోపాటు ఇతర సిబ్బంది కౌంటింగ్ ప్రక్రియ అనుబంధ విధుల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని సూక్ష్మ పరిశీలన, సీసీ కెమెరాల నిఘా మధ్య ప్రక్రియను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఎక్కడా ఎలాంటి గందరగోళానికి తావులేకుండా సరైన విధంగా బ్యారికేడింగ్, సూచిక బోర్డులు ఏర్పాటు, వాహనాల పార్కింగ్, మీడియా కేంద్రం ఏర్పాటు, రౌండ్ల వారీగా ఫలితాల వెల్లడి ప్రణాళిక, అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లకు అవసరమైన ఏర్పాట్లు, మార్గదర్శకాల మేరకు కౌంటింగ్ టేబుళ్ల ఏర్పాటు తదితర అంశాలను వివరించారు. కౌంటింగ్ రోజు, ఆ తరువాత ఎంత వరకు అవసరమో అంతవరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. 


Also Read: ఏపీలో కాకరేపుతున్న పోస్టల్ పంచాయితీ, అర్ధరాత్రి తర్వాతే మొత్తం ఫలితాలు!